
ఎవరి వ్యూహాల్లో వారు
ఆరునూరైనా అసెంబ్లీకి చేరుకోవాలని అటు టీడీఎఫ్ పట్టు...
- టీడీఎఫ్ చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు
- ఎలాగైనా నిర్వహించి తీరాలని వేదిక నేతల పట్టు
సాక్షి, హైదరాబాద్: ఆరునూరైనా అసెంబ్లీకి చేరుకోవాలని అటు టీడీఎఫ్ పట్టు.. ఎలాగైనా అడ్డుకోవాలని ఇటు పోలీసుల ప్రయత్నం! ఇలా ఎవరికి వారు వ్యూహాల్లో మునిగిపోయారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీడీఎఫ్) బుధవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా వివిధ ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, పది వామపక్ష పార్టీల నేతలు ఎవరికి వారే అసెంబ్లీకి చేరుకోవాలని నిర్ణయించారు. విరసం నేత వరవరరావు, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, న్యూడెమోక్రసీ-చంద్రన్న నాయకుడు కె.గోవర్దన్, ఇతర పార్టీల ముఖ్యులు పోలీసులకు చిక్కకుండా మంగళవారం రాత్రే అజ్ఞాతంలోకి వెళ్లారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద అనుమతిస్తే ప్రదర్శన ఉంటుందని, లేదంటే ఎవరికి తోచిన పద్ధతుల్లో వారు అసెంబ్లీకి చేరుకునే యత్నం చేయాలని భావిస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు రాష్ర్టవ్యాప్తంగా దాదాపు 2 వేల మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని టీడీఎఫ్ నేతలు చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం మూడేళ్ల క్రితం సరిగ్గా సెప్టెంబర్ 30 చేపట్టిన ‘సాగరహారం’ స్ఫూర్తితో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని పేర్కొన్నారు.
నిర్బంధకాండ..
చలో అసెంబ్లీని భగ్నం చేసేందుకు పోలీసులు కుట్ర పన్నారని టీడీఎఫ్ పేర్కొంది. అరెస్ట్‌లు, బైండోవర్లు, నాయకుల ఇళ్ల ముందు పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి నాయకులను గృహ నిర్భంధం చేశారని ధ్వజమెత్తింది. జిల్లాల్లో పార్టీ కార్యకర్తలను నిర్బంధించారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి తెలిపారు. అరెస్ట్ చేసినా, అడ్డుకున్నా ప్రదర్శనలు జరిపి తీరుతామన్నారు. పోలీసుల అణచివేతతో రాష్ట్రంలో నిర్బంధం తాండవిస్తోందని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని న్యూడెమోక్రసీ-చంద్రన్న నేతలు సాధినేని వెంకటేశ్వరరావు, కె.గోవర్దన్ డిమాండ్ చేశారు.
ర్యాలీకి అనుమతి లేదు: పోలీసులు
టీడీఎఫ్ తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’కి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించారు. టీడీఎఫ్ ముసుగులో మావోయిస్టులు రాష్ట్ర రాజధానిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నందున అనుమతి తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 6 వరకు నగరంలో నిషేధాజ్ఞలు విధించారు. నగరంలో సభలు, సమావేశాలతో పాటు, గుంపులు సంచరించడానికి వీలు లేదని స్పష్టంచేశారు.
ర్యాలీలో రాష్ట్రం నిషేధించిన రెవెల్యూషన్ డెమెక్రటిక్ ఫ్రంట్(ఆర్‌డీఎఫ్), రాడికల్ యూత్ లీగ్ లీగ్(ఆర్‌వైఎల్), రైతు కూలీ సంఘం(ఆర్‌సీఎస్), రాడికల్ స్టూడెంట్స్ యూనియన్స్, సింగరేణి కార్మిక సమాఖ్య, విప్లవ కార్మిక సమాఖ్య, ఆలిండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. రెండ్రోజుల క్రితమే టీడీఎఫ్ సానుభూతిపరులు హైదరాబాద్‌కు చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు అసెంబ్లీ ప్రాంగణంలో అదనంగా మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.