సాంస్కృతిక దాడులను ఎండగట్టాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, సాంస్కృతిక రంగంపై దాడులను ఎండగట్టేందుకు కవులు, కళాకారులు, రచయితలు సిద్ధం కావాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కళాకారుల ఆట, పాట, డప్పుల దరువు పోషించిన కీలక పాత్రను నేటి పాలకులు మరిచిపోయారన్నారు.
ఈ కళాకారులను ఆదుకునే చర్యలు తీసుకోకుండా, వారికోసం సాంస్కృతిక విధానాన్ని రూపొందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందన్నారు. ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. సమగ్ర సాంస్కృతిక విధానం కోసం ఈ నెల 17న హైదరాబాద్‌లో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రజానాట్య మండలి నేతలు కె.లక్ష్మినారాయణ, పల్లె నర్సింహ తెలిపారు.