హిందుత్వ నేత శంభాజీ బిడే
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా- కోరెగావ్ అల్లర్ల కేసు మరో మలుపు తిరిగింది. భీమా- కోరెగావ్ అల్లర్లు సహా ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర ఆరోపణలతో.. విరసం నేత వరవరరావు సహా మరో నలుగురు పౌర హక్కుల నేతలను పుణె పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం వారందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ కేసుకు సంబంధించిన విచారణను అత్యున్నత న్యాయస్థానం సెప్టెంబరు 6కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో భీమా- కోరెగావ్ హింసాకాండపై మహారాష్ట్ర ప్రభుత్వం రహస్య నివేదికను తెరపైకి తెచ్చింది. పది మంది సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ రూపొందించిన రహస్య నివేదిక జనవరి 20నే ప్రభుత్వానికి అందజేసింది.
వారిద్దరే ప్రణాళికలు రచించారు..
భీమా- కోరెగావ్ హింసాకాండకు హిందుత్వ సంస్థలకు చెందిన నేతలే కారణమని రహస్య నివేదిక వెల్లడించింది. వివాదాస్పద హిందుత్వ నేత శంభాజీ బిడే, మిలింద్ ఎక్బోటేలు కలిసి అల్లర్లకు ప్రణాళికలు రచించారని పేర్కొంది. ఈ మేరకు జనవరి 20న షోలాపూర్ రేంజ్ ఐజీ విశ్వాస్‌నాంగ్రే పాటిల్‌కు నిజనిర్ధారణ కమిటీ నివేదిక సమర్పించింది. అయితే ఇన్నాళ్లుగా ఈ కేసులో ఎటువంటి పురోగతి సాధించని మహారాష్ట్ర ప్రభుత్వం.. పౌర హక్కుల నేతల అరెస్టు తర్వాత నివేదికను తెరపైకి తీసుకురావడం.. మరోవైపు దీనికి అంతటికీ మావోయిస్టులే కారణం అంటూ మహారాష్ట్ర పోలీసులు ఆరోపణలకు దిగడంతో.. ఈ కేసులో గందరగోళం నెలకొంది.
కాగా గతేడాది డిసెంబర్ 31న పుణెకి సమీపంలోని భీమా కోరెగావ్ గ్రామంలో దళితులు, ఉన్నత వర్గమైన పీష్వాలకు మధ్య చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా పుణె పోలీసులు మంగళవారం ఉదయం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో విరసం నేత వరవరరావు, ముంబైలో హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, ఫరీదాబాద్‌లో ట్రేడ్ యూనియన్ కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్, ఢిల్లీలో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవలఖాలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: భీమా కోరేగావ్ సంఘటనకు బాధ్యలెవరు?)
Comments
Please login to add a commentAdd a comment