శామీర్‌పేట్, న్యూస్‌లైన్ : రెండు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రిని కూడా ప్రకటించే అవకాశం ఉందని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్లార్) పేర్కొన్నారు. శుక్రవారం ఆయన శామీర్‌పేట మండలం తూంకుంటలో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలో ప్రభుత్వం ఇరు ప్రాంతాల్లోనూ సమస్యలను పరిష్కరించలేకపోతోందన్నారు. విభజన జరిగిపోయిందని, ఇరు ప్రాంతాల నాయకులు కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు.
సబ్‌స్టేషన్ స్థలంపై వివాదం..
గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు స్థానికంగా సబ్‌స్టేషన్ నిర్మాణానికి కూడా ఎమ్మెల్యే శంకుస్థాపన చేయాల్సి ఉంది. కానీ అందుకు కేటాయించిన స్థలంపై కొందరు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో శంకుస్థాపన చేయకుండానే వెనుదిరిగారు.
అందరికీ ఎమ్మెల్యేలా వ్యవహరించాలి..
గ్రామానికి చెందిన కొందరు వార్డు సభ్యులు ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు. అన్ని వర్గాలను సమానంగా చూడాల్సిన ఎమ్మెల్యే.. కొందరికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపన సందర్భంగా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేకు అనుకూలంగా నినాదాలు చేయడంతో కొత్తగా ఎన్నికైన ఇతర పార్టీల వార్డు సభ్యులు, గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఎద్దు నగేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు దయాసాగర్ యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, అశోక్, సురేశ్, క్రిష్ణారెడ్డి, మహేందర్‌రెడ్డి, హన్మంతరెడ్డి, వెంకట్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, కృష్ణ, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దుర్భాషలాడారు: లక్ష్మణ్
పింఛన్ ఇప్పించాలని కోరితే వికలాంగుడినని కూడా చూడకుండా ఎమ్మెల్యే తనను దుర్భాషలాడారని గ్రామానికి చెందిన లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్నాళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిందని, పింఛన్ కోసం అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని చెప్పాడు. ఎమ్మెల్యే గ్రామానికి రావడంతో పింఛన్ ఇప్పించాలని వేడుకున్నానని, అయితే ఎమ్మెల్యే తన సమస్యకు పరిష్కారం చూపకపోగా దుర్భాషలాడారని ఆరోపించాడు.
రెండు నెలల్లో తెలంగాణకు కొత్త సీఎం
Published Sat, Oct 19 2013 12:50 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement