
‘ఎన్‌కౌంటర్’పై 30న చలో అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని... ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై అత్యాచారం, హత్యానేరాల కింద కేసులు నమోదు చేయాలని ‘తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీపీవీ)’ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీనిపై ఈ నెల 30వ తేదీన చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ కోసం పది వామపక్షాలతో పాటు తెలంగాణ ప్రజాఫ్రంట్, విద్యావంతుల వేదిక, జర్నలిస్టుల ఫోరం, రైతాంగ సమితి, విరసం, ఎమ్మార్పీఎస్, అడ్వొకేట్స్ జేఏసీ, మున్సిపల్ జేఏసీ, మానవహక్కుల వేదిక, రైతు, రైతు కూలీ, మహిళా, కార్మిక, విద్యార్థి సంఘాలు, సంస్థలు, మేధావులు కలసి విశాల ప్రాతిపదిక న ‘తెలంగాణ ప్రజాస్వామిక వేదిక’(టీపీవీ) ఏర్పాటైంది.
వరంగల్ ఎన్‌కౌంటర్‌లో శ్రుతి, సాగర్‌లను పాశవికంగా హతమార్చడాన్ని టీపీవీ ఖండించింది. దీనిపై న్యాయవిచారణ జరిపించి టీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. 30వ తేదీన చేపట్టనున్న చలో అసెంబ్లీ పోస్టర్‌ను గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో విరసం నేత వరవరరావు, విద్యావేత్త చుక్కా రామయ్య, చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), కె.గోవర్ధన్ (న్యూడెమోక్రసీ-చంద్రన్న), జానకిరాములు (ఆర్‌ఎస్‌పీ), సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్), విమలక్క (టఫ్), రాజేందర్‌రెడ్డి (అడ్వొకేట్స్ జేఏసీ), గురిజాల రవీందర్‌రావు (టీవీవీ), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఉద్యమ వేదిక), ఉ.సాంబశివరావు, పాశం యాదగిరి (సీనియర్ జర్నలిస్టు), సనావుల్లాఖాన్ తదితరులు విడుదల చేశారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌కు రాష్ర్ట ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఈ ఎన్‌కౌంటర్‌పై కేసీఆర్ బోను ఎక్కాల్సిందేనని వరవరరావు వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని, ఆదేశిక సూత్రాలను పట్టించుకోకుండా, విలువలను పాటించకుండా వ్యవహరిస్తే.. ప్రజలే ప్రభుత్వాన్ని ఎండగడతారన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని చుక్కారామయ్య డిమాండ్ చేశారు.
రాష్ర్టంలో ప్రజాస్వామ్యబద్ధమైన వాతావరణమే లేదని చాడ వెంకటరెడ్డి అన్నారు. మావోయిస్టుల ఎజెండానే తన ఎజెండా అన్న కేసీఆర్ వారిని అంతమొందించడమే ఆయన ఎజెండానా అని నిలదీశారు. ఉన్నతస్థాయిలో రాజకీయ నిర్ణ యం లేనిదే ఈ ఎన్‌కౌంటర్ జరగదని... శ్రుతి, సాగర్‌లను దారుణంగా చంపారని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్ కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యేనని వేములపల్లి వెంకటరామయ్య, గోవర్ధన్ ఆరోపించారు.
నా కడుపు కోత మరెవరికీ వద్దు...
నాలాంటి కడుపుకోత మరో తల్లికి రాకూడదు. రాష్ట్రంలో ఎన్‌కౌంటర్‌లే ఉండకూడదు. పేదల కష్టాలను చూసి వారి కోసం పనిచేసేందుకు శ్రుతి వెళ్లింది. నా బిడ్డను దారుణంగా హింసించి, అత్యాచారం చేసి, యాసిడ్ పోసి ఘోరాతిఘోరంగా హత్యచేశారు.
- శ్రుతి తల్లి రమాదేవి