
సాక్షి, ముంబై: మహారాష్ట్ర పోలీసులకు మరోసారి షాక్ తగిలింది. దేశ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అయిదుగురు పౌరహక్కుల నేతల అరెస్టుల కేసులో రాష్ట్ర పోలీసుల వ్యవహరాన్ని కోర్టు తప్పుబట్టింది. రాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) పరంబీర్ సింగ్ మీడియా సమావేశంపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు సమర్ధించింది. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగానే పోలీసులు మీడియా సమావేశం నిర్వహించడాన్ని బాంబే హైకోర్టు ప్రశ్నించింది.
ఒకవైపు ఈ కేసును ఇన్ కెమెరా విచారణను కోరుతున్న పోలీసులు మరోవైపు మీడియా సమావేశంలో సాక్ష్యాలను బహిరంగ పర్చడటంపై పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించాలని కోరారు.
దేశవ్యాప్తంగా పౌరహక్కుల నేతల ఇళ్లలో సోదాలు, అరెస్టుల పర్వాన్ని సమర్ధించుకున్న రాష్ట్ర ఏడీజీ పరంబీర్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. వీరికి మావోయిస్టులకు సంబంధాలున్నాయనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయనీ, అందుకే అరెస్ట్ చేశామని చెప్పారు. తమవద్ద వేలకొద్దీ సాక్ష్యాలున్నాయంటూ కొన్ని లేఖలను మీడియా ముందు ప్రదర్శించారు.
కాగా భీమా కోరేగావ్ అల్లర్లు, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు భారీ కుట్ర చేసారనే అభియోగాలతో విప్లవకవి వరవరరావుతోపాటు, సుధా భరద్వాజ్, గౌతం నావ్‌లాక్, తెల్తూంద్డే, వెర్నన్ గొన్జాల్వేస్‌ను పుణే పోలీసులు గతవారం అరెస్ట్ చేసింది. అయితే ఈ అరెస్టులపై వచ్చిన అభ్యంతరాలను సమర్ధించిన సుప్రీంకోర్టు వీరిని సెప్టెంబరు 6వరకు హౌస్ అరెస్ట్‌లోఉంచాల్సిందిగా ఆదేశించింది. గత జూన్‌లో మావోయిస్టు వ్యతిరేక దాడుల్లో పూణే పోలీసులు ముంబై కు చెందిన సుధీర్ దవాలేను, ఢిల్లీకి చెందిన కార్యకర్త రోనా విల్సన్, న్యాయవాది సురేంద్ర గడ్లింగ్, ప్రొఫెసర్ షోమా సేన్, నాగపూర్ నుంచి ఆదివాసీ హక్కుల కార్యకర్త మహేశ్ రౌత్‌ను అరెస్టు చేసారు. మరోవైపు ఇది బీజేపీ రాజకీయ కుట్ర అని ఆ లేఖలన్నీ కల్పితాలనీ న్యాయమూర్తి సుధా భరద్వాజ్ ఖండించారు. ప్రజా ఉద్యమాలను అణిచివేతకు యత్నమని ఆరోపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment