సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గృహ నిర్భంధంలో ఉన్న విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు అవసరమైన వైద్యసాయాన్ని అందించేందుకు వైద్యుడిని అనుమతించే విషయంలో పిటిషన్ దాఖలు చేసుకుంటే పరిశీలన జరుపుతామని వరవరరావు సతీమణికి హైకోర్టు స్పష్టం చేసింది. వరవరరావుతో పాటు దేశవ్యాప్తంగా పలువురు పౌర హక్కుల నేతల అరెస్టుపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరపనున్న నేపథ్యంలో వరవరరావు అరెస్ట్ వ్యవహారంపై హైకోర్టు తన విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను పూణే పోలీసులు గత నెల 28న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరందరి అరెస్టులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఇదే రీతిలో వరవరరావు అరెస్ట్‌పై కూడా ఆయన సతీమణి హేమలత ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, వరవరరావుకు వైద్య సేవలు అందించేందుకు వైద్యుడిని సైతం పోలీసులు అనుమతించడం లేదని కోర్టుకు నివేదించారు. తరువాత ప్రభుత్వ న్యాయవాది సంతోశ్ వాదనలు వినిపిస్తూ, పౌర హక్కుల నేతల అరెస్టులపై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరపనున్నదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై వచ్చే వారం విచారణ జరుపుతామని తెలిపింది. వరవరరావుకు వైద్య సేవల నిమిత్తం కుటుంబ డాక్టర్‌ను అనుమతించే విషయంపై పిటిషన్ దాఖలు చేస్తే పరిశీలన జరుపుతామని హేమలతకు ధర్మాసనం స్పష్టం చేసింది.
వరవరరావుకు వైద్య సాయంపై పిటిషన్ దాఖలు చేసుకోండి
Published Thu, Sep 6 2018 1:44 AM | Last Updated on Thu, Sep 6 2018 1:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment