Venkat Reddy Chada
-
అగ్రిగోల్డ్ భూముల్ని ఆక్రమిస్తాం: చాడ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకుంటే అగ్రిగోల్డ్ భూముల్ని ఆక్రమిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. హిమాయత్‌నగర్‌లో మఖ్దూంభవన్‌లో భాగం హేమంతరావు అధ్యక్షతన గురువారం జరిగిన అగ్రిగోల్డ్ బాధితులు సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్ సంస్థ మూతబడి ఏడేళ్లు కావస్తున్నా తెలంగాణలో బాధితులకు న్యాయం చేయలేదని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రసంగిస్తూ అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బాధితులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. -
‘జనార్దన్‌రెడ్డి బదిలీ సందేహాలకు తావిస్తోంది’
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆకస్మిక బదిలీ అనేక అనుమానాలు, సందేహాలకు తావిస్తోం దని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్, వరంగల్ మున్సిపల్ కమిషనర్ గౌతమ్‌కుమార్‌ను, ఇప్పుడు జనార్దన్‌రెడ్డిని అదే తరహాలో బదిలీ చేయడం సరికాదన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేసే అధికారులను ప్రభు త్వం బదిలీ చేయడం తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. -
సాంస్కృతిక దాడులను ఎండగట్టాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, సాంస్కృతిక రంగంపై దాడులను ఎండగట్టేందుకు కవులు, కళాకారులు, రచయితలు సిద్ధం కావాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కళాకారుల ఆట, పాట, డప్పుల దరువు పోషించిన కీలక పాత్రను నేటి పాలకులు మరిచిపోయారన్నారు. ఈ కళాకారులను ఆదుకునే చర్యలు తీసుకోకుండా, వారికోసం సాంస్కృతిక విధానాన్ని రూపొందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందన్నారు. ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. సమగ్ర సాంస్కృతిక విధానం కోసం ఈ నెల 17న హైదరాబాద్‌లో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రజానాట్య మండలి నేతలు కె.లక్ష్మినారాయణ, పల్లె నర్సింహ తెలిపారు. -
ప్రాజెక్టులపై విపులంగా చర్చించాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల ప్రాజెక్టులపై అసెంబ్లీలో విపులంగా చర్చించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేసి జల విధానానికి రూపకల్పన చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. అసెంబ్లీలో అధికారపార్టీ బలం పెరిగిందని, అన్ని ఎన్నికల్లో గెలుస్తున్నామనే అహంభావపూరిత ఆలోచనలతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల నిర్మాణ అంచనా వ్యయం రూ.38 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్లకు పెరిగిందన్నారు. చర్చ లేకుండా తడికెపల్లి, పాములపర్తి వద్ద రిజర్వాయర్ల సామర్థాన్ని ఆగమేఘాల మీద 20, 50 టీఎంసీలకు పెంచడమేంటని ప్రశ్నించారు. -
స్పందించకుంటే ఉద్యమం ఉధృతం
రుణమాఫీపై ప్రభుత్వానికి టీడీఎఫ్ హెచ్చరిక హైదరాబాద్: రైతులకు ఒకేసారి మొత్తం రుణమాఫీ, వరంగల్ ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీడీఎఫ్) హెచ్చరించింది. రైతులకు మొత్తం రుణాన్ని మాఫీ చేయడంతోపాటు శ్రుతి, సాగర్ల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నెల 10న రైతుల ఆత్మహత్యలు, ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని ప్రజలను కోరింది. గురువారం మఖ్దూం భవన్లో రాష్ట్ర బంద్ పోస్టర్‌ను చాడ వెంకటరెడ్డి(సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), వరవరరావు(విరసం), వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), జానకి రాములు (రెవల్యూషనరీ సోషలిస్ట్‌పార్టీ), సంధ్య(పీఓడబ్ల్యూ), విమలక్క(అరుణోదయ) తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రైతుల సమస్యలపై వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేసి, వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ్మినేని మాట్లాడుతూ విమర్శలు, నిరసనలను సహించే పరిస్థితులలో కేసీఆర్ లేరని, ఆయన పాలన దొరల పాలనను తలపిస్తోందన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోకపోవడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని వరవరరావు విమర్శించారు.