
ప్రభుత్వాలు మారినా విధానాలు మారలేదు
విరసం నేత వరవరరావు ఆరోపణ
న్యూశాయంపేట: ప్రభుత్వాలు మారినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, వైఖరి మారడం లేదని, అణచివేతలు, బెదిరింపులు, బూటకపు ఎన్‌కౌంటర్లలో కాల్చిచంపడం యథావిధిగా కొనసాగిస్తున్నాయని విరసం నేత వరవరరావు ఆరోపించారు. సోమవారం ఆయన హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. పట్టపగలే ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టుకుంటే మఫ్టీ పోలీసులు తుపాకులతో వెంటాడుతున్నారని పేర్కొన్నారు. మార్చి 1న హసన్‌పర్తి మండలం మునిపల్లికి చెందిన దార సాంబయ్య ఇంటిపైకి వెళ్లి పోలీసులు నానా బీభత్సం సృష్టించారని పేర్కొన్నారు.
గతంలోనూ పోలీసులు సాంబయ్య కళ్లకు గంతలు కట్టి.. హైదరాబాద్ తీసుకెళ్లారని.. ఆహారంలో విషం కలిపి హరిభూషణ్, దామోదర్, ప్రభాకర్‌లకు తినిపించి చంపివేయాలని, లేకుంటే ఆకుల భూమయ్య, గంటి ప్రసాదంలకు పట్టిన గతే నీకూ పడుతుందని బెదిరించారన్నారు. ఉద్యమద్రోహానికి పాల్పడ లేక సాంబయ్య పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడని తెలిపారు. పోలీసుల బెదిరింపులకు సాంబయ్య తండ్రి వీరయ్య గుండెపోటుతో మరణించాడని చెప్పారు.
విలేకరుల సమావేశంలో పౌరహక్కుల సంఘం నాయకులు ఎ.సురేష్,పెంట రమేష్, బంధుమిత్రుల సంఘం నాయకురాలు అంజమ్మ, టీపీఎఫ్ నాయకులు జనగామ కుమారస్వామి, వోపీడీఆర్ నాయకులు బీరం రాములు రంజిత్, దార సాంబయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాగా విరసం నేత వరవరరావు ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు మఫ్టీ పోలీసులు వచ్చి వివరాలను రికార్ట్ చేశారు. ప్రెస్‌మీట్ అయిపోగానే హాల్ నుంచి వెళ్తున్న క్రమంలో వరవరరావు ‘ఎవరు మీరు’ అంటూ మఫ్టీలో ఉన్న వారిని ప్రశ్నించగా, పరిగెత్తారు. వారిని ప్రజాసంఘాల నాయకులు వెంబడించగా, తుపాకులు చూపి బెదిరించి పారిపోయారు.