
మల్లెపల్లి లక్ష్మయ్య గురువారం ‘సాక్షి’ ఎడిట్ పేజీలోని తన కాలమ్ (ఉరిశిక్ష నేరానికా, నేరస్తు డికా?)లో ‘జస్టిస్ కృష్ణ య్యర్ సుప్రీంకోర్టు బెంచ్‌లో సభ్యుడుగా ఉండగా తన పరిశీలనకు వచ్చిన మూడు కేసులను విచారించి దోషులకు కింది కోర్టులు విధించిన మరణ శిక్షలను జీవిత ఖైదు శిక్షలుగా మార్చారు’ అని రాశారు. అందుకాయన ఉదహరించిన మూడు కేసుల సందర్భమేమో కాని భూమయ్య, కిష్టాగౌడ్‌లకు విధించిన ఉరిశిక్షలను మాత్రం ఆయన రద్దు చేయలేకపోయారు. వాస్త వానికి వారిద్దరికీ ఉరిశిక్ష అమలు అప్పటికి రెండు సార్లు ఆగిపోయింది. మొదటిసారి 1974 డిసెంబ ర్‌లో ఏపీసీఎల్‌సీ కృషి వల్ల సీపీఐ అగ్ర నాయకులు చండ్ర రాజేశ్వరరావు, భూపేశ్‌గుప్తా, కాంగ్రెస్ నాయ కుడు ఎస్.జైపాల్‌రెడ్డి అభ్యర్థన మేరకు కేంద్ర హోంమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అనుకూలంగా స్పందించడంతో ఆగిపోయింది. రెండోసారి 1975 మే 11న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెకేషన్ బెంచ్‌గా ఉన్న జస్టిస్ చిన్నపరెడ్డి, జస్టిస్ గంగాధరరావు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించినట్టుగా భూమయ్య, కిష్టాగౌడ్‌కు తెలియజేయలేదనే సాంకేతిక కారణంతో అర్ధరాత్రి ఉరి శిక్షను ఆపివేస్తూ ఉత్తర్వులు పంపారు. ముగ్గురు యువన్యాయవాదులు సి.వెంకటకృష్ణ, కె.ఎన్.చారి, కె.వెంకట్‌రెడ్డి, కేజీ కణ్ణబీరన్ పనుపున సెలవుల్లో తమ ఇళ్లలోనే ఉన్న జడ్జీల నుంచి ఈ ఉత్తర్వులు పొందగలిగారు. అప్పుడు ‘భూమయ్య కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష రద్దు’ అనే ఒకే ఎజెండాపై ఏపీసీఎల్‌సీ కార్యదర్శి పత్తిపాటి వెంకటేశ్వర్లు కన్వీనర్‌గా కమిటీ ఏర్పడి దేశవ్యాప్త ఉద్యమాలు చేపట్టింది. జైపాల్‌రెడ్డి మొదలు ఏబీ వాజపేయి, జయప్రకాశ్ నారాయణ్ దాకా ఈ ఉద్యమానికి అండగా నిలిచారు. అంతర్జాతీయంగా జా పా సార్త్, సైమన్ డీ బావ్‌రా, తారిక్ అలీ (ఫ్రాన్స్), నోమ్ చామ్‌స్కీ(అమెరికా) సహా 300 మంది ప్రముఖులు మద్దతు తెలిపారు. అంతర్జాతీయ పత్రికల్లో దీనిపై రాశారు. లండన్, పారిస్ వంటి నగరాల్లో భారత రాయబార కార్యాలయాల ముందు ప్రదర్శనలు జరి గాయి.
తర్వాత నెలన్నర దాటకముందే 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించారు. అప్పటికి భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష రద్దుకు జార్జి ఫెర్నాండెజ్ ఢిల్లీ బోట్ క్లబ్బు ముందు ఓ పెద్ద ర్యాలీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంతలో ప్రాథమిక హక్కు లనన్నీ రద్దు చేస్తూ ఎమర్జెన్సీ విధించడంతో ఫెర్నాం డెజ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ ఇద్దరి ఉరిశిక్ష రద్దు పోరాటంలో ఉన్న కాంగ్రెసేతర నాయకులు, ఉద్యమ కారులందరూ జైళ్లపాలయ్యారు. బయట మిగిలిన కణ్ణబీరన్, సుప్రీంకోర్టు న్యాయవాది గార్గ్ తదిత రులు ఈ ఉరిశిక్షల రద్దుకు మళ్లీ ప్రయత్నించారు. ఆ పిటిషన్ జస్టిస్ కృష్ణయ్యర్ ముందుకే వచ్చింది. తన కన్నా ముందు సుప్రీంకోర్టు ధ్రువీకరించి, రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరించాక తానేమీ చేయలేనని, తాను మరోసారి రాష్ట్రపతి విశాల హృదయానికే ఈ అంశాన్ని వదిలివేస్తున్నానని జస్టిస్ అయ్యర్ పేర్కొ న్నారు. ఫలితంగా, 1975 డిసెంబర్ 1న భూమయ్య, కిష్టాగౌడ్‌లకు ఉరిశిక్ష అమలు చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాధ్యమైంది.
రాజ్యసభ సభ్యుడు భూపేశ్‌గుప్తా నవంబర్ 30న రాష్ట్రపతిని కలిసి మరునాడు ఉదయం భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్షను ఆపవలసిందిగా విజ్ఞప్తి చేసినట్లుగా డిసెంబర్ 1న ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’లో చిన్న వార్త వచ్చింది. కాని, వారిద్దరినీ అప్ప టికే ఉరితీసిన విషయం జైల్లో ఉన్న రాజకీయ డిటెన్యూలెవరికీ తెలియదు. రాజ్యాంగం నుంచి ఉరి శిక్షను తొలగిస్తే తప్ప ఇంత అమానుషమైన రాజ్య హత్యలను ఆపడం సాధ్యం కాదనడానికి మాత్రమే ఈ విషయాన్ని ప్రస్తావించాను. అరుదైన నేరాల్లో అరుదైన నేరానికే ఉరిశిక్ష వేయాలని సుప్రీంకోర్టు చెప్పి ఉన్నది. ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగు తున్నదనడానికి భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్షల అమలే తిరుగులేని దాఖలా. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మరణ శిక్షలు పడిన 11 మంది కమ్యూనిస్టు విప్లవకారుల ఉరి ఆపడానికి కమ్యూ నిస్టు పార్టీ అభ్యర్థన మేరకు లండన్ నుంచి బారిస్టర్ ప్రిట్, సుప్రీంకోర్టు నుంచి డానియల్ లతీఫీ వంటి ప్రసిద్ధ న్యాయవాదులు హైదరాబాద్ వచ్చారు. వారి వాదనల కన్నా తన మత విశ్వాసాల వల్ల పాప భీతితో నిజాం నవాబు ఈ మరణ శిక్షలను ఆమో దించే సంతకం చేయలేదు. అలాగే గోడకు నిలబెట్టి తుపాకీతో కాల్చివేసే పద్ధతి ఉన్న జారిస్టు రష్యాలో ఏదో నేరానికి మరణ శిక్ష పడిన డాస్టోవ్‌స్కీ రచయిత అనే విషయం తెలిసి, జార్ స్వయంగా మరణ శిక్ష అమలును ఆపివేశాడు. కానీ రెండు సార్లు ఉరికంబం దాకా వెళ్లి మరణవేదననంతా అనుభవించి తిరిగి వచ్చిన భూమయ్య, కిష్టాగౌడ్‌లు భారత రాజ్య చట్ట బద్ధ హత్య నుంచి బయటపడలేకపోయారు.
వరవరరావు
వ్యాసకర్త, విరసం సంస్థాపక సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment