వరంగల్ : కేసీఆర్ ప్రభుత్వ తీరుపై విరసం నేత వరవరరావు మండిపడ్డారు. వరంగల్ జిల్లా మేడారం మండలం తాడ్వాయి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ఖచ్చితంగా బూటకం అని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని వరవరరావు విమర్శించారు. మైనింగ్ మాఫియాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న మావోయిస్టులను అంతమొందించాలని చూస్తోందంటూ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులు శ్రుతి, సాగర్ రెడ్డిల మృతదేహాలకు బుధవారం శవ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారి మృతదేహాలను పరిశీలించేందుకు వరవరరావు మార్చురీలోకి వెళ్తున్నారు.
ఆ క్రమంలో ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విరసం నేతలు, ప్రజా సంఘ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో వరవరరావు పైవిధంగా స్పందించారు. అంతకుముందు ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల కుటుంబ సభ్యులను వరవరరావు పరామర్శించారు.