సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గృహనిర్బంధంలో ఉన్న తన భర్త, విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు అవసరమైన వైద్యసాయాన్ని అందించేందుకు వైద్యుడిని అనుమతించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ, వరవరరావు సతీమణి హేమలత దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. వరవరరావు ఇంటికి గాంధీ ఆసుపత్రిలో సీనియర్ ఫిజీషియన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వైద్యుడిని పంపాలని డీజీపీని ఆదేశించింది. వరవరరావును పరిశీలించి ఆయనకు వైద్య సేవలు అవసరమైతే, వాటిని అందించాలని వైద్యుడిని ఆదేశించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను పుణే పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన వారిలో వరవరరావు కూడా ఉన్నారు. వీరందరి అరెస్టులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన సుప్రీంకోర్టు అరెస్ట్ చేసిన వారందరినీ గృహ నిర్బంధంలో ఉంచాలని పోలీసులను ఆదేశించింది. ఇదే రీతిలో వరవరరావు అరెస్ట్‌పై ఆయన సతీమణి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. గతవారం విచారణ సందర్భంగా వరవరరావుకు వైద్య సేవలు అందించేందుకు వైద్యుడిని సైతం పోలీసులు అనుమతించడం లేదని హేమలత హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో ధర్మాసనం వరవరరావుకు వైద్యసాయం కోసం పిటిషన్ దాఖలు చేసుకుంటే పరిశీలిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో హేమలత ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన ధర్మాసనం, ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డీజీపీకి తేల్చి చెప్పింది. అరెస్టయిన నేతల గృహ నిర్బంధాన్ని సుప్రీంకోర్టు పొడిగించిన నేపథ్యంలో హైకోర్టు కూడా తన విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
సీనియర్ ఫిజీషియన్‌ను పంపండి: హైకోర్టు
Published Thu, Sep 13 2018 2:06 AM | Last Updated on Thu, Sep 13 2018 2:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment