'ఆయన జైల్లోనే చనిపోతారేమో'
హైదరాబాద్: దళితులు, ఆదివాసీలు, మైనార్టీల గురించి మాట్లాడితే.. ప్రభుత్వం వారిపై నక్సల్స్ అనే ముద్ర వేస్తోందని విరసం నేత వరవరరావు ఆరోపించారు. భావప్రకటనా హక్కును కాలరాస్తోందని అన్నారు. మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యాలయంలో రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దవయసు కావడంతో అనేక వ్యాధులకు గురైన సాయిబాబాకు సరైన మందులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. చత్తీస్‌గఢ్‌లోని పోలీసు బలగాల మారణకాండను ప్రపంచానికి తెలియజేయడానికి వెళ్లిన టీడీఎఫ్ నాయకులను పోలీసులు అక్కడే నిర్భందించారని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. టీపీఎఫ్ అధ్యక్షుడు నలమాస కృష్ణ మాట్లాడుతూ... ఈ నెల 23న బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో సాయంత్రం 6 గంటలకు రాజకీయ ఖైదీల విడుదల పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.