
సాక్షి, హైదరాబాద్: విరసం అధ్యక్షుడు వరవరరావును అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభ ద్రం ఖండించారు. తక్షణ మే ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, మానవ, ప్రజాస్వామ్య హక్కులపై తీవ్ర దాడి జరుగుతోందన్నారు. అబద్ధపు అభియోగాలు మోపి తన ప్రత్యర్థులను కేసుల్లో ఇరికిస్తోందన్నారు. దీనిలో భాగంగానే వరవరరావు, ప్రొఫెసర్ సత్యనారాయణ, జర్నలిస్టులు కూర్మనాథ్, క్రాంతి టేకుల ఇళ్లలో సోదాలు నిర్వహించారని విమర్శించారు.
వరవరరావుది అక్రమ అరెస్టు: మంద కృష్ణ
సాక్షి, హైదరాబాద్: ఒక లేఖ ఆధారంగా పౌరహక్కుల నేత వరవరరావును పుణే పోలీసులు అరెస్టు చేయడం దారుణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆ లేఖ రాసింది మావోయిస్టులా? కాదా? అన్న విషయం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఈ లేఖను పోలీసులే సృష్టించారన్న పౌరహక్కుల నేతల ప్రశ్నకు సమాధానం చెప్పాలని మంగళవారం డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వెంటనే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. వరవరరావుపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలన్నారు.