warangal encounter
-
స్పందించకుంటే ఉద్యమం ఉధృతం
రుణమాఫీపై ప్రభుత్వానికి టీడీఎఫ్ హెచ్చరిక హైదరాబాద్: రైతులకు ఒకేసారి మొత్తం రుణమాఫీ, వరంగల్ ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీడీఎఫ్) హెచ్చరించింది. రైతులకు మొత్తం రుణాన్ని మాఫీ చేయడంతోపాటు శ్రుతి, సాగర్ల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నెల 10న రైతుల ఆత్మహత్యలు, ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని ప్రజలను కోరింది. గురువారం మఖ్దూం భవన్లో రాష్ట్ర బంద్ పోస్టర్‌ను చాడ వెంకటరెడ్డి(సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), వరవరరావు(విరసం), వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), జానకి రాములు (రెవల్యూషనరీ సోషలిస్ట్‌పార్టీ), సంధ్య(పీఓడబ్ల్యూ), విమలక్క(అరుణోదయ) తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రైతుల సమస్యలపై వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేసి, వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ్మినేని మాట్లాడుతూ విమర్శలు, నిరసనలను సహించే పరిస్థితులలో కేసీఆర్ లేరని, ఆయన పాలన దొరల పాలనను తలపిస్తోందన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోకపోవడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని వరవరరావు విమర్శించారు. -
ఆ విషయంలో హరీశ్ తో పోటీ: కేటీఆర్
హైదరాబాద్ : అభివృద్ధి విషయం మాత్రమే తాను, హరీశ్ రావు పోటీ పడతామని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పోటీ ఉండటంలో తప్పులేదన్నారు. రైతులకు రుణమాఫీ విషయంలో వన్‌టైం సెటిల్మెంట్లో తమ వైఖరి స్పష్టం చేశామన్నారు. రాజకీయ లబ్ది కోసమే తమపై విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పోలీసుల తమ విధి నిర్వహణలో భాగంగానే వరంగల్ ఎన్కౌంటర్ జరిగిందని ఆయన అన్నారు. వాటర్ గ్రిడ్‌పై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. -
‘చలో అసెంబ్లీ’పై ఉక్కుపాదం
ఎక్కడికక్కడ టీడీఎఫ్ నేతలు, ప్రజాసంఘాల నాయకుల అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఎన్కౌంటర్ కు నిరసనగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీడీఎఫ్) బుధవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అరెస్టులు, గృహ నిర్బంధాలతో నాయకులను ఎక్కడికక్కడ నిలువరించారు. బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి వేదిక నేతలను, వారి మద్దతుదారులను అడ్డుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, బాగ్‌లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నారాయణగూడ క్రాస్‌రోడ్స్, ఇందిరాపార్కు, గన్‌పార్కు తదితర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. మంగళవారం రాత్రి నుంచే పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బుధవారం తెల్లవారుజాము నుంచి అరెస్టుల పర్వాన్ని కొనసాగించారు. సుందరయ్య విజ్ఞానకేంద్రం వద్దకు వచ్చిన వారిని వచ్చినట్టే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. విద్యావేత్త చుక్కా రామయ్యను ఉదయం నుంచి విద్యానగర్‌లోని ఆయన ఇంటి వద్ద గృహనిర్బంధంలో ఉంచారు. ఉదయం 11.15 గంటల సమయంలో సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత వేములపల్లి వెంకట్రామయ్య, విరసం నేతలు పాణి, రాంకీ, రివేరా, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు తదితరుల ను బాగ్‌లింగంపల్లి వద్ద, విరసం నేత వరవరరావు తదితరులను ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద అరెస్టు చేశారు. పోలీసుల కళ్లు గప్పి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి అసెంబ్లీ వైపు వెళ్లేందుకు యత్నించిన న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) నేతలు సంధ్య, గోవర్ధన్, నరేందర్ తదితరులను ఇందిపార్కు వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకొని వందలాది మంది న్యూడెమోక్రసీ కార్యకర్తలు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి అశోక్‌నగర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. చెరుకు సుధాకర్‌ను హిమాయత్‌నగర్ వద్ద, ఎన్కౌంటర్లో మృతి చెందిన శ్రుతి తల్లిదండ్రులు తంగెళ్ల సుదర్శన్, రమణను నారాయణగూడ వద్ద అరెస్టు చేశారు. ఎన్కౌంటర్ ను, పోలీసు నిర్బంధాన్ని నిరసిస్తూ నిజామాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్ అనే యువకుడు గన్‌పార్కు వ ద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనూ అరెస్టుల పర్వం కొనసాగింది. 50 మందికి పైగా విద్యార్థులను అరెస్టు చేశారు. ఓయూ తెలుగు విభాగానికి చెందిన ప్రొఫెసర్ కాశీం ఇంట్లో సోదాలు జరిపారు. కాశీం ఇంట్లో లేని సమయంలో వచ్చిన పోలీసులు.. అసాంఘిక శక్తులు ఉన్నట్లు తమకు సమాచారం ఉందంటూ దాదాపు అరగంటపాటు సోదాలు నిర్వహించారు. దోమలగూడలోని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యాలయంపై దాడి చేసి 15 మంది కళాకారులను అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర చోట్ల కూడా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా రాజధానిలో 400 మందికి పైగా వివిధ పార్టీలు, ప్రజాసంఘాలకు చెందిన కార్యకర్తలు, నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఉద్రిక్తత మంగళవారం రాత్రికే వివిధ జిల్లాల నుంచి సుమారు 200 మందికిపైగా నాయకులు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మకాం వేశారు. వచ్చిన వారిని వచ్చినట్టే పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. బారికేడ్లను దాటుకొని రావటానికి ప్రయత్నించిన ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావును అడ్డుకున్నారు. విజ్ఞాన కేంద్రం లోపల ఉన్న తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డి, వేములపల్లి వెంకట్రామయ్య, ఎండి.గౌస్ తదితర వామపక్ష, ప్రజా సంఘాల నేతలు ఒక్కసారిగా బయటికి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరికి అందరినీ అరెస్ట్ చేసి 11 వాహనాల్లో ఫలక్నామా, గాంధీనగర్, గోషామహల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. నిఘా నీడలో అసెంబ్లీ ఈ ఆందోళన నేపథ్యలో శాసనసభ పరిసరాలను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. గణేశ్ నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు మౌంటెడ్ కెమెరా వాహనాలతో గస్తీ నిర్వహించారు. సెంట్రల్ కమాండింగ్ సెంటర్ నుంచి నిఘా కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. అమానవీయం: హరగోపాల్ ‘‘ఎన్నో ఏళ్లుగా మానవీయమైన, ప్రజాస్వామిక తెలంగాణ కోసం కలగన్నాం. ఇలాంటి పాశవికమైన, అమానవీయమైన తెలంగాణ వస్తుందనుకోలేదు. శృతి, సాగర్‌లపై ఏకపక్షంగా కాల్పులు జరిపి చంపిన తీరు దారుణం. ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షను ప్రభుత్వం ఒక్కరోజుతో కల్లలు చేసింది’ అని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సుందర య్య విజ్ఞాన కేంద్రం వద్ద విలేకరులతో మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం తీసిపోని విధంగా మన రాష్ట్రంలో.. మన పిల్లలను హతమారుస్తున్నారన్నారు. విజయవంతమైనట్లే: టీడీఎఫ్ ప్రభుత్వం పోలీసుల ద్వారా పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగించినా తాము చేపట్టిన చలో అసెంబ్లీ విజయవంతమైనట్లేనని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టీడీఎఫ్) తెలిపింది. ప్రజాస్వామ్యయుతంగా తలపెట్టిన కార్యక్రమాన్ని అణిచివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. టీడీఎఫ్ మావోయిస్టు ఎజెండాను అనుసరించడం లేదని, సామాజిక తెలంగాణ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కు పోరాడుతుందని పేర్కొంది. బుధవారం రాత్రి వివిధ పోలీస్స్టేషన్ల నుంచి విడుదలయ్యాక మఖ్దూంభవన్‌లో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), వరవరరావు (విరసం), వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యూ), విమలక్క(అరుణోదయ) విలేకరులతో మాట్లాడారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌పై అసెంబ్లీలో చర్చ కోసం 344 నిబంధన కింద ప్రతిపక్ష సభ్యులు నోటీసు ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే దోషిగా నిలబడాల్సి వస్తుందన్నారు. -
'అరెస్ట్‌లతో ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు'
హైదరాబాద్: వరంగల్ ఎన్‌కౌంటర్‌పై నిరసనగా బుధవారం చలో అసెంబ్లీకి ప్రజాసంఘాల నేతలు, వామపక్షాల నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యార్థులను, పలువురు నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్యను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. గృహనిర్బంధంలో ఉన్న చుక్కారామయ్య తన నివాసం నుంచి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు ఉదయం సీఐ తన ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తున్నానని చెప్పినట్టు ఆయన అన్నారు. ప్రజల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని కోరారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ప్రజల ఆకాంక్షలను అణిచివేయలేరని చుక్కా రామయ్య స్పష్టం చేశారు. -
'అరెస్ట్‌లతో ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు'
-
'ఆ నేతలను తక్షణమే విడుదల చేయాలి'
హైదరాబాద్: ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేయడంపై తాను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిరసన తెలిపే హక్కును అణిచివేయడం అప్రజాస్వామికమని అన్నారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌పై నిరసనగా చలో అసెంబ్లీకి ప్రజా సంఘాల నేతలు పిలపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ ఎన్‌కౌంటర్‌పై అసెంబ్లీలో చర్చ జరపాలని ఆయన కోరారు. అరెస్ట్ చేసిన ప్రజాసంఘాల నేతలను తక్షణమే విడుదల చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. -
'అసెంబ్లీలో వరంగల్ ఎన్‌కౌంటర్‌పై చర్చ పెట్టాలి'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో వరంగల్ ఎన్‌కౌంటర్‌పై చర్చ పెట్టాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బుధవారం చలో అసెంబ్లీ నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటివరకు 5000 మందిని అరెస్ట్ చేశారని చెప్పారు. ఉస్మానియాలో విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీపీఐ తెలంగాణ రాష్ర్ట ఎన్నికల కమిటీ కన్వీనర్ చాడా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు ఎన్ని నిర్భందాలు సృష్టించినా అసెంబ్లీ వరకు చేరుకుంటామని అన్నారు. తెలంగాణ జిల్లాల్లో ఎక్కడిక్కడ నిరసనలు చేపట్టాలని చాడ పిలుపునిచ్చారు. -
ఎన్‌కౌంటర్‌కు నిరసనగా చలో అసెంబ్లీ
-
ఎవరి వ్యూహాల్లో వారు
- టీడీఎఫ్ చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు - ఎలాగైనా నిర్వహించి తీరాలని వేదిక నేతల పట్టు సాక్షి, హైదరాబాద్: ఆరునూరైనా అసెంబ్లీకి చేరుకోవాలని అటు టీడీఎఫ్ పట్టు.. ఎలాగైనా అడ్డుకోవాలని ఇటు పోలీసుల ప్రయత్నం! ఇలా ఎవరికి వారు వ్యూహాల్లో మునిగిపోయారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీడీఎఫ్) బుధవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా వివిధ ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, పది వామపక్ష పార్టీల నేతలు ఎవరికి వారే అసెంబ్లీకి చేరుకోవాలని నిర్ణయించారు. విరసం నేత వరవరరావు, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, న్యూడెమోక్రసీ-చంద్రన్న నాయకుడు కె.గోవర్దన్, ఇతర పార్టీల ముఖ్యులు పోలీసులకు చిక్కకుండా మంగళవారం రాత్రే అజ్ఞాతంలోకి వెళ్లారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద అనుమతిస్తే ప్రదర్శన ఉంటుందని, లేదంటే ఎవరికి తోచిన పద్ధతుల్లో వారు అసెంబ్లీకి చేరుకునే యత్నం చేయాలని భావిస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు రాష్ర్టవ్యాప్తంగా దాదాపు 2 వేల మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని టీడీఎఫ్ నేతలు చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం మూడేళ్ల క్రితం సరిగ్గా సెప్టెంబర్ 30 చేపట్టిన ‘సాగరహారం’ స్ఫూర్తితో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. నిర్బంధకాండ.. చలో అసెంబ్లీని భగ్నం చేసేందుకు పోలీసులు కుట్ర పన్నారని టీడీఎఫ్ పేర్కొంది. అరెస్ట్‌లు, బైండోవర్లు, నాయకుల ఇళ్ల ముందు పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి నాయకులను గృహ నిర్భంధం చేశారని ధ్వజమెత్తింది. జిల్లాల్లో పార్టీ కార్యకర్తలను నిర్బంధించారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి తెలిపారు. అరెస్ట్ చేసినా, అడ్డుకున్నా ప్రదర్శనలు జరిపి తీరుతామన్నారు. పోలీసుల అణచివేతతో రాష్ట్రంలో నిర్బంధం తాండవిస్తోందని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని న్యూడెమోక్రసీ-చంద్రన్న నేతలు సాధినేని వెంకటేశ్వరరావు, కె.గోవర్దన్ డిమాండ్ చేశారు. ర్యాలీకి అనుమతి లేదు: పోలీసులు టీడీఎఫ్ తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’కి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించారు. టీడీఎఫ్ ముసుగులో మావోయిస్టులు రాష్ట్ర రాజధానిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నందున అనుమతి తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 6 వరకు నగరంలో నిషేధాజ్ఞలు విధించారు. నగరంలో సభలు, సమావేశాలతో పాటు, గుంపులు సంచరించడానికి వీలు లేదని స్పష్టంచేశారు. ర్యాలీలో రాష్ట్రం నిషేధించిన రెవెల్యూషన్ డెమెక్రటిక్ ఫ్రంట్(ఆర్డీఎఫ్), రాడికల్ యూత్ లీగ్ లీగ్(ఆర్‌వైఎల్), రైతు కూలీ సంఘం(ఆర్సీఎస్), రాడికల్ స్టూడెంట్స్ యూనియన్స్, సింగరేణి కార్మిక సమాఖ్య, విప్లవ కార్మిక సమాఖ్య, ఆలిండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. రెండ్రోజుల క్రితమే టీడీఎఫ్ సానుభూతిపరులు హైదరాబాద్‌కు చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు అసెంబ్లీ ప్రాంగణంలో అదనంగా మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. -
బెల్లంపల్లిలో పోలీసుల తనిఖీలు
వరంగల్ జిల్లాలో జరిగిన శృతి, విద్యాసాగర్‌ల ఎన్‌కౌంటర్‌పై సీబీఐతో విచారణ చేపట్టాలని కోరుతూ.. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హైదరాబాద్ వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నుంచి రాజధాని వెళ్లడానికి సిద్ధమవుతున్న శ్రేణులను మంగళవారం సాయంత్రం పోలీసులు ప్రత్యేక బలగాల సాయంతో అడ్డుకుంటున్నారు. పట్టణం నుంచి బయటకు వెళ్తున్న వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. -
చలో అసెంబ్లీకి అనుమతి లేదు
వరంగల్ ఎన్ కౌంటర్ కు నిరసనగా బుధవారం వామపక్షాలు తలపెట్టిన చలో అసెంబ్లీకి ఎలాంటి అనుమతి లేదని పోలీసు అధికారులు తెలిపారు. మావోయిస్టులకు మద్దతుగా కొంత మంది ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎవరూ పాల్గొన కూడదని సూచించారు. ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరంగల్ ఎన్ కౌంటర్ కి నిరసనగా 371 ప్రజాసంఘాలు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టిన సంగతి తెలిందే. -
వామపక్షాల ఛలో అసెంబ్లీకి నో పర్మిషన్
హైదరాబాద్ : వామపక్షాలు తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా వామపక్షాలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో అసెంబ్లీ భద్రతా దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు. -
'కేసీఆర్ అసలు రంగు బయటపడింది'
