‘చలో అసెంబ్లీ’పై ఉక్కుపాదం
ఎక్కడికక్కడ టీడీఎఫ్ నేతలు, ప్రజాసంఘాల నాయకుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఎన్‌కౌంటర్ కు నిరసనగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీడీఎఫ్) బుధవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అరెస్టులు, గృహ నిర్బంధాలతో నాయకులను ఎక్కడికక్కడ నిలువరించారు. బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి వేదిక నేతలను, వారి మద్దతుదారులను అడ్డుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, బాగ్‌లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నారాయణగూడ క్రాస్‌రోడ్స్, ఇందిరాపార్కు, గన్‌పార్కు తదితర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. మంగళవారం రాత్రి నుంచే పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బుధవారం తెల్లవారుజాము నుంచి అరెస్టుల పర్వాన్ని కొనసాగించారు.
సుందరయ్య విజ్ఞానకేంద్రం వద్దకు వచ్చిన వారిని వచ్చినట్టే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. విద్యావేత్త చుక్కా రామయ్యను ఉదయం నుంచి విద్యానగర్‌లోని ఆయన ఇంటి వద్ద గృహనిర్బంధంలో ఉంచారు. ఉదయం 11.15 గంటల సమయంలో సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత వేములపల్లి వెంకట్రామయ్య, విరసం నేతలు పాణి, రాంకీ, రివేరా, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు తదితరుల ను బాగ్‌లింగంపల్లి వద్ద, విరసం నేత వరవరరావు తదితరులను ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద అరెస్టు చేశారు. పోలీసుల కళ్లు గప్పి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి అసెంబ్లీ వైపు వెళ్లేందుకు యత్నించిన న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) నేతలు సంధ్య, గోవర్ధన్, నరేందర్ తదితరులను ఇందిపార్కు వద్ద అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకొని వందలాది మంది న్యూడెమోక్రసీ కార్యకర్తలు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి అశోక్‌నగర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. చెరుకు సుధాకర్‌ను హిమాయత్‌నగర్ వద్ద, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన శ్రుతి తల్లిదండ్రులు తంగెళ్ల సుదర్శన్, రమణను నారాయణగూడ వద్ద అరెస్టు చేశారు. ఎన్‌కౌంటర్ ను, పోలీసు నిర్బంధాన్ని నిరసిస్తూ నిజామాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్ అనే యువకుడు గన్‌పార్కు వ ద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకోవడంతో ప్రమాదం తప్పింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనూ అరెస్టుల పర్వం కొనసాగింది. 50 మందికి పైగా విద్యార్థులను అరెస్టు చేశారు. ఓయూ తెలుగు విభాగానికి చెందిన ప్రొఫెసర్ కాశీం ఇంట్లో సోదాలు జరిపారు. కాశీం ఇంట్లో లేని సమయంలో వచ్చిన పోలీసులు.. అసాంఘిక శక్తులు ఉన్నట్లు తమకు సమాచారం ఉందంటూ దాదాపు అరగంటపాటు సోదాలు నిర్వహించారు. దోమలగూడలోని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యాలయంపై దాడి చేసి 15 మంది కళాకారులను అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర చోట్ల కూడా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా రాజధానిలో 400 మందికి పైగా వివిధ పార్టీలు, ప్రజాసంఘాలకు చెందిన కార్యకర్తలు, నాయకులను పోలీసులు
అరెస్టు చేశారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఉద్రిక్తత
మంగళవారం రాత్రికే వివిధ జిల్లాల నుంచి సుమారు 200 మందికిపైగా నాయకులు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మకాం వేశారు. వచ్చిన వారిని వచ్చినట్టే పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. బారికేడ్లను దాటుకొని రావటానికి ప్రయత్నించిన ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావును అడ్డుకున్నారు. విజ్ఞాన కేంద్రం లోపల ఉన్న తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డి, వేములపల్లి వెంకట్రామయ్య, ఎండి.గౌస్ తదితర వామపక్ష, ప్రజా సంఘాల నేతలు ఒక్కసారిగా బయటికి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరికి అందరినీ అరెస్ట్ చేసి 11 వాహనాల్లో ఫలక్‌నామా, గాంధీనగర్, గోషామహల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
నిఘా నీడలో అసెంబ్లీ
ఈ ఆందోళన నేపథ్యలో శాసనసభ పరిసరాలను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. గణేశ్ నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు మౌంటెడ్ కెమెరా వాహనాలతో గస్తీ నిర్వహించారు. సెంట్రల్ కమాండింగ్ సెంటర్ నుంచి నిఘా కెమెరాల ద్వారా పర్యవేక్షించారు.
అమానవీయం: హరగోపాల్
‘‘ఎన్నో ఏళ్లుగా మానవీయమైన, ప్రజాస్వామిక తెలంగాణ కోసం కలగన్నాం. ఇలాంటి పాశవికమైన, అమానవీయమైన తెలంగాణ వస్తుందనుకోలేదు. శృతి, సాగర్‌లపై ఏకపక్షంగా కాల్పులు జరిపి చంపిన తీరు దారుణం. ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షను ప్రభుత్వం ఒక్కరోజుతో కల్లలు చేసింది’ అని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సుందర య్య విజ్ఞాన కేంద్రం వద్ద విలేకరులతో మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం తీసిపోని విధంగా మన రాష్ట్రంలో.. మన పిల్లలను హతమారుస్తున్నారన్నారు.
విజయవంతమైనట్లే: టీడీఎఫ్
ప్రభుత్వం పోలీసుల ద్వారా పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగించినా తాము చేపట్టిన చలో అసెంబ్లీ విజయవంతమైనట్లేనని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టీడీఎఫ్) తెలిపింది. ప్రజాస్వామ్యయుతంగా తలపెట్టిన కార్యక్రమాన్ని అణిచివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. టీడీఎఫ్ మావోయిస్టు ఎజెండాను అనుసరించడం లేదని, సామాజిక తెలంగాణ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కు పోరాడుతుందని పేర్కొంది. బుధవారం రాత్రి వివిధ పోలీస్‌స్టేషన్ల నుంచి విడుదలయ్యాక మఖ్దూంభవన్‌లో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), వరవరరావు (విరసం), వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యూ), విమలక్క(అరుణోదయ) విలేకరులతో మాట్లాడారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌పై అసెంబ్లీలో చర్చ కోసం 344 నిబంధన కింద ప్రతిపక్ష సభ్యులు నోటీసు ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే దోషిగా నిలబడాల్సి వస్తుందన్నారు.