తొలితరం ఉద్యమ మహిళ | Varavara Rao Writes On Komuramma | Sakshi
Sakshi News home page

తొలితరం ఉద్యమ మహిళ

Published Fri, Jul 20 2018 1:48 AM | Last Updated on Fri, Jul 20 2018 1:48 AM

Varavara Rao Writes On Komuramma - Sakshi

సందర్భం
జూన్‌ 6న రిపబ్లిక్‌ చానల్,  టైమ్స్‌ నౌ లేఖల దుమారం మొదలైన రోజుల్లోనే కొమురమ్మ మహబూబాబాద్‌లో చనిపోయిన వార్త తెలిసింది. తేరుకున్నపుడు ఆమె జ్ఞాపకాలు ముసురుకుం టూనే ఉన్నాయి గానీ రాయడానికి వీలు కాలేదు. మేము సికింద్రాబాద్‌ కుట్ర కేసులో సహ ముద్దాయిలం. సీపీఐఎంఎల్‌íసీఓసీ వరంగల్‌ జిల్లా తొలి నాయకులలో ఒకరైన బర్ల యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌మోహన్‌రెడ్డి, స్నేహలతల దళంలో వెంకటయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వినేవాళ్లం.

1974 మే 18న హనుమకొండలో అరెస్టు చేసి మే 20న నన్ను మరో నలుగురు విప్లవ రచయితలను సికింద్రాబాద్‌ మేజిస్ట్రేటు కోర్టులో హాజరుపరచినపుడు ఇచ్చిన ఎఫ్‌ఐ ఆర్‌లో కోటగిరి వెంకటయ్య, కొమురమ్మల పేర్లను చూశాం. ఎమర్జెన్సీ కాలంలో విరసం కార్యవర్గ సభ్యులం దరినీ మీసా కింద అరెస్టుచేసి రాష్ట్రం లోని ఆయా జైళ్లలో డిటెన్యూలుగా ఉంచారు. అట్లా మేం వరంగల్‌ జైలులో ఉండగా కొమురమ్మ అరెస్టయి ఇదే ఆవరణలోని మహిళా జైలుకు వచ్చిందని జైలు జవాన్ల ద్వారా తెలిసింది. అంతకుముందే కృష్ణానదీ తీరాన మంగళగిరి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కోటగిరి వెంకటయ్య మరణించినట్లు పత్రికల్లో చదివాం.

అప్పటికి ఆమె గర్భవతి. రహస్యప్రదేశంలో ఉన్నపుడు కోటగిరి వెంకటయ్యను, ఆమెను అరెస్టు చేశారని, ఇద్దరినీ వేరుచేసి ఆయనను ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపేసి, ఆమె కదలలేని స్థితిలో అనారోగ్యంతో ఉన్నందున అరెస్టు చేసి వరంగల్‌ జైలుకు తీసుకువచ్చారని తరువాత కాలంలో తెలిసింది. కొమురమ్మ జైలులోనే ప్రసవించింది. ఆమె పాప జైలులోనే పెరిగింది. 1976–77లో మేం చంచల్‌గూడ జైలులో ఉన్నప్పుడు సికింద్రాబాద్‌ కుట్రకేసు విచారణకు స్పెషల్‌ కోర్టుకు తీసుకెళ్లేవాళ్లు. ఈ కేసు విచారణ కోసమే కొమురమ్మను కూడా చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. అప్పటికే ఆ జైలులో డిటెన్యూలుగా విప్లవ రాజకీయ ఖైదీలుగా డా. వీణా శత్రుజ్ఞ, పీఓడబ్లూ్ల్య అధ్యక్షురాలు కె.లలిత, కరపత్రాలు పంచుతూ అరెస్టయిన పీఓడబ్లూ్ల్య అంబిక, స్వర్ణలత(అమరుడు మధుసూదన్‌రాజ్‌ సహచరి)ల సహచర్యం, ఆదరణ వల్ల కొమురమ్మ, ఆమె పాపకు కాస్త ఆరోగ్యం సమకూరి తేరుకున్నట్లున్నది.

కోర్టు వాయిదాలకు తీసుకువెళ్లేప్పుడే మొదటిసారి ఆమెను ఎస్కార్ట్‌ వ్యానులో చూడగలిగాను. ఆజానుబాహువు. దృఢకాయం. గంభీరమైన వ్యక్తిత్వం. ఎమర్జెన్సీ ఎత్తివేసి ఏర్పడిన ప్రజాస్వామిక వాతావరణంలో రాజకీయ ఖైదీలతోపాటు కొమురమ్మ కూడా విడుదలై మహబూబాబాద్‌ ప్రాంతంలో ప్రజాఉద్యమంలో పనిచేయడం ప్రారంభించింది. వరంగల్‌లో రాడికల్‌ విద్యార్థి సంఘం రెండో మహాసభలు(1978 ఫిబ్రవరి), గుంటూరులో రాడికల్‌ యువజన సంఘం ఆవిర్భావ మహాసభలు (1978 మే) జరిగి ‘గ్రామాలకు తరలండి’ కార్యక్రమం చేపట్టి వందలాది గ్రామాలు తిరిగే సందర్భంలో కొమురమ్మ రాడికల్‌ యువజన సంఘంలో పనిచేసింది. ఆమె పాపను స్నేహలత అనే పేరు పెట్టి హనుమకొండ హాస్టల్‌లో చేర్చాం. మహబూబాబాద్‌కు దగ్గరలోని కేసముద్రంలో రాడికల్‌ యువజన సంఘం సభలు కొమురమ్మ ఆధ్వర్యంలోనే జరి గాయి. వేలాదిమంది విద్యార్థి, యువజనులు, రైతాంగం తరలివచ్చారు.  సభలో కొమురమ్మ కూడా వక్త.

1989 ఫిబ్రవరిలో సికింద్రాబాద్‌ కుట్రకేసులో తీర్పు సందర్భంగా, బతి కుండి బహిరంగ జీవితంలో ఉన్న ముద్దాయిలందరం కలుసుకున్నాం. కేసు కొట్టివేసి మా అందరినీ నిర్దోషులుగా ప్రకటించారు. అప్పటికే కొమురమ్మ జీవితంలో చాలా కష్టాలు, విషాదాలు అనుభవించింది. చాలా విరా మం తరువాత ఆఖరుసారి ఆమెను 2015 జనవరి 27న కవి విమల ఇంటిలో కలవగలిగాను. సుప్రసిద్ధ చరిత్ర రచయిత ప్రొ‘‘ ఉమా చక్రవర్తి మహిళా రాజకీయ ఖైదీల మీద డాక్యుమెంటరీ చేయదలుచుకుని కొమురమ్మను పిలిపించింది.

ఆమె కష్ట సుఖాలు, ఆమె కుటుంబం గురించి విని చాలా బాధ కలిగింది. మళ్లీ ఒకసారి వచ్చి తన సమస్యలన్నీ చెప్పుకుంటానని తప్పకుండా వస్తానని మాట ఇచ్చింది కానీ రాలేకపోయింది. ఆ సమస్యలతో, అనారోగ్యం తోనే బహుశా మరణించి ఉంటుంది. మహబూబాబాద్‌లోని విప్లవ అభిమానులు, ప్రజాసంఘాలు ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారని ప్రజాసంఘాల కార్యకర్తల ద్వారా తెలిసింది. ఆమె కుటుం బానికి