ఖమ్మం: వరంగల్ జిల్లాలోని శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిల ఎన్‌కౌంటర్‌తో సీఎం కేసీఆర్ అసలు రంగు బయటపడిందని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. ఖమ్మం పట్టణంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ప్రభుత్వంలో కూడా ఇటువంటి దారుణం జరగలేదని, అత్యాచారం చేసి, యాసిడ్ పోసి చంపడం ఘోరమన్నారు. ఎన్నికల ముందు కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఎన్నికల తర్వాత హామీని విస్మరించారన్నారు. వాళ్ల పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదువులు చదువుకోవచ్చునని, పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ప్రభుత్వ పాఠశాలల్లోని తెలుగు మీడియంలో చదవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితిలో పేద విద్యార్థులు సంపన్నుల కుమారులతో ఎలా పోటీపడతారన్నారు. క్షేత్రస్థాయి నుంచి ఉచితంగా ఇంగ్లిష్ విద్యను అందించాలని, అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేయాలన్నారు. అలాగే బడ్జెట్లో విద్యకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీపీఈఆర్‌ఎం రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, ఖమ్మం జిల్లా నాయకులు ఉపేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎన్కౌంటర్’పై 30న చలో అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని... ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై అత్యాచారం, హత్యానేరాల కింద కేసులు నమోదు చేయాలని ‘తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీపీవీ)’ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీనిపై ఈ నెల 30వ తేదీన చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కోసం పది వామపక్షాలతో పాటు తెలంగాణ ప్రజాఫ్రంట్, విద్యావంతుల వేదిక, జర్నలిస్టుల ఫోరం, రైతాంగ సమితి, విరసం, ఎమ్మార్పీఎస్, అడ్వొకేట్స్ జేఏసీ, మున్సిపల్ జేఏసీ, మానవహక్కుల వేదిక, రైతు, రైతు కూలీ, మహిళా, కార్మిక, విద్యార్థి సంఘాలు, సంస్థలు, మేధావులు కలసి విశాల ప్రాతిపదిక న ‘తెలంగాణ ప్రజాస్వామిక వేదిక’(టీపీవీ) ఏర్పాటైంది. వరంగల్ ఎన్కౌంటర్లో శ్రుతి, సాగర్లను పాశవికంగా హతమార్చడాన్ని టీపీవీ ఖండించింది. దీనిపై న్యాయవిచారణ జరిపించి టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. 30వ తేదీన చేపట్టనున్న చలో అసెంబ్లీ పోస్టర్‌ను గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో విరసం నేత వరవరరావు, విద్యావేత్త చుక్కా రామయ్య, చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), కె.గోవర్ధన్ (న్యూడెమోక్రసీ-చంద్రన్న), జానకిరాములు (ఆర్ఎస్పీ), సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్), విమలక్క (టఫ్), రాజేందర్‌రెడ్డి (అడ్వొకేట్స్ జేఏసీ), గురిజాల రవీందర్రావు (టీవీవీ), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఉద్యమ వేదిక), ఉ.సాంబశివరావు, పాశం యాదగిరి (సీనియర్ జర్నలిస్టు), సనావుల్లాఖాన్ తదితరులు విడుదల చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌కు రాష్ర్ట ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఈ ఎన్‌కౌంటర్‌పై కేసీఆర్ బోను ఎక్కాల్సిందేనని వరవరరావు వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని, ఆదేశిక సూత్రాలను పట్టించుకోకుండా, విలువలను పాటించకుండా వ్యవహరిస్తే.. ప్రజలే ప్రభుత్వాన్ని ఎండగడతారన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని చుక్కారామయ్య డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ప్రజాస్వామ్యబద్ధమైన వాతావరణమే లేదని చాడ వెంకటరెడ్డి అన్నారు. మావోయిస్టుల ఎజెండానే తన ఎజెండా అన్న కేసీఆర్ వారిని అంతమొందించడమే ఆయన ఎజెండానా అని నిలదీశారు. ఉన్నతస్థాయిలో రాజకీయ నిర్ణ యం లేనిదే ఈ ఎన్కౌంటర్ జరగదని... శ్రుతి, సాగర్లను దారుణంగా చంపారని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్ కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యేనని వేములపల్లి వెంకటరామయ్య, గోవర్ధన్ ఆరోపించారు. నా కడుపు కోత మరెవరికీ వద్దు... నాలాంటి కడుపుకోత మరో తల్లికి రాకూడదు. రాష్ట్రంలో ఎన్కౌంటర్లే ఉండకూడదు. పేదల కష్టాలను చూసి వారి కోసం పనిచేసేందుకు శ్రుతి వెళ్లింది. నా బిడ్డను దారుణంగా హింసించి, అత్యాచారం చేసి, యాసిడ్ పోసి ఘోరాతిఘోరంగా హత్యచేశారు. - శ్రుతి తల్లి రమాదేవి -
