సాక్షి, హైదరాబాద్ : కామ్రేడ్ వరవరరావుపై కుట్ర ఆరోపణలను ఖండిస్తున్నామని, ఇది ప్రజాసంఘాలను, ప్రశ్నించే హక్కును అణచేందుకు కేంద్రం పన్నిన భారీ కుట్రని విప్లవ రచయితల సంఘం(విరసం) నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. భీమా, కోరెగావ్ హింసకు కారకులని ఆరోపిస్తూ దళిత, ఆదివాసీ హక్కుల, ప్రజాసంఘాల బాధ్యుల అరెస్ట్‌ను నిరసిస్తున్న సమయంలోనే అంతకన్నా కుట్రపూరిత చర్యలకు పోలీసులు తెరలేపారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీని చంపేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని ఒక లేఖను సృష్టించి అందులో విరసం వ్యవస్థాపక సభ్యులు కామ్రేడ్ వరవరరావు పేరును ఇరికించారని అన్నారు.
కోరేగావ్‌లో అసలు నిందితులైన సంఘ్ పరివార్ నాయకులను వదిలేసి దళిత, హక్కుల సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేసి ప్రజాస్వామిక భావాల వ్యక్తీకరణను అణచివేయాలని చూస్తున్నారని వాపోయారు. నాగ్‌పూర్ కేంద్రంగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ శక్తులు రచించిన కుట్రని ఆరోపించారు. మోదీపై కుట్ర పెద్ద అబద్దమని, అసలు కుట్ర మోదీ రాజ్యమే చేస్తున్నదని విరసం నేతలు ఆరోపించారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మతం పేరుతో, సంస్కృతి పేరుతో ప్రభుత్వం చేస్తున్న విన్యాసాలను, వికృత పోకడలను భీమా కోరెగావ్ మరోమారు అణగారిన ప్రజల ముందు పెట్టిందన్నారు.
అది సహించలేకే మోదీ ప్రభుత్వం ఫాసిజాన్ని అమలు చేస్తున్నదని ఆరోపించారు. నాగ్‌పూర్ నుంచి భీమా కోరెగావ్ మీదుగా హైదరాబాద్ దాకా ప్రభుత్వం పన్నిన కుట్రను తిప్పికొట్టవలసిందిగా ప్రజలకు, ప్రజాసంఘాలకు, ప్రజాస్వామిక వాదులకు విరసం విజ్ఞప్తి చేస్తున్నదని పత్రికా ప్రకటన ద్వారా విరసం నేతలు పాణి(కార్యదర్శి), కల్యాణ రావు(సీనియర్ సభ్యులు), వరలక్షి, కాశిం, రాంకీ(కార్యవర్గ సభ్యులు) తెలియజేశారు.
కుట్ర కేంద్రానిదే
Published Fri, Jun 8 2018 9:51 PM | Last Updated on Wed, Aug 15 2018 2:40 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment