
సాక్షి, హైదరాబాద్: పౌర హక్కుల నేత వరవరరావును ఇటీవల పుణే పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన సతీమణి హేమలత దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణను ముగించింది. పౌర హక్కుల నేతల అరెస్టు వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున, ఈ వ్యాజ్యంపై విచారణను కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌ల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరవరరావుతో పాటుగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను పుణే పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, వరవరరావు అరెస్ట్‌పై ఆయన సతీమణి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు శుక్రవారం మరోసారి విచారణ చేసింది.