'సర్కార్ హత్యలతో పాటు అత్యాచారాలు చేయిస్తోంది'
హన్మకొండ చౌరస్తా: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ హత్యలతో పాటుగా అత్యాచారాలను చేయిస్తోందని, వరంగల్‌లో జరిగింది ఎన్కౌంటర్ కాదని అవి ముమ్మాటికీ హత్యలేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శృతి, విద్యాసాగర్‌రెడ్డిల ఎన్‌కౌంటర్‌పై తీవ్రంగా స్పందించారు. గత ప్రభుత్వాలు కేవలం ఎన్కౌంటర్లు మాత్రమే చేయించేవి, కానీ కేసీఆర్ సర్కార్ హత్యలే కాదు అత్యాచారాలను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. కార్మిక సమ్మేళనం, కార్మిక హక్కులను కాలరాస్తూ రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యూడలిస్టు పాలన కొనసాగిస్తున్నాడని దుయ్యబట్టారు. రాజ్యాంగ బద్ధంగా చేస్తున్న సమ్మెలను అణగదొక్కుతు నిరంకుశ పాలనకు అద్దం పడుతున్నాడని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1300ల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అందులో కొందరికి కేవలం రూ. 1.50 లక్షల నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకున్న సీఎం కేసీఆర్, ఇక నుంచి మరణించిన రైతు కుటుంబాలకు ఆరు లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తానని ప్రకటించడం దౌర్భాగ్యమన్నారు. త్వరలో జరగనున్న వరంగల్ లోక్‌సభ స్థానానకి జరిగే ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థిని అక్టోబర్ 1వ తేదీన వామపక్షాలు, ప్రజా సంఘాలతో చర్చించి ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రాములు, ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రాగుల రమేష్, వెంకట్ లు పాల్గొన్నారు. -
'ఎన్కౌంటర్ల పేరుతో తుదముట్టించడమే టీఆర్ఎస్ ఎజెండా'
తొర్రూరు: వరంగల్ జిల్లాలోని తడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి, అజ్ఞాతనేత కామ్రేడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కామ్రేడ్ శృతి, విద్యాసాగర్‌రెడ్డిలను ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపడాన్ని న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. నక్సలైట్ల ఏజెండానే మా ఏజెండా అని ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారై ఎంపీ కవిత అనేకసార్లు ప్రకటించిందన్నారు. నక్సలైట్లను బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో తుదముట్టించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ఏజెండానా అని ప్రశ్నించారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పులు రాకుండా బూటకపు ఎన్కౌంటర్లతో బంగారు తెలంగాణ ఏలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పౌర హక్కుల గురించి మాట్లాడిన కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత పౌర హక్కులను హరించేవిధంగా పని చేయాడం దుర్మార్గమన్నారు. -
వరవరరావు సంచలన వ్యాఖ్యలు
-
వరవరరావు సంచలన వ్యాఖ్యలు
వరంగల్: విప్లవ కవి వరవరరావు వరంగల్ ఎన్ కౌంటర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శృతిని లైంగికంగా హింసించి, యాసిడ్ పోసి పోలీసులు హతమార్చారని ఆయన ఆరోపించారు. మైనింగ్ మాఫియా కోసమే ఈ దారుణానికి పాల్పడ్డారని, బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు తరహాలో కేసీఆర్ రాజ్యహింసకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల కుటుంబాలను బుధవారం ఆయన పరామర్శించారు. వరంగల్ జిల్లా గోవిందరావుపేట-తాడ్వాయి అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్ లో తంగెళ్ల శృతి(23) అలియాస్ మహిత, మణికంటి విద్యాసాగర్ రెడ్డి(27) అలియాస్ సాగర్ మృతి చెందారు. శ్రుతి హన్మకొండలోని తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (ఈసీఈ) పూర్తిచేసి హైదరాబాద్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ ఫైనలియర్ చదువుతోంది. -
ఆ ఎర్రని మందారం.. రాలిపోయింది!
