
సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విప్లవ కవి వరవరరావును నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని వరవరరావు కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి వెల్లడించారు. పరీక్షల అనంతరం ఆస్పత్రిలో చేర్పిస్తారా.. లేదా? అని అనుమానం వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావును కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసుల్లో ఇరికించి, అమానుషంగా జైలులో దీర్ఘ కాలం నిర్బంధించిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, తాత్కాలిక బెయిల్ కోసం వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతోపాటు తన ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్న దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది ఆర్.సత్యనారాయణ్ అయ్యర్ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వరవరరావుకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ జూన్ 26న ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఒక పిటిషన్, వరవరరావు మెడికల్ రికార్డులను అందజేసేలా నవీ ముంబైలోని తలోజా జైలు అధికారులను ఆదేశించాలని కోరుతూ మరో పిటిషన్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment