సాక్షి, హైదరాబాద్: విరసం నేత, విప్లవ కవి వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. భీమా కొరేగావ్ కేసుకు సంబంధించి జైల్లో ఉన్న ఆయనకు సోమవారం బొంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యేక షరతులతో ఆరునెలల మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. స్పెషల్ ఎన్ఐఏ కోర్టు పరిధిలోనే (ముంబైలోనే) ఉండాలని, అలాగే గత ఎఫ్ఐఆర్‌కు దారి తీసిన కార్యకలాపాలు చేయగూడదంటూ షరతులు విధించింది. దీంతో వరవరరావు ఆరోగ్యంపై ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు, పౌర హక్కుల సంఘాల ప్రతినిధులకు భారీ ఊరట లభించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తన భర్తకు బెయిల్ ఇవ్వాలన్న వరవరావు భార్య పిటీషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ పరిస్థితుల్లో ఆయనను జైలుకు పంపడం సరికాదని భావించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అవసరమైనప్పుడు రావు విచారణకు హాజరుకావాలని, అయితే భౌతిక హాజరునుంచి మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. మరోవైపు ఈ ఉత్తర్వుపై మూడు వారాల పాటు స్టే విధించాలని కోరిన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. ఇటీవల కరోనా సోకడంతోపాటు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భర్త వరవరావును బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ భార్య హేమలత బొంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment