నక్సల్బరీయే పీడిత జనవిముక్తి మార్గం | Virasam leader Varavara Rao comments on BJP | Sakshi
Sakshi News home page

నక్సల్బరీయే పీడిత జనవిముక్తి మార్గం

Published Fri, May 26 2017 1:49 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

నక్సల్బరీయే పీడిత జనవిముక్తి మార్గం - Sakshi

నక్సల్బరీయే పీడిత జనవిముక్తి మార్గం

విరసం నేత వరవరరావు
 
సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమబెంగాల్‌ డార్జిలింగ్‌ జిల్లాలోని కుగ్రామమైన నక్సల్బరీలో రాజుకున్న నిప్పురవ్వ విప్లవోద్యమ దావానలమై దేశమంతటా విస్తరించిందని, గడిచిన ఐదు దశాబ్దాల్లో పీడిత జనవిముక్తికి నక్సల్బరీయే ఏకైక మార్గమని రుజువు చేసిం దని విరసం నేత వరవరరావు అన్నారు. ఏభైయేళ్ల నక్సల్బరీ ఉద్యమ ప్రస్థానంపై ‘సోషలిజమే ప్రత్యామ్నాయమార్గం’గా పేర్కొంటూ గురువారం ఇక్కడ విరసం నేతృత్వంలో భారీ బహిరంగ సభ జరిగింది. నాలుగు రోజులుగా జరిగిన రాజకీయ తరగతుల ముగింపు సందర్భంగా జరిపిన ఈ సభ నక్సల్బరీలో 1967 మే 25న భూస్వామ్య వ్యతిరేక తిరుగుబాటులో మరణించిన పది మంది ఉద్యమకారులుసహా నాటి నుంచి నేటి వరకు అసువులు బాసిన అమరవీరులందరికీ రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించింది.

వరవరరావు మాట్లాడుతూ మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ ఇప్పటి వరకు పార్టీ ఎన్ని చీలికలైందో అంత ఐక్యతను సాధించిందని అన్నారు. గుజరాత్‌ నుంచి విషపు పడమటి గాలి తెలంగాణకు వీస్తున్నదన్నారు. అందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నల్లగొండలో రజాకార్లు దాడులు చేసిన ప్రాంతాల్ని సందర్శిస్తున్నారని విమర్శించారు. తాను అధ్యక్షుడిగా ఉన్న రివల్యూషనరీ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ని నిషేధించారే కానీ తన గొంతును నిషేధించలేదనీ, అందుకే మావోయుస్టు పార్టీ కేంద్ర కమిటీ పంపిన ప్రకటనను చదివి వినిపిస్తున్నానంటూ పేర్కొన్నారు. విరసం మరో నేత కల్యాణరావు మాట్లాడుతూ ఆకలి, అంటరానితనం, అసమానతలు న్నంతకాలం సాయుధ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రొఫెసర్‌ కాశీం మాట్లాడుతూ నక్సల్బరీ విప్లవోద్యమం తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పిందన్నారు. వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో పౌరహక్కుల సంఘం నేతలు నారాయణరావు, నలమాస కృష్ణ, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement