leader varavararavu
-
ఎవరి వ్యూహాల్లో వారు
- టీడీఎఫ్ చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు - ఎలాగైనా నిర్వహించి తీరాలని వేదిక నేతల పట్టు సాక్షి, హైదరాబాద్: ఆరునూరైనా అసెంబ్లీకి చేరుకోవాలని అటు టీడీఎఫ్ పట్టు.. ఎలాగైనా అడ్డుకోవాలని ఇటు పోలీసుల ప్రయత్నం! ఇలా ఎవరికి వారు వ్యూహాల్లో మునిగిపోయారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీడీఎఫ్) బుధవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా వివిధ ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, పది వామపక్ష పార్టీల నేతలు ఎవరికి వారే అసెంబ్లీకి చేరుకోవాలని నిర్ణయించారు. విరసం నేత వరవరరావు, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, న్యూడెమోక్రసీ-చంద్రన్న నాయకుడు కె.గోవర్దన్, ఇతర పార్టీల ముఖ్యులు పోలీసులకు చిక్కకుండా మంగళవారం రాత్రే అజ్ఞాతంలోకి వెళ్లారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద అనుమతిస్తే ప్రదర్శన ఉంటుందని, లేదంటే ఎవరికి తోచిన పద్ధతుల్లో వారు అసెంబ్లీకి చేరుకునే యత్నం చేయాలని భావిస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు రాష్ర్టవ్యాప్తంగా దాదాపు 2 వేల మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని టీడీఎఫ్ నేతలు చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం మూడేళ్ల క్రితం సరిగ్గా సెప్టెంబర్ 30 చేపట్టిన ‘సాగరహారం’ స్ఫూర్తితో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. నిర్బంధకాండ.. చలో అసెంబ్లీని భగ్నం చేసేందుకు పోలీసులు కుట్ర పన్నారని టీడీఎఫ్ పేర్కొంది. అరెస్ట్‌లు, బైండోవర్లు, నాయకుల ఇళ్ల ముందు పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి నాయకులను గృహ నిర్భంధం చేశారని ధ్వజమెత్తింది. జిల్లాల్లో పార్టీ కార్యకర్తలను నిర్బంధించారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి తెలిపారు. అరెస్ట్ చేసినా, అడ్డుకున్నా ప్రదర్శనలు జరిపి తీరుతామన్నారు. పోలీసుల అణచివేతతో రాష్ట్రంలో నిర్బంధం తాండవిస్తోందని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని న్యూడెమోక్రసీ-చంద్రన్న నేతలు సాధినేని వెంకటేశ్వరరావు, కె.గోవర్దన్ డిమాండ్ చేశారు. ర్యాలీకి అనుమతి లేదు: పోలీసులు టీడీఎఫ్ తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’కి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించారు. టీడీఎఫ్ ముసుగులో మావోయిస్టులు రాష్ట్ర రాజధానిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నందున అనుమతి తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 6 వరకు నగరంలో నిషేధాజ్ఞలు విధించారు. నగరంలో సభలు, సమావేశాలతో పాటు, గుంపులు సంచరించడానికి వీలు లేదని స్పష్టంచేశారు. ర్యాలీలో రాష్ట్రం నిషేధించిన రెవెల్యూషన్ డెమెక్రటిక్ ఫ్రంట్(ఆర్డీఎఫ్), రాడికల్ యూత్ లీగ్ లీగ్(ఆర్‌వైఎల్), రైతు కూలీ సంఘం(ఆర్సీఎస్), రాడికల్ స్టూడెంట్స్ యూనియన్స్, సింగరేణి కార్మిక సమాఖ్య, విప్లవ కార్మిక సమాఖ్య, ఆలిండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. రెండ్రోజుల క్రితమే టీడీఎఫ్ సానుభూతిపరులు హైదరాబాద్‌కు చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు అసెంబ్లీ ప్రాంగణంలో అదనంగా మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. -
నిషేధాలు లేని పాలన అవసరం
అల్వాల్: ప్రజాస్వామ్య ఉద్యమాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో నిషేధాలు, నిర్బంధాలు, షరతులు లేని స్వపరిపాలన ప్రజలకు అందించాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు అన్నారు. అమరుల బంధుమిత్రుల సంఘం, విప్లవ రచయితల సంఘాల ఆధ్వర్యంలో అల్వాల్ సుభాష్‌నగర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విప్లవ ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పించారు. ఇటీవల అమరులైన మంగన్న, సంజీవప్ప, మొగిలి, రాములు, సరోజ, బాబూరావు, భారతి, కవితలకు జోహార్లు అర్పించారు. అనంతరం వరవరరావు మాట్లాడుతు ప్రజాస్వామ్య యుతంగా ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలలో దళిత, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి జరిగినప్పుడే ప్రజలు హర్షిస్తారన్నారు. సామాజిక, ఆర్థిక హామీలను నెరవేరుస్తామంటున్న ప్రభుత్వాధినేతలు నిషేధాలు, నిర్బంధాలు లేని స్వపరిపాలనను అందించాలన్నారు. బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయడంతో పాటు ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆరు విప్లవ సంఘాలపై విధించిన నిషేదం ఎత్తివేయాలన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలు ఏ రాష్ర్టంలో ఉండాలన్న వాదనను పక్కనపెట్టి గిరిజన హక్కులను కాలరాసే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏడు మండలాలను ముంపునకు గురిచేసి సాధించుకున్న తెలంగాణ హర్షణీయం కాదన్నారు. స్వర్ణాంద్ర నిర్మిస్తాన్నంటున్న చంద్రబాబు నాయుడు, బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తానంటున్న కె.చంద్రశేఖర్‌రావులు ప్రజాస్వామిక విప్లవ పోరాటంలో అమరులైన వారి కుటుంబాల కడుపుకోతను గమనించాలన్నారు. ప్రజాకళా మండలి, విరసం, డప్పు రమేష్ బృందాలు విప్లవ గీతాలు ఆలపించాయి. ముందుగా సుభాష్‌నగర్‌లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద జెండా ఎగరవేశారు. ఇలా ఉండగా అమరులను తలచుకుంటూ సభలో కన్నీరు పెట్టిన వారి కుటుంబ సభ్యులను చూసిన వారి హృదయాలు ద్రవించాయి. దమనకాండపై విచారణ జరపాలి సుందరయ్య విజ్ఞాన కేంద్రం: శ్రీలంకలో తమిళులపై జరిగిన మారణకాండపై అంతర్జాతీయ జాతీయ స్థాయిలో స్వతంత్ర విచారణ జరపాలని విప్లవ సంఘం నేత పరిమిళ పంజా(తమిళనాడు) డిమాండ్ చేశారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అమరుల బంధు మిత్రుల సంఘం, విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో గంటి ప్రసాదం ప్రథమ వర్ధంతి సభ జరిగింది. ఇందులో భాగంగా ‘విప్లవ బాటసారి గంటి ప్రసాదం స్మృతి గీతాలు’ సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరిమిళ పంజా మాట్లాడుతూ ఇప్పటికీ శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న హత్యాకాండను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ ప్రజా నాయకత్వంతో ప్రస్తుతం దండకారణ్యంలో నూతన మానవావిష్కారం జరుగుతోందని అన్నారు. నరేంద్రమోడీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు కలిసి, పోలవరం పేరిట ఆదివాసులను నిండా ముంచుతున్నార ని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా గంటి ప్రసాదంపై ఉషా పాడిన పాట సభికులను కన్నీరు పెట్టించింది. అమరుల బంధు మిత్రుల సంఘ అధ్యక్షురాలు అంజమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి పద్మకుమారి, విరసం కార్యదర్శి వరలక్ష్మి, ప్రొఫెసర్ కాశీం, గంటి ప్రసాదం సతీమణి కామేశ్వరి, యూనివర్సిటీ డిస్కషన్ ఫోరం నాయకులు డేవిడ్ పాల్గొన్నారు.