ఈమె పేరు శృతి.. వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన యువతి. బీటెక్ పూర్తి చేసిన శృతి ప్రస్తుతం నల్ల మల్లారెడ్డి కాలేజీలో ఎంటెక్ చదువుతోంది. తండ్రి పేరు సుదర్శన్. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో ప్రభుత్వ టీచర్. ఆయనకు నలుగురు కూతుళ్లు. వాళ్లలో శృతి రెండో అమ్మాయి. సుదర్శన్ విరసంలో సభ్యుడు. శృతి పుట్టినప్పుడు ఆయన రాసుకున్న కవిత ఇది.... మా ఇంటి చెట్టులో ఒక కొమ్మకూ విరబూసే ఎర్రని మందారం ఆగస్టు 22నాడు మసక చీకట్లు కమ్మేటీ కాలంబులో వాన చినుకన్న లేకుండా భూగోళం వేడేక్కిపోతున్న కాలంబులో లోకానికే అన్నదాత అయిన రైతు ప్రాణాలు దీసుకునే కాలంబులో పోరుకే ప్రయోగశాలయైన పోరు ఖిల్లన్న పేరున్న జిల్లాలోనా 60 ఏండ్ల పోరులోన అసువులు బాసి సాధించుకున్న తెలంగాణలోన ఆదివాసులే జనతన సర్కారయి స్వావలంబన జేసేటీ కాలంబులో దండకారణ్యమే ఎర్రసైన్యమయ్యి గ్రీనుహంటును ఎదిరించే కాలంబులో శ్రామిక రాజ్యం స్థాపనకై శ్రవజీవులేకమై తీరాలని -
వరవరరావును అడ్డుకున్న పోలీసులు
వరంగల్ : కేసీఆర్ ప్రభుత్వ తీరుపై విరసం నేత వరవరరావు మండిపడ్డారు. వరంగల్ జిల్లా మేడారం మండలం తాడ్వాయి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ఖచ్చితంగా బూటకం అని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని వరవరరావు విమర్శించారు. మైనింగ్ మాఫియాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న మావోయిస్టులను అంతమొందించాలని చూస్తోందంటూ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులు శ్రుతి, సాగర్ రెడ్డిల మృతదేహాలకు బుధవారం శవ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారి మృతదేహాలను పరిశీలించేందుకు వరవరరావు మార్చురీలోకి వెళ్తున్నారు. ఆ క్రమంలో ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విరసం నేతలు, ప్రజా సంఘ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో వరవరరావు పైవిధంగా స్పందించారు. అంతకుముందు ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల కుటుంబ సభ్యులను వరవరరావు పరామర్శించారు. -
కేసీఆర్ మాట తప్పారు
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో మేడారం అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్ బూటకమని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో ఎర్రబెల్లి మాట్లాడుతూ... ఎన్కౌంటర్లో మరణించిన శృతి, సాగర్‌రెడ్డిని పోలీసులే తీసుకెళ్లి చంపారని విమర్శించారు. వారిద్దరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడారని ఆయన గుర్తు చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. నక్సల్స్ అజెండానే తమ అజెండా అని గతంలో ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఆ మాట తప్పారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం తొలి ఎన్ కౌంటర్ మంగళవారం వరంగల్ జిల్లా మేడారం మండలం తాడ్వాయి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. వారిద్దరికి బుధవారం వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ ఎన్‌కౌంటర్‌పై టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావుపైవిధంగా స్పందించారు. -
వరంగల్ ఎంజీఎంకు మృతదేహాలు
వరంగల్ : వరంగల్ జిల్లా జనగాం-ఆలేరు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాదుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు వికారుద్దీన్, అంజాద్, అనీఫ్, జకిర్, ఇజార్‌ఖాన్ హతమైన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్‌కౌంటర్‌ను వికారుద్దీన్ తండ్రి మహ్మద్ హైమద్ ఖండించారు. కేసు విచారణ ముగిసే సమయానికి పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై తాము కోర్టుకు వెళతామని చెప్పారు.