
హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని విరసం నేత వరవరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం, మేళ్లమడుగులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రభుత్వమే అమాయకులను తన పోలీసులతో హత్య చేయించిందని ఆరోపించారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. వరవరరావు మాట్లాడుతూ వరుసగా జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో చనిపోయిన వారిలో ఏడుగురు ఆదివాసీలు, ఒక దళితుడు, ఒక లంబాడీ వ్యక్తి ఉన్నారని అన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను సస్పెండ్ చేసి న్యాయవిచారణ చేయాలని డిమాండ్ చేశారు.
మంద కృష్ణ మాదిగను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎస్సీ వర్గీకరణ చేసి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పీఎల్.విశ్వేశ్వర్ రావు, జస్టిస్ చంద్రకుమార్, విమలక్క, ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు, సీపీఐ నగర కార్యదర్శి డాక్టర్ సుధాకర్, వివిధ సంఘాల నేతలు మన్నారం నాగరాజు, నలమాస కృష్ణ, చిక్కుడు ప్రభాకర్, మోహన్ బైరాగి, ఉ.సాంబశివరావు, జాన్‌వెస్లీ, గురజాల రవీందర్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment