స్పందించకుంటే ఉద్యమం ఉధృతం
రుణమాఫీపై ప్రభుత్వానికి టీడీఎఫ్ హెచ్చరిక
హైదరాబాద్: రైతులకు ఒకేసారి మొత్తం రుణమాఫీ, వరంగల్ ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీడీఎఫ్) హెచ్చరించింది. రైతులకు మొత్తం రుణాన్ని మాఫీ చేయడంతోపాటు శ్రుతి, సాగర్‌ల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నెల 10న రైతుల ఆత్మహత్యలు, ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని ప్రజలను కోరింది.
గురువారం మఖ్దూం భవన్‌లో రాష్ట్ర బంద్ పోస్టర్‌ను చాడ వెంకటరెడ్డి(సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), వరవరరావు(విరసం), వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), జానకి రాములు (రెవల్యూషనరీ సోషలిస్ట్‌పార్టీ), సంధ్య(పీఓడబ్ల్యూ), విమలక్క(అరుణోదయ) తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రైతుల సమస్యలపై వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేసి, వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ్మినేని మాట్లాడుతూ విమర్శలు, నిరసనలను సహించే పరిస్థితులలో కేసీఆర్ లేరని, ఆయన పాలన దొరల పాలనను తలపిస్తోందన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోకపోవడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని వరవరరావు విమర్శించారు.