
ప్రొ‘‘ సాయిబాబను కాపాడుకుందాం!
నాగపూర్ సెంట్రల్ జైలులోని అండా సెల్‌లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటికీ దిగజారడంతో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదికతో కలిసి ఫిర్యాదు చేశారు. ఆయనకు శిక్ష విధించే కొద్ది రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధికి సంబంధించిన ఆపరేషన్ మూడు వారాలలో చేయాలనీ డాక్టర్లు సూచించారు. ఈ మూడు నెలల కాలంలో ప్రొ. సాయిబాబకు జైలులో ఏ విధమైన వైద్య సహాయం అందలేదు. జైలు అధికారులు కానీ, డాక్టర్స్ కానీ మహారాష్ట్ర ప్రభుత్వం గానీ వైద్య సహాయం అందించలేకపోవడం వలన ఆయన ఆరోగ్యం బాగా పాడైపోయింది. మే నెల లోనే రెండుసార్లు స్పృహ తప్పడం జరిగింది. క్లోమ గ్రంధికి సంబంధించిన నొప్పి తీవ్రతరం అయింది. ఛాతి నొప్పి, గుండెదడ రావడం జరిగింది. జైలు డాక్టర్లు నాగపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచిం చినా జైలు అధికారులు ఒప్పుకోలేదు.
ప్రస్తుతం నాగపూర్ జైలులో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబ 90 శాతం శారీరక వైకల్యంతో వీల్ చెయిర్‌లోనే గడపాల్సిన పరిస్థితిలో ఉంటున్నారు. జైలులోని దుర్భర పరిస్థితులకు తోడు దాదాపుగా ఎవరిని కలిసే అవకాశం లేకుండా చేస్తున్నారు. పోలీసు, జైలు సిబ్బంది ఆయన పట్ల అత్యంత మొరటుతనంతో వ్యవహరిస్తున్నారు.
జైలులో ప్రొ. సాయిబాబ ఆరోగ్య పరిస్ధితిఫై జాతీయ మానవ హక్కుల కమిటీ (ఢిల్లీ) ఏక సభ్య బృందాన్ని మే 15వ తేదీన జైలుకు పంపింది. ప్రాణాం తక వ్యాధులను ఎదుర్కొంటున్న సాయిబాబకు ప్రాణ రక్షక చికిత్సను అందించడానికి బదులుగా ఆయనను జైలు డాక్టర్ పరీక్షించడానికి కూడా జైలు సిబ్బంది అనుమతించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జైల్లో సాయిబాబకు సృష్టిస్తున్న దుర్భర పరిస్థితులు ఆయన జీవితానికి, గౌరవానికి, సమానత్వ భావనకు భంగకరంగా మారడమే కాకుండా క్రూరమైన, అమానుషమైన పద్ధతులను పాటిస్తూ ఆయన ఆరోగ్య పరిరక్షణ హక్కు పట్ల కూడా వివక్ష ప్రదర్శిస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిటీకి ఫిర్యాదు చేయడం జరిగింది.
జీవించే హక్కులో భాగంగా ప్రొ. సాయిబాబ ఆరోగ్యంపై జైలు అధికారులు, మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. జైలులో ఉన్న సాయిబాబకు తగిన వైద్య సహాయం అందించాలి. గతంలో ఆయన వైద్యం చేయించుకున్న ఢిల్లీ ఆసుపత్రికి లేదా హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో ఉన్నాడు కాబట్టి అక్కడికే తరలించాలని డిమాండ్ చేస్తున్నాము. జైలులో ప్రొ. సాయిబాబ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ప్రభుత్వాలు కావాలనే ప్రొఫెసర్ సాయిబాబ ఆరోగ్యం విషమించాలని చూస్తున్నాయనిపిస్తోంది. జైలులోనే ఆయనను అనారోగ్యంతో చంపాలని చూస్తున్నాయి. జాతీయ మానవ హక్కుల కమిటీ వెంటనే స్పందించి ప్రొ. సాయిబాబకు తగిన వైద్య సహాయంతోబాటు, బెయిల్ ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరడం జరిగింది.
ప్రొ. సాయిబాబ సహచరి ఎ.ఎస్. వసంత కుమారి నుంచి వచ్చిన ఈ సమాచారం నేపథ్యంలో నాగపూర్ హై సెక్యూరిటీ జైలు అండా సెల్‌లో ఉన్న ప్రొ. సాయిబాబను ప్రాణాలతో కాపాడుకోవాలంటే ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించడానికి వీలుగా సికింద్రాబాద్ చర్లపల్లి హై సెక్యూరిటీ జైలుకు తరలించాలని ప్రజాస్వామ్యవాదులందరూ స్పందించాల్సిందిగా కోరుతున్నాను.
ఈ మేరకు మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెట్టి ఆ రెండు ప్రభుత్వాలు అంగీకరించిన తరువాత తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా అభ్యంతరం లేని విధంగా కృషి చేయాలని కోరుతున్నాను. హైకోర్టు, సుప్రీంకోర్టులకు సెలవులు ఉన్నందున బెయిల్ కోసం ప్రయత్నాలు చేయడం కంటే ముందుగా ప్రజాస్వామ్యవాదులందరూ తక్షణం చేపట్టవలసిన కర్తవ్యం ఇది అని విజ్ఞప్తి చేస్తున్నాను.
– వరవరరావు, విరసం వ్యవస్థాపక సభ్యుడు