breaking news
Virasam leaders
-
వంగపండుకు విరసం నివాళి
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ విప్లవ కవి, కళాకారుడు వంగపండు ప్రసాద్ మృతి పట్ల విప్లవ రచయితల సంఘం ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం తెలియజేసింది. ఉత్తరాంధ్ర జన జీవిత సౌందర్యాన్ని, శ్రీకాకుళం ఆదివాసీ పోరాట పరిమళాన్ని కళా రంగంలో ఒడుపుగా పట్టుకున్న వాగ్గేయకారుడనీ, విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన తొలి దశ పాత్ర చెరిగిపోనిదని విరసం అధ్యక్షులు అరసవెల్లి కృష్ణ, ఉపాధ్యక్షులు బాసిత్, సహాయ కార్యదర్శి రివేరా పేర్కొన్నారు. ఆయన తొలి దశ పాటలు, కళారూపాలు, ప్రదర్శనలు ప్రజా పోరాటాల్లో, విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమంలో శాశ్వతంగా ఉంటాయని, ఆయనకు విరసం నివాళులర్పిస్తోందని చెప్పారు. విప్లవోద్యమం ఏ జీనవ క్షేత్రాల్లో కి విస్తరించిందో, ఏ ప్రజా సమూహాల్లోకి వెళ్లిందో ఆ ప్రజల జీవితాన్ని, ప్రత్యేక సమస్యలను, నిర్దిష్ట సాంస్కృతిక విశిష్టతలను పట్టుకొని ఉద్యమ వైఖరిని ప్రతిబింబిస్తూ వంగపండు వందలాది పాటలు రాశారని, ‘వంగపండు ఉరుములు’, ‘వంగపండు ఉప్పెన’ పేర్లతో ఆయన పాటల క్యాసెట్లు వేలాది గ్రామాలకు చేరాయని గుర్తు చేశారు. ప్రజా ఉద్యమాలకు తీరని లోటు ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అరుణోదయ సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ..జన నాట్యమండలితో కలిసి తమ సంస్థ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. జనం దరువు పేరుతో తెలుగు రాష్ట్రాల్లో వంగపండుతో కలిసి ప్రదర్శనలు ఇచ్చినట్లు చెప్పారు. అలాగే భూ బాగోతం ప్రదర్శనల్లోనూ అరుణోదయ పాల్గొన్నదని, వంగపండు కూతురు ఉష కూడా అరుణోదయ సంస్థతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. జీవితమంతా ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన వంగపండు ప్రసాద్‌కు అరుణోదయ సంస్థ పక్షాన ఘన నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజల నుంచి ప్రజలకు ... ♦ ప్రజా కళలను వెలికి తీసి వాటిని పదునెక్కించి తిరిగి ప్రజల వద్దకు వెళ్లాడు వంగపండు. ప్రజలను చైతన్యవంతం చేశాడు. విప్లవోద్యమం వైపు నడిపించాడు. ఆయనకు నా నివాళి. – ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు విప్లవోద్యమ గొంతుక... ప్రజాకవి, వాగ్గేయకారుడు, విప్లవోద్యమ గొంతుక అయిన వంగపండు ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన మరణం సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటు. – చిక్కుడు ప్రభాకర్, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక -
ఘర్షణ ఐక్యత ఇప్పటి విధానం
తెలుగు సాహిత్యంలో ఒక అరుదైన సందర్భం. తెలుగునేల నుండి దిక్కుల్ని మండించిన అక్షరాలకు యాభై సంవత్సరాలు నిండాయి. శ్రీకాకుళ పోరాటపు అగ్గిని, విప్లవ విద్యార్థుల సవాలును స్వీకరించి– తమ కలాలను కత్తులుగా, కాంతులుగా మార్చుతామనీ, వలస, భూస్వామ్య, ధనస్వామ్య అవశేషాలను తొలగించి, నూతన ప్రజాస్వామ్య స్థాపన కోసం పాటుపడతామనీ, సోషలిజం మా లక్ష్యమనీ చరిత్ర ఎద మీద సంతకం చేసి హామీ పడిన విప్లవ రచయితల సంఘం తన మాటను నిలబెట్టుకుని అర్ధ శతాబ్ది విజయపతాకను ఎగరెయ్యబోతోంది. ఆనాడు సంతకం చేసిన పద్నాలుగు మంది రచయితల్లో వరవరరావు నేడు తన ఎనభై ఏళ్ల వయసులో చీకటి జైలు నుండి వెన్నెల సందేశాలు పంపుతున్నాడు. విప్లవ కవి సాయిబాబా చావును ధిక్కరించి నవజీవన కవితలల్లుతున్నాడు. విరసం పుట్టుక, నడక ఎంత ఆశ్చర్యకరం! శాస్త్రీయ సిద్ధాంతం వెలుగులో నిర్మాణాత్మకంగా విప్లవించాలనుకోవడం ఎంత ఉత్తేజకరం. విరసం ఆవిర్భావం చారిత్రాత్మకం అనే మాట లాంఛనం. చారిత్రక శక్తుల రాపిడిలో పుట్టి, చరిత్ర నిర్మాణంలో భాగమవుతూ 50 ఏళ్లుగా కొనసాగుతున్నది. 1947తో పరిష్కారం కాని వైరుధ్యాల విస్ఫోటనం నుండి జనించిన నక్సల్బరీ– కరడుగట్టిన ఫ్యూడల్ ఆధిపత్యాన్ని ధ్వంసం చేసే ప్రకంపనలను సృష్టించింది. చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం దీనికి అంతర్జాతీయ నేపథ్యం. ఆ చారిత్రక సన్నివేశంలో పుట్టిన శిశువు విరసం. భూస్వామ్యం, సనాతన ధర్మం, బ్రాహ్మణ భావాలతో సాహిత్యరంగంలో వర్గపోరాటం నడిపి ఓడించింది విరసం. సాహిత్యాన్ని, సాహిత్య చరిత్రను శ్రామికులు, మట్టి మనుషుల వైపు నుంచి తిరగరాసింది. ఈ చైతన్యంతో సాహిత్య కళారూపాల తీరు మారిపోయింది. సాహిత్యం మట్టిని ముద్దాడి, అంటరానివాడలను హత్తుకుంది. జానపదాలను, మాండలికాలను వెలికి తీసింది. ఆకాశంలో సగాన్ని సాయుధం చేసింది. భూస్వామ్య దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా వేలు, లక్షలుగా భూమి లేని నిరుపేదలు, అంటరాని మనుషులు, మహిళలు, ఆదివాసులు విప్లవంలోకి వచ్చారు. సాయుధ పోరాటాల్లో భాగమయ్యారు. అంటరానితనం, కులవివక్ష, పితృస్వామ్య కుటుంబ బంధనాలు తెంచుకొని వచ్చే చైతన్యాన్ని వర్గపోరాటమే ఇచ్చింది. ఇది భూమి కోసం పోరాటమే కాదు, భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా అన్ని రకాల సామాజిక అణచివేతలను ధ్వంసం చేసే పోరాటం. ఇదంతా ఆనాడు శివసాగర్ ‘చెల్లీ చంద్రమ్మ’గా, చెరబండరాజు ‘గౌరమ్మ కల’గా, ‘ఏ కులమబ్బీ మాదే మతమబ్బీ’ అనే ఆత్మగౌరవ ప్రశ్నగా, ‘ఉందర్రా మాలపేట’ అనే వంగపండు విషాద గానంగా, అల్లం రాజయ్య ‘అగ్నికణం’లో మాదిగ బయ్యక్క విప్లవ నాయకిగా కావడంగా కనిపిస్తుంది. ఇదంతా వర్గపోరాటం కదిలించిన పీడిత సమూహాల కంఠ స్వరం. ఇప్పుడది తెగల కట్టుబాట్లను, కుటుంబ బంధనాలను తెంచుకొన్న ఆదివాసీ రాగో ముప్పై ఏళ్ల కింద చూపిన మార్గంలో దండకారణ్య స్త్రీల విముక్తి చరిత్రగా విస్తరించింది. ఇదంతా 1970, 80ల తొలినాళ్ళ విప్లవ సాహిత్యోద్యమ అడుగుజాడలు. వర్గపోరాటంలో భాగంగా సామాజిక అణచివేతల మీద గురి ఉన్నందుకే విప్లవ సాహిత్యం అన్ని జీవన పార్శా్వలను పట్టుకున్నది. 1970లలో అట్టడుగున సాగిన వర్గపోరాటాల సంచలనమే పీడిత అస్తిత్వాల చైతన్య ప్రకటనకు దారి చూపింది. అణగారిన గొంతులు మార్మోగే ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించింది. ప్రత్యేక అస్తిత్వ గొంతుకలు నిస్సందేహంగా సమాజాన్ని, ఉద్యమాలను సెన్సిటైజ్ చేశాయి. ప్రజాస్వామిక దృష్టిని మరింత నిశితమూ, విశాలమూ చేశాయి. ఇది సామాజిక ప్రగతిలో భాగం. అందుకే విరసం ఏ శషబిషలు లేకుండా వాటిని ఆహ్వానించింది. అదే సమయంలో వర్గ దృష్టి తప్పకూడదని అస్తిత్వవాదాలకు గుర్తుచేసింది. వర్గశత్రువు గురించి హెచ్చరించింది. వ్యవస్థలోని సకల ఆధిపత్యాలను పరిరక్షించి అమలు చేసే రాజ్యం పట్ల రాజీలేని వైఖరి ఉండాలని ఉద్ఘాటించింది. విరసం ఈ యాభై ఏళ్ల ప్రయాణానికి వ్యవస్థ పట్ల, రాజ్యం పట్ల కచ్చితమైన వైఖరే కారణం. అది తప్పితే ఎలా ఉంటుందో గతంలోనే చూశాం. కొందరు స్త్రీవాదులైనా ఎన్‌జివోల వైపు, కొన్ని దళిత శక్తులైనా బూర్జువా పార్లమెంటరీ మార్గం వైపు వెళ్లి వ్యవస్థతో, రాజ్యంతో సర్దుకుపోవడం చూశాం. దోపిడీ వ్యవస్థను పరిరక్షించడానికి పార్లమెంటరీ రాజకీయాల నుంచే ఫాసిజం వస్తోందనే విషయంలో కచ్చితంగా ఉంటూనే ఈ వ్యవస్థ లోపల పీడిత సమూహాలకు బూర్జువా ప్రజాస్వామ్యం వల్ల ఏ కొంచెం ప్రయోజనం చేకూరినా దాన్ని హక్కుగా అంగీకరించాల్సిందే. అందుకే విరసం ఈ యాభై ఏళ్లుగా వ్యవస్థ సమూల మార్పు కోసం సాగుతున్న పోరాటాల వెంట నడిచినట్టే, రాజ్యాంగ పరిధిలో పీడిత సమూహాల హక్కుల కోసం జరిగిన పోరాటాలతో కలిసి నడిచింది. వాటి న్యాయకాంక్షను అక్షరబద్ధం చేసింది. ఇలాంటి విషయాల్లో విరసం గత నలభై ఏళ్లుగా నిరంతరం సైద్ధాంతిక భావజాల సంఘర్షణ కొనసాగిస్తున్నది. ఇది 70లలో ఫ్యూడల్ శక్తులతో చేసిన సంవాదం వంటిది కాదు. మిత్ర వైరుధ్యంతో ఎట్లా వ్యవహరించాలో విప్లవ రచయితలకు తెలుసు. తెలుగు సాహిత్య రంగంలో అవార్డులు, అకాడమీలు, పోటీలు, రాజ్యప్రాపకాల చీడ పెరిగిపోయిన ఈ స్థితిని తీవ్రంగా విమర్శిస్తూనే ప్రజా సమస్యలపై కలిసిరాగల మేరకు వీలైనంత ఎక్కువ మందితో విరసం కలిసి పని చేస్తోంది. ఘర్షణ ఐక్యత విధానాన్ని ఆచరిస్తోంది. విరసం తన వర్గ దృక్పథంతో శత్రువెవరో, మిత్రులెవరో సునిశితంగా గుర్తిస్తుంది. ఇతరులు తనతో ఎలా ఉన్నారని కాకుండా ప్రజా సమస్యలపై ఎలా ఉన్నారనేదే ఐక్యతకు గీటురాయి. ఎన్ని విమర్శలు, విసుర్లు ఎదురైనా సంయమనం పాటిస్తుంది. రాజ్యం విషయానికొచ్చే సరికి ఏ మాత్రం రాజీపడదు. తనమీద తనతో సహా అందరి మీద విమర్శనాత్మక అంచనా ఇదే సంస్థను అన్ని దశల్లో నిత్య నూతనంగా నడిపిస్తున్నది. అందువల్లనే విరసానికి ఉద్వేగపూరితమైన గతం ఉన్నట్లే అడుగడుగునా తనకే సాధ్యమైన సంభ్రమాశ్చర్యాల పోరాట వర్తమానం ఉన్నది. విరసం సభ్యులు సాహిత్య కళారంగాలతోపాటు ఆర్థికం, రాజకీయాలు, సైన్స్, చరిత్ర, విద్య, రిజర్వేషన్లు వగైరా అంశాల్లో కృషి చేశారు. వర్గపోరాట సిద్ధాంతం, రాజకీయాల వల్ల విరసం సాధించిన విస్తృతి ఎలాంటిదంటే.. అంటరానితనం, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం, కశ్మీర్, ఈశ్యాన రాష్ట్రాలు, తమిళ ఈలం దగ్గరి నుంచి పర్యావరణం, ట్రాన్స్ జెండర్స్ (నిజానికి ఎల్జిబిటిక్యూ అనే ఐదు అత్యంత పీడిత జెండర్ కమ్యూనిటీలుగా గుర్తించాలి) దాకా ఈ యాభై ఏళ్లలో విరసం స్పృశించని విషయం దాదాపుగా లేదు. ఫాసిజం లక్ష్యం చేసుకున్న మైనారిటీ మతాలు, కులాలు, పీడిత సమూహాల పక్షాన నిలిచి హిందుత్వ రాజకీయాల మూలాలను విప్పి చెబుతోంది. 1984 నుండే భారత రాజ్యం ఏవైపుగా పయనిస్తోందో, దాని రాజకీయార్థిక సామాజిక మూలాలేమిటో విరసం చెబుతూ వస్తున్నది. శ్రీకాకుళ పోరాటం దెబ్బతింటున్న సమయంలో ఏర్పడిన విరసం సాహిత్యరంగంలో సాయుధ రాజకీయాల ప్రచార ఎజెండాను స్వీకరించింది. ఈ యాభై ఏళ్లలో సమాజం అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నది. అనేక ప్రజాస్వామిక చైతన్యాలు ముందుకు వచ్చాయి. వీటన్నిటినీ విరసం స్వీకరించి తన వర్గపోరాట రాజకీయాలతో విశ్లేషిస్తున్నది. ప్రతి ఆలోచనను విప్లవం గీటురాయి మీద పరీక్షించి నిగ్గుదేలుస్తున్నది. రాజీలేకుండా భావజాల సంఘర్షణలో భాగం కావడమే దాని వర్తమానానికి, భవిష్యత్తుకు కారణం. దీనికంతా ప్రజల పోరాటాలే పునాది. ఈ యాభై ఏళ్ళ సభలు బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా పీడిత అస్తిత్వ శక్తులు, వర్గపోరాట శక్తుల ఉమ్మడి కార్యాచరణకు ఒక సందర్భం కావాలని విరసం కోరుకుంటోంది.(విరసం యాభై ఏళ్ల మహాసభలు జనవరి 11, 12 తేదీల్లో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న సందర్భంగా)- పి.వరలక్ష్మి 4 జూలై 1970 సంస్కరణ వాదానికి కాలం చెల్లిపోయింది. సాంస్కృతిక వ్యవహారాల్లో నిస్తబ్దత పేరుకొని వుంది. అభ్యుదయ రచయితల ఉద్యమం కూడా శవప్రాయమైపోయింది. ఈ దుస్థితిని తొలగించుకొని జాతిని సమగ్ర విమోచనం వైపు నడిపేందుకు విప్లవ రచయితల సంఘం ఏర్పడుతున్నది. ఈనాటి దోపిడీ వ్యవస్థతో రాజీలేని వైఖరి, నిజాయితీ గల ప్రతి రచయితకు తప్పనిసరి. నిజాన్ని వెల్లడించడంలో రచయితలు భయ సంకోచాలను విడిచి ప్రజలకు బాసట కావాలి. తమ కలాలను కత్తులుగా, కాంతులుగా మార్చుకోవాలి. సాంస్కృతిక వికాసానికి అంకితమైన ఈ విప్లవ రచయితల సంఘం సాహిత్యాన్ని జాతి జీవితంలో ప్రధానాంగం చేయబూనింది. మార్క్సియన్ సోషలిజమే మనందరి ధ్యేయం. ప్రజల దీర్ఘ కాలిక విమోచన పోరాటాలను గుర్తించి బలపరచే రచయితలే ఇందులో సభ్యులు. ఏ రూపంలో తిరుగుతున్నా ప్రజల వర్గపోరాటాల నన్నిటినీ మనం సమర్థిస్తాం. సర్వ సమగ్రమైన దేశ స్వాతంత్య్రం మన లక్ష్యం. వలస, భూస్వామ్య, ధనస్వామ్య ఆవశేషాలనన్నిటినీ తొలగించి, నూతన ప్రజాస్వామ్య స్థాపనకు తోడ్పడటమే మా ఉద్దేశం. శ్రామిక అంతర్జాతీయత మా వైఖరి. దేశ దేశాల ప్రజల విమోచన పోరాటాలను మేము హృదయ పూర్వకంగా బలపరుస్తాము. - శ్రీశ్రీ 4–7–1970; 1–07 ఎ.ఎం. సంతకం చేసినవారు: కె.వి.రమణారెడ్డి, వరవరరావు, జ్వాలాముఖి, రాచకొండ విశ్వనాథశాస్త్రి, నిఖిలేశ్వర్, రంగనాథం, శ్రీపతి, నగ్నముని, ఉమామహేశ్వరరావు, కేశవరావు, శ్రీనివాసరావు, ఎస్.హరిపురుషోత్తమరావు, పినాకపాణి, సి.(చలసాని) ప్రసాద్ -
వరవరరావు అరెస్టు
హైదరాబాద్: భీమా కొరేగావ్ కుట్ర కేసులో విప్లవ రచయితల సంఘం నేత వరవర రావును మహారాష్ట్ర పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. రెండున్నర నెలలు గృహ నిర్బంధంలో ఉన్న వరవరరావు ట్రాన్సిట్ వారంట్‌పై దాఖలు చేసిన వ్యాజ్యం పరిష్కారమైనట్టుగా హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చిన నేపథ్యంలో పుణే ఏసీపీ స్థాయి పోలీసు అధికారి శివాజీ పవార్ నేతృత్వంలోని బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. వరవరరావు నివాసముంటున్న ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని జవహర్‌నగర్‌లో హిమసాయి హైట్స్ అపార్ట్మెంట్ ముందు ప్రజాసంఘాల కార్యకర్తలు ఆందోళన చేస్తుండగా మరోవైపు పోలీసులు చాకచక్యంగా ఆయన్ను వ్యాన్‌లో తీసుకెళ్లిపోయారు. వరవరరావు భార్య హేమలత మాట్లాడుతూ రాత్రిపూట వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లడం దారుణమన్నారు. వరవరరావును వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి పుణేకు తరలించినట్టు తెలిసింది. రెండున్నర నెలలపాటు గృహ నిర్బంధం ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు మావోయిస్టులతో కలసి కుట్రకు పాల్పడినట్టు ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో వరవరరావుతోపాటు మరో నలుగురిని పోలీసులు ఆగస్టు 28న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టులపై ప్రముఖ రచయిత్రి రోమిలా థాపర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయం సేఫ్టీవాల్వ్ వంటిదని సుప్రీంకోర్టు పేర్కొంటూ హక్కుల నేతల గృహనిర్బంధానికి అనుమతించింది. అనంతరం ఈ కేసును హైకోర్టు పరిధిలోనే పరిష్కరించుకోవాలంటూ సూచించింది. అయితే, బెయిల్ కోసం వరవరరావు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కుట్ర కేసులు ఎత్తివేయాలి.. వరవరరావుపై కుట్ర కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆయన నివాసం వద్ద తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఆందోళనలో వేదిక కన్వీనర్లు చిక్కుడు ప్రభాకర్, వి.సంధ్య, విరసం నాయకులు కూర్మనాథ్, అరవింద్, అరుణోదయ రామారావు, టీపీఎఫ్ నేత నలమాస కృష్ణ, ఇఫ్టు నాయకురాలు అరుణ, చైతన్య మహిళా సంఘం నుంచి దేవేంద్ర, తెలంగాణ విద్యావంతుల వేదిక నుంచి సందీప్, పీడీఎస్‌యూ నుంచి మహేష్, పీడీఎం నుంచి రాజు, ఏపీసీఎల్సీ నాయకులు ప్రొఫెసర్ లక్ష్మణ్, వేణుగోపాల్ తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంటనే విడుదల చేయాలి: విరసం వరవరరావును, మరో నలుగురు సుప్రసిద్ధ సామాజిక కార్యకర్తలు సుధాభరద్వాజ్, గౌతమ్ నవలఖా, వెర్నన్ గొంజాల్వెస్, అరుణ్ ఫెరీరాలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు విప్లవ రచయితల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. వారిని వెంటనే విడుదల చేయాలని విరసం కార్యదర్శి పాణి డిమాండ్ చేశారు. అప్రజాస్వామికం ప్రొఫెసర్ హరగోపాల్ ఏ నేరం చేయని వ్యక్తిని అరెస్టు చేయడం రాజ్యం చేస్తున్న నేరమని పౌర హక్కులనేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. వరవరరావుకు ఎలాంటి సంబంధం లేని భీమా కొరేగావ్ ఉదంతంలో ఇరికించి కట్టుకథలల్లి ఆయన పైన నిర్బంధం విధించారని, ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య అని అన్నారు. అరెస్టును ఖండించారు. -
వరవరరావును హైదరాబాద్ తీసుకొచ్చిన పుణె పోలీసులు
-
పృథ్వీ, చందన్‌లను విడుదల చేయాలి
హైదరాబాద్: అక్రమంగా అరెస్టు చేసిన విరసం సభ్యుడు పృథ్వీ, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి చందన్‌లను బేషరతుగా విడుదల చేయాలని విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విరసం ఆధ్వర్యంలో ప్రశ్నించే కలాలు, కళలపై నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. వరవరరావు మాట్లాడుతూ, మార్చి 27న పృథ్వీ, చందన్‌లను గన్నవరంలో కిడ్నాప్ చేశారని ఆరోపించారు. వీసీ అప్పారావును హత్య చేసేందుకు మావోయిస్టు నేతలు చంద్రన్న, హరిభూషణ్లతో కలసి కుట్ర చేశారంటూ వారిని అరెస్టు చేశామని చెప్పటం సిగ్గు చేటన్నారు. దళితులు, ఆదివాసీలపై చేస్తున్న దాడులను సమర్థించుకోవటానికే ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో విరసం నగర కన్వీనర్ గీతాంజలి, విరసం సభ్యులు శివరాత్రి సుధాకర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. -
విరసం నేతల అరెస్టు
ఘట్కేసర్ : రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం కేపాల్ వద్ద విరసం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వరంగల్‌లో ఓ మీటింగ్‌కు బయలు దేరిన విరసం నేత వరవరరావు, పౌరహక్కులనేత హరగోపాల్, ఆయన సతీమణి వనమాలినిని అడ్డుకున్నారు. మీటింగ్‌కు పర్మిషన్ ఉన్నా పోలీసులు అడ్డుకోవడం అన్యాయమన్నారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. -
తిరుపతిని మరో అయోధ్యగా మారుస్తారా?
విరసం, పౌరహక్కుల సంఘం నేతల ప్రశ్న చంద్రగిరి, న్యూస్‌లైన్: ఇస్లామిక్ కళాశాలను కూల్చేయాలని కోరుతున్నవారితో లౌకికవాదానికి ముప్పేనని విప్లవ రచయితల సంఘం(విరసం), పౌరహక్కుల సంఘం నేతలు పేర్కొన్నారు. మతోన్మాదుల వల్ల ప్రశాంతంగా ఉన్న తిరుపతిని మరో అయోధ్యగా మారుస్తారా అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో హీరా సంస్థ ఏర్పాటు చేసిన ఇస్లామిక్ కళాశాలపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆదివారం విరసం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి, సభ్యులు రవి, బాబ్జి, పౌరహక్కుల సంఘం సభ్యులు క్రాంతి చైతన్య, లత, రఘు, కుమార్ కళాశాలను సందర్శించారు. వరలక్ష్మి మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారిని అన్ని మతాల వారూ దర్శించుకుంటున్నారని, అలాంటి ప్రాంతంలో కొందరు మతవాదుల కారణంగా విద్వేషాలు రగిలే ప్రమాదం ఉందన్నారు. హిందువులకు వేద పాఠశాలలు ఎంత ప్రాధాన్యమో ముస్లింలకు మదర్సాలు అంత ప్రాధాన్యమన్నారు. సభ్యులు రవి, బాబ్జి మాట్లాడుతూ కశాళాల నిర్మాణంలో లోపాలు ఉంటే చర్యలు తీసుకునేందుకు చట్టాలు ఉన్నాయన్నారు