సాక్షి, న్యూఢిల్లీ : మవోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ ఇటీవల పలువురు ప్రజా సంఘాల నేతలను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. విరసం నేత వరవరరావుతో సహా అరెస్ట్‌యిన వారిని అర్బన్ నక్సలైట్స్ అని పోలీసులు వ్యాఖ్యానించడంతో కొందరు ‘మీటూ అర్బన్ నక్సల్’ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్యాగ్స్ చేశారు. దీనిపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వారిపై పలు వ్యాఖ్యలు చేశారు. అర్బన్ నక్సల్ పేరుతో వారిన అరెస్ట్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
‘‘పోలీసులు వారిని మాత్రమే అరెస్ట్ చేయగలరు. వారి ఆలోచనలను అరెస్ట్ చేయలేరు. ఆ విధంగా ఆలోచించే ప్రజలను కూడా అరెస్ట్ చేస్తే దేశంలో ఉన్న జైళ్లు సరిపోవు. జాతిపిత మహాత్మ గాంధీని ఈ దేశంలో హత్య చేశారు. గాంధీని హత్య చేసిన వారే నేడు అధికారంలో ఉన్నారు. వారిని అరెస్ట్ చేయగలమా?’’ అని ప్రశ్నించారు. దేశ సంపదను కాజేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, చోక్సీలను ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుందని ఆమె ప్రశ్నించారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న ప్రజా సంఘాల నేతలను మాత్రం ప్రభుత్వం కుట్ర పూరితంగా అణచివేస్తోందని అన్నారు. ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా బీమా-కోరేగావ్ ఘటనతో వారికి ఎలాంటి సంబంధం లేదని, ప్రధాని హత్యకు వారు ప్రయత్నించారన్న వార్త తనకు వింతగా అనిపించిందని స్వర భాస్కర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment