kLR
-
మంత్రి దృష్టికి తీసుకెళ్తా.. సమస్యను పరిష్కరిస్తా: కేఎల్ఆర్
సాక్షి, హైదరాబాద్: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని జన్నాయిగూడ గ్రామంలో ఫ్యాబ్ సిటీ, ఫార్మసిటీ వల్ల భూములు కోల్పోయిన స్థానికులతో మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేఎల్ఆర్ (కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి), ధరణి కమిటీ చైర్మన్ కోదండ రెడ్డిలు భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కేఎల్ఆర్ మాట్లాడుతూ.. సమస్యను మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. సమస్యను పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బోధ మాధవరెడ్డి, పుంటి కూర చంద్రశేఖర్‌రెడ్డి, ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్తో పాటు ఆయా గ్రామల రైతులు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులు.. ఆరుగంటలుగా కొనసాగుతున్న సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆరు గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్, బడంగ్పేట్ మేయర్ పారిజాత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు గిరిధర్‌రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కేఎల్ఆర్ నివాసం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీలో ఉన్న కేఎల్ఆర్ ఫామ్ హౌస్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం తుక్కుగూడలో పార్టీ కార్యాలయాన్ని కేఎల్ఆర్ ప్రారంభించారు. అటు శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో ఉన్న అక్బర్ బాగ్‌లో కేఎల్ఆర్ ఫామ్ హౌస్‌లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ రంగారెడ్డి పరిసరాల్లో పలు ఫామ్ హౌస్‌లు, గచ్చిబౌలి సమీపంలో ఎన్సిసీలో కూడా విల్లా ఉన్నట్టు సమాచారం. మరో వైపు, కాంగ్రెస్ నేత పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. బడంగ్ పేట్ కార్పొరేటర్‌గా ఉన్న పారిజాత.. మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశించారు. తెల్లవారు జామున 5 గంటలకు చేరుకున్న ఐటీ అధికారులు.. పారిజాత కూతురు ఫోన్ స్వాధీనం చేసుకుని సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం పారిజాత తిరుపతిలో, ఆమె భర్త నర్సింహా రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. 10 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. కోకాపేట్ హిడెన్ గార్డెన్‌లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు గిరిధర్‌రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేపట్టారు. గిరిధర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. చదవండి: కాంగ్రెస్ పొత్తు యూటర్న్‌పై నారాయణ ట్వీట్ -
TS Election 2023: బీఆర్ఎస్లో వన్ మేన్ షో ! మరో పార్టీ నో..!
సాక్షి, వికారాబాద్: డీసీసీబీ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త బుయ్యని మనోహర్‌రెడ్డి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరడం వెనుక మర్మమేమిటనేది రాజకీయ వర్గాల్లో అంతుచిక్కని ప్రశ్నలా మారింది. బీఆర్ఎస్లో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వర్గంలో కీలక నేతగా ఉండటంతోపాటు మంత్రి కేటీఆర్‌తో సాన్నిహిత సంబంధాలున్నాయి. అలాంటి నేత పార్టీ వీడేందుకు సిద్ధమైతే బీఆర్ఎస్లో ఏ ఒక్క నేత ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. అయితే బుయ్యని మనోహర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే ఢిల్లీలో లేదా గాంధీభవన్‌లో పార్టీ కండువా వేసుకోవాలి. కాని చిన్నపాటి కార్యకర్తలా తాండూరులో చేరడం వెనుక కాంగ్రెస్‌లో ఆగ్రహజ్వాలలు ఎగిసి పడుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోనే వ్యాపారవేత్తగా ఖ్యాతిగాంచిన బుయ్యని మనోహర్‌రెడ్డి నాటకీయ పరిణామాల నడుమ కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ హోదాలో కొనసాగుతున్నారు. మనోహర్‌రెడ్డి పరిగిలో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. మరోవైపు తన సొంత నియోజవకర్గంలో పర్యటించాలని అధికార పార్టీ నేతలు ఆంక్షలు విధించారంటూ ఆందోళనకు గురయ్యారు. బీఆర్ఎస్లో వన్‌మెన్ షో కొనసాగుతుందంటూ ఇక పార్టీలో కొనసాగడం కష్టమంటూ ప్రకటించారు. కాంగ్రెస్‌లో చేరిన మనోహర్‌రెడ్డికి తన సొంత నియోజకవర్గమైన పరిగిలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి టికెట్ ఖాయమని తెలుస్తోంది. దీంతో రామ్మోహన్‌రెడ్డి చొరవతో తాండూరు అసెంబ్లీ స్థానాన్ని మనోహర్‌రెడ్డికి కేటాయిస్తే ఇటు పరిగి నియోజకవర్గంలోని మనోహర్‌రెడ్డి అనుచరగణమంతా కాంగ్రెస్‌కి మద్దతు పలకడంతో పార్టీ గెలుపు అవకాశాలు అధికమయ్యాయంటూ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు తాండూరు నియోజకవర్గంలో దశాబ్దానికి పైగా బుయ్యని సోదరులు రైస్ మిల్లుతో పాటు ఆర్బీఎల్ పరిశ్రమ ద్వారా తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. టికెట్ కోసం సర్వే.. కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ముగ్గురు కాంగ్రెస్ నాయకులకు సంబంధించి తాండూరు నియోజకవర్గంలో సర్వేలు నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజుల్లో సర్వే పూర్తవుతుంది. మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అభ్యర్థి అంటూ ప్రజల్లోకి.. తాండూరు అసెంబ్లీకి మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అభ్యర్థిగా వస్తారంటు ఇప్పటికే నియోజవకర్గంలోని మారుమూల గ్రామ ప్రజల వరకు వెళ్లింది. నెల రోజుల క్రితమే నియోజవకర్గంలో వాల్‌పోస్టర్లను అంటించారు. కేఎల్ఆర్ అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ సభ్యులు, తాండూరు నియోజకవర్గ ఇన్చార్జి రమేశ్ మహరాజ్ సైతం మద్దతు పలికారు. అయితే మనోహర్‌రెడ్డి తాండూరు పట్టణంలో పార్టీలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తాండూరు అసెంబ్లీకి చేతి గుర్తు ఎవరిని వరిస్తోందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. టికెట్ కోసం పోటీ పడుతున్న ఇద్దరు నేతలు.. తాండూరు అసెంబ్లీకి కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా ఢిల్లీ స్థాయిలో లాభియింగ్ చేస్తున్నారు. వారం రోజులుగా మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ఢిల్లీలో మకాం వేశారు. అయితే ఇటీవల పార్టీలో చేరిన డీసీసీబీ మాజీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై భారం వేశారు. దీంతో మనోహర్‌రెడ్డికి టికెట్ ఇప్పించే బాధ్యత రేవంత్‌రెడ్డి భుజస్కంధాలపై వేసుకొన్నారు. తన నియోజకవర్గం ఆనుకొని ఉన్న తాండూరు సీటు విషయంలో రేవంత్‌రెడ్డి పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. -
కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం: కేఎల్ఆర్
సాక్షి, కీసర: రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎల్ఆర్ అన్నారు. అధిష్టానం కేఎల్ఆర్ను మేడ్చల్ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఆయన కీసరలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి ప్రజలు పట్టకట్టనున్నారన్నారు. సోనియాగాంధీ , రాహుల్‌గాంధీ అంకితభావంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఎన్నో ఆశలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అన్ని రంగాల్లో వెనక్కి నెట్టేశారన్నారు. ఇక మేడ్చల్ విషయానికి వస్తే తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను అమలు చేశానని, తన హాయంలో జరిగిన అభివృద్ధి పనులు తప్ప టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క చెప్పుకోదగ్గ అభివృద్ధి ఇక్కడ జరుగలేదన్నారు. తాను రెండు కళాశాలను ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా విద్యనందిస్తుంటే ఎంపీ మల్లారెడ్డి విద్యావ్యాపారం చేస్తున్నాడన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని నియోజవకవర్గ ఓటర్లను అభ్యర్థించారు. అంతకు ముందు ఆయన కుటుంబ సమేతంగా కీసరగుట్టస్వామిని దర్శించుకున్నారు పార్టీ మండల అధ్యక్షుడు మొర్గుముత్యాలు, నేతలు ఖాజామోహినుద్దీన్, జైహింద్‌రెడ్డి, రమేష్‌గుప్తా, జంగయ్యయాదవ్, తటాకం నారాయణశర్మ, తటాకం అభిలాష్, శ్రీకాంత్‌రెడ్డి, గూడూరు ఆంజనేయులుగౌడ్, దయానంద్‌గౌడ్, జానకీరామ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ కనుసన్నల్లో టీఆర్ఎస్
సాక్షి, మేడ్చల్‌జిల్లా: బీజేపీ కనుసన్నల్లో టీఆర్ఎస్ నడుస్తోందని, డంపింగ్‌యార్డ్ విషయంలో కోర్టు కేసుల పేరుతో ప్రజా ఉద్యమాలను నీరుగార్చే ప్రయత్నాలను సహించబోమని విరసంనేత వరవరరావు, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ అన్నారు. 12న జవహర్‌నగర్‌లో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం మేడ్చల్ జిల్లాప్రెస్‌క్లబ్‌లో జవహర్‌నగర్ ప్రజాహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆద్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జవహర్‌నగర్‌లోని డంపింగ్‌యార్డ్ ప్రభావంతో దాదాపు 15 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని దానిని దూర ప్రాంతాలకు తరలించి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వాలు పవర్‌ప్లాంట్ పేరుతో ఇక్కడే శాశ్వతంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. తెలంగాణ రాకముందు రాంకీ డంపింగ్‌యార్డ్‌ను వ్యతిరేకించిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్నారని ఆరోపించారు. అప్పుడు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత డంపింగ్‌యార్డ్‌కు వచ్చి కంటనీరు పెట్టుకుందని ఇప్పుడేమైందని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా తయారైన డంపింగ్‌ను తరలించేదుకు జవహర్‌నగర్ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఏకమయ్యాయన్నారు. మంగళవారం నిర్వహించే మహాధర్నాకు వేలాది మంది పాలమిలటరీ భలగాలతో విచ్చిన్నం చేయడానికి ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఈ విషయంపై తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డికి విజ్ఞప్తి చేశామని, శాంతియుతంగా నిర్వహించే ఈ మహాధర్నాకు ఆటంకం ఎదురైతే జరుగబోయే పరిణామాలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. జవహర్‌నగర్ ప్రజాహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ చైర్మెన్ మేడరవి, కన్వీనర్ మస్తాన్‌బీ, వైఎస్సార్సీపీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాకాల డానియేల్, ప్రజాకళామండలి రాష్ట్ర అధ్యక్షుడు జాన్, తెలంగాణప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవిచందర్ ,వైఎస్సార్సీపీ కీసర మండల అధ్యక్షుడు సోమన్న పాల్గొన్నారు. -
కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్వంచ : కేఎల్ఆర్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ కాటిరెడ్డి లక్ష్మారెడ్డి చిరస్మరణీయుడని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేఎల్ఆర్ వర్ధంతి సందర్భంగా స్థానిక కేఎల్ఆర్ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలోని కేఎల్ఆర్ ఘాట్ వద్ద విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేఎల్ఆర్ విద్యాభివృద్ధికి చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. అనంతరం విద్యార్థులను పలకరిస్తూ.. ఘాట్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కేఎల్ఆర్ విద్యాసంస్థలు ఎలా అభివృద్ధి చెందాయో.. తాను నాటిన మొక్కలను కూడా అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో విద్యాసంస్థల సెక్రటరీ వై.మధుసూదన్‌రెడ్డి, కేఎల్ఆర్ సోదరులు కాటిరెడ్డి శంకర్‌రెడ్డి, కాటిరెడ్డి గోవిందరెడ్డి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ నాగార్జునరెడ్డి, రోశిరె డ్డి, ప్రసాద్‌రావు, వెంకటేశ్వరరెడ్డి, కాశీనాథ, అధ్యాపక బృందం పాల్గొన్నారు. డీఏవీ పాఠశాలలో.. అనంతరం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డీఏవీ పాఠశాలకు చేరుకోగా.. సీఈ బాదావత్ లక్ష్మయ్య, ఎస్ఈలు ఎల్లయ్య, రమేష్, ఏడీఈ నరేష్, ప్రిన్సిపాల్ వీర య్య, విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీ ప్రారంభించారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థారుుకి ఎదగాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మల శివారెడ్డి, ఏసుపాదం, మండల అధ్యక్ష, కార్యదర్శులు బాలినేని నాగేశ్వరరావు, పిట్టల రామారావు, కొల్లు వెంకటరెడ్డి, డాక్టర్ యుగంధర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సందుపట్ల శ్రీనివాసరెడ్డి, రేవంత్, సునీల్‌రెడ్డి, కలగట్ల నాగిరెడ్డి, ఇందు వరప్రసాద్, పాతూరి లక్ష్మారెడ్డి, జామ్లా పాల్గొన్నారు. -
ఉత్సాహంగా తైక్వాండో పోటీలు
ఘట్కేసర్ టౌన్, న్యూస్‌లైన్: స్థానిక బంధన్ ఫంక్షన్ హాలులో ఆదివారం తైక్వాండో అండర్-14, 17 జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. వందల సంఖ్యలో క్రీడాకారులు పోటీపడ్డారు. ఎమ్మెల్యే కేఎల్లార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడు తూ..రాష్ట్ర, జాతీయస్థాయి తైక్వాండో క్రీడ ల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో తైక్వాండోలో తర్ఫీదు ఇవ్వడానికి స్టేడియం ఏర్పాటు కు కృషి చేస్తానన్నారు. కార్యక్రమం లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి నందం గణేశ్, మండల అధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మిడి రాఘవరెడ్డి, జిల్లా కార్యదర్శి కొంతం అంజిరెడ్డి, బీ బ్లాకు మహిళ అధ్యక్షురాలు అనురాధ, పంచాయతీ సభ్యులు కొత్తకొండ వెంకటేష రాంపల్లి జగదీష్‌గౌడ్, మీసాల సుధాకర్, స్టీవెన్, అబ్బగోని మీనాకుమారి, సగ్గు సాయికుమార్, నాయకులు సల్లూ రి నర్సింగ్‌రావ్, నవీన్, పల్లపు రమేష్, నరేందర్, శ్రీనివాస్‌రెడ్డి, తైక్వాండో జిల్లా కార్యదర్శి కేపీ హనుమంతు, కోచ్‌లు అమర్‌సింగ్, రాజు, సుధీర్, బీరేందర్‌సింగ్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధ్యమే శామీర్‌పేట్ రూరల్: పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ నెల 7 నుంచి 10 వరకు గుజరాత్‌లోని మేహసన్లో జరిగే 26వ అండర్-19 నెట్‌బాల్ చాంపియన్‌షిప్ జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొనడానికి తరలివెళ్తున్న క్రీడాకారులకు కేఎల్లార్ ట్రస్ట్ ఆధ్వర్యం లో ఆదివారం స్థానిక మినీ స్టేడియంలో క్రీడా దుస్తులు, బూట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు ఓటము లు సహజమన్నారు. ఓటమి గెలుపునకు పునాదిలాంటిదని, గెలుపొందడానికి ప్రతి క్రీడాకారుడు శ్రమించాలన్నారు. జాతీయస్థాయిలో మంచి ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షిం చారు. క్రీడల్లో రాణించిన వారికి మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో నెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సమ్మయ్య, జాతీయస్థాయి నెట్‌బాల్ చాంపియన్‌షిప్ ఇన్చార్జి మురళీకృష్ణ, శామీర్‌పేట్ ప్రధానోపాధ్యాయురాలు మనోరంజిత, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు దానయ్య, నెట్‌బాల్ శిక్షకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
రెండు నెలల్లో తెలంగాణకు కొత్త సీఎం
శామీర్‌పేట్, న్యూస్‌లైన్ : రెండు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రిని కూడా ప్రకటించే అవకాశం ఉందని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్లార్) పేర్కొన్నారు. శుక్రవారం ఆయన శామీర్‌పేట మండలం తూంకుంటలో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలో ప్రభుత్వం ఇరు ప్రాంతాల్లోనూ సమస్యలను పరిష్కరించలేకపోతోందన్నారు. విభజన జరిగిపోయిందని, ఇరు ప్రాంతాల నాయకులు కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. సబ్‌స్టేషన్ స్థలంపై వివాదం.. గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు స్థానికంగా సబ్‌స్టేషన్ నిర్మాణానికి కూడా ఎమ్మెల్యే శంకుస్థాపన చేయాల్సి ఉంది. కానీ అందుకు కేటాయించిన స్థలంపై కొందరు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో శంకుస్థాపన చేయకుండానే వెనుదిరిగారు. అందరికీ ఎమ్మెల్యేలా వ్యవహరించాలి.. గ్రామానికి చెందిన కొందరు వార్డు సభ్యులు ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు. అన్ని వర్గాలను సమానంగా చూడాల్సిన ఎమ్మెల్యే.. కొందరికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపన సందర్భంగా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేకు అనుకూలంగా నినాదాలు చేయడంతో కొత్తగా ఎన్నికైన ఇతర పార్టీల వార్డు సభ్యులు, గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఎద్దు నగేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు దయాసాగర్ యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, అశోక్, సురేశ్, క్రిష్ణారెడ్డి, మహేందర్‌రెడ్డి, హన్మంతరెడ్డి, వెంకట్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, కృష్ణ, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దుర్భాషలాడారు: లక్ష్మణ్ పింఛన్ ఇప్పించాలని కోరితే వికలాంగుడినని కూడా చూడకుండా ఎమ్మెల్యే తనను దుర్భాషలాడారని గ్రామానికి చెందిన లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్నాళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిందని, పింఛన్ కోసం అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని చెప్పాడు. ఎమ్మెల్యే గ్రామానికి రావడంతో పింఛన్ ఇప్పించాలని వేడుకున్నానని, అయితే ఎమ్మెల్యే తన సమస్యకు పరిష్కారం చూపకపోగా దుర్భాషలాడారని ఆరోపించాడు. -
తెలంగాణను అడ్డుకుంటే చరిత్రహీనులే
శామీర్‌పేట్/శామీర్‌పేట్ రూరల్, న్యూస్‌లైన్: తెలంగాణను అడ్డుకునేవారు చరిత్రహీనులుగా నిలిచిపోతారని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎ ల్లార్) అన్నారు. కాంగ్రెస్ శామీర్‌పేట్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అలియాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో ‘తెలంగాణ విజయోత్సవ సభ’ నిర్వహించారు. అంతకుముందు మండలంలో బైక్ ర్యాలీని ఎమ్మెల్యే కేఎల్లార్ జెండా ఊపి ప్రారంభిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష చివరి ఘట్టంలో ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేవలం సాంకేతిక అడ్డు మాత్రమే ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాటాలు చేసినవారికి శుభాకాంక్షలు, అమరవీరులకు జోహారులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అడ్డుకోవాలని ప్రయత్నించినవారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఓటింగ్ లేదు. కాగితాలతోనే అసెంబ్లీలో తెలంగాణ బిల్లు అమలవుతుందన్నారు. కేంద్రం నుంచి కాగితం వస్తుంది. మూడు నెలల్లో విభజన జరుగుతుందన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి అన్ని ప్రాంతాలకూ ముఖ్యమంత్రిగా వ్యవహరించడంలేదని, కేవలం ఒక ప్రాంతానికే వత్తాసు పల కడం దారుణమన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు తెలంగాణ ప్రజలు శాంతియుతంగా.. గాంధేయవాదం తరహాలో ఉద్యమాలు చేస్తే.. సీమాంధ్రులు కరెంట్ బంద్ పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ‘‘ముఖ్యమంత్రి కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు సీమాంధ్ర ఉద్యమంలో ఉండండి.. చావండి.. కానీ మా తెలంగాణ జోలికి వస్తే మాత్రం ఊరుకోబోమని’’ ఆయన తేల్చి చెప్పారు. త్వరలో దేశానికి రానున్న అటామిక్ పవర్ ప్లాంట్‌ను తెలంగాణ ఎత్తిపోతల పథకాలకు తీసుకువచ్చేలా ఈ ప్రాంత ఎమ్మెల్యేలందరం కృషి చేస్తామని కేఎల్లార్ స్పష్టంచేశారు. కాగా తెలంగాణ విజయోత్సవ బైక్ ర్యాలీ సోమవారం ఉదయం మండలంలోని దేవరయాంజాల్ వద్ద ప్రారంభమై అన్ని గ్రామాల్లో తిరుగుతూ సాయంత్రం అలియాబాద్‌లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంది. కాంగ్రెస్‌లో చేరిన తూంకుంట సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు తూంకుంటలో ఇటీవల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందిన ఎద్దు నాగేశ్‌తో పాటు ఉప సర్పంచి మాధవి రంగారావు, వార్డుసభ్యులు బి. మంజులా సహదేవ్, ఎం. మంగమ్మ నర్సంహ, రాము యాదవ్, నిర్మలా అశోక్‌లు కాంగ్రెస్‌లో చేరారు. వీరికి ఎమ్మెల్యే కేఎల్లార్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు బాల్‌రాజ్‌గౌడ్, వైఎస్ గౌడ్, శ్రీనివాస్‌రె డ్డి, దయాసాగర్, అశోక్, మహేందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, సునీత, రూప, నాగశ్రీ, లక్ష్మీనారాయణ, కృష్ణ, భిక్షపతి, వెంకట్‌రెడ్డి, కృష్ణారెడ్డి, బస్వారెడ్డి, జగన్నాథం, సత్యనారాయణ, సర్పంచ్‌లు మల్లేష్, అశోక్‌లతో పాటు ఆయాగ్రామాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. ధూంధాంలో కేఎల్లార్ నృత్యం.. చీర్యాల్‌లోని తెలంగాణ జన చైతన్య యాత్ర కళామండలి వారు అలియాబాద్‌లో నిర్వహించిన ధూంధాంలో ఎమ్మెల్యే కేఎల్లార్ స్థానిక నాయకులతో కలిసి నృత్యం చేశారు.