మాట్లాడుతున్న విసరంనేత వరవరరావు
సాక్షి, మేడ్చల్‌జిల్లా: బీజేపీ కనుసన్నల్లో టీఆర్‌ఎస్ నడుస్తోందని, డంపింగ్‌యార్డ్ విషయంలో కోర్టు కేసుల పేరుతో ప్రజా ఉద్యమాలను నీరుగార్చే ప్రయత్నాలను సహించబోమని విరసంనేత వరవరరావు, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ అన్నారు. 12న జవహర్‌నగర్‌లో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం మేడ్చల్ జిల్లాప్రెస్‌క్లబ్‌లో జవహర్‌నగర్ ప్రజాహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆద్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జవహర్‌నగర్‌లోని డంపింగ్‌యార్డ్ ప్రభావంతో దాదాపు 15 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని దానిని దూర ప్రాంతాలకు తరలించి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వాలు పవర్‌ప్లాంట్ పేరుతో ఇక్కడే శాశ్వతంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. తెలంగాణ రాకముందు రాంకీ డంపింగ్‌యార్డ్‌ను వ్యతిరేకించిన టీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్నారని ఆరోపించారు.
అప్పుడు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత డంపింగ్‌యార్డ్‌కు వచ్చి కంటనీరు పెట్టుకుందని ఇప్పుడేమైందని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా తయారైన డంపింగ్‌ను తరలించేదుకు జవహర్‌నగర్ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఏకమయ్యాయన్నారు. మంగళవారం నిర్వహించే మహాధర్నాకు వేలాది మంది పాలమిలటరీ భలగాలతో విచ్చిన్నం చేయడానికి ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఈ విషయంపై తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డికి విజ్ఞప్తి చేశామని, శాంతియుతంగా నిర్వహించే ఈ మహాధర్నాకు ఆటంకం ఎదురైతే జరుగబోయే పరిణామాలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. జవహర్‌నగర్ ప్రజాహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ చైర్మెన్ మేడరవి, కన్వీనర్ మస్తాన్‌బీ, వైఎస్సార్‌సీపీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాకాల డానియేల్, ప్రజాకళామండలి రాష్ట్ర అధ్యక్షుడు జాన్, తెలంగాణప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవిచందర్ ,వైఎస్సార్‌సీపీ కీసర మండల అధ్యక్షుడు సోమన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment