గాంధీ ఆస్పత్రిలో నినాదాలు చేస్తున్న విరసం నేత వరవరరావు
హైదరాబాద్: భీమా కొరేగావ్ కుట్ర కేసులో విప్లవ రచయితల సంఘం నేత వరవర రావును మహారాష్ట్ర పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. రెండున్నర నెలలు గృహ నిర్బంధంలో ఉన్న వరవరరావు ట్రాన్సిట్ వారంట్‌పై దాఖలు చేసిన వ్యాజ్యం పరిష్కారమైనట్టుగా హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చిన నేపథ్యంలో పుణే ఏసీపీ స్థాయి పోలీసు అధికారి శివాజీ పవార్ నేతృత్వంలోని బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. వరవరరావు నివాసముంటున్న ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని జవహర్‌నగర్‌లో హిమసాయి హైట్స్ అపార్ట్‌మెంట్ ముందు ప్రజాసంఘాల కార్యకర్తలు ఆందోళన చేస్తుండగా మరోవైపు పోలీసులు చాకచక్యంగా ఆయన్ను వ్యాన్‌లో తీసుకెళ్లిపోయారు. వరవరరావు భార్య హేమలత మాట్లాడుతూ రాత్రిపూట వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లడం దారుణమన్నారు. వరవరరావును వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి పుణేకు తరలించినట్టు తెలిసింది.
రెండున్నర నెలలపాటు గృహ నిర్బంధం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు మావోయిస్టులతో కలసి కుట్రకు పాల్పడినట్టు ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో వరవరరావుతోపాటు మరో నలుగురిని పోలీసులు ఆగస్టు 28న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టులపై ప్రముఖ రచయిత్రి రోమిలా థాపర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయం సేఫ్టీవాల్వ్ వంటిదని సుప్రీంకోర్టు పేర్కొంటూ హక్కుల నేతల గృహనిర్బంధానికి అనుమతించింది. అనంతరం ఈ కేసును హైకోర్టు పరిధిలోనే పరిష్కరించుకోవాలంటూ సూచించింది. అయితే, బెయిల్ కోసం వరవరరావు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
కుట్ర కేసులు ఎత్తివేయాలి..
వరవరరావుపై కుట్ర కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆయన నివాసం వద్ద తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఆందోళనలో వేదిక కన్వీనర్‌లు చిక్కుడు ప్రభాకర్, వి.సంధ్య, విరసం నాయకులు కూర్మనాథ్, అరవింద్, అరుణోదయ రామారావు, టీపీఎఫ్ నేత నలమాస కృష్ణ, ఇఫ్టు నాయకురాలు అరుణ, చైతన్య మహిళా సంఘం నుంచి దేవేంద్ర, తెలంగాణ విద్యావంతుల వేదిక నుంచి సందీప్, పీడీఎస్‌యూ నుంచి మహేష్, పీడీఎం నుంచి రాజు, ఏపీసీఎల్‌సీ నాయకులు ప్రొఫెసర్ లక్ష్మణ్, వేణుగోపాల్ తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వెంటనే విడుదల చేయాలి: విరసం
వరవరరావును, మరో నలుగురు సుప్రసిద్ధ సామాజిక కార్యకర్తలు సుధాభరద్వాజ్, గౌతమ్ నవలఖా, వెర్నన్ గొంజాల్వెస్, అరుణ్ ఫెరీరాలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు విప్లవ రచయితల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. వారిని వెంటనే విడుదల చేయాలని విరసం కార్యదర్శి పాణి డిమాండ్ చేశారు.
అప్రజాస్వామికం
ప్రొఫెసర్ హరగోపాల్
ఏ నేరం చేయని వ్యక్తిని అరెస్టు చేయడం రాజ్యం చేస్తున్న నేరమని పౌర హక్కులనేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. వరవరరావుకు ఎలాంటి సంబంధం లేని భీమా కొరేగావ్ ఉదంతంలో ఇరికించి కట్టుకథలల్లి ఆయన పైన నిర్బంధం విధించారని, ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య అని అన్నారు. అరెస్టును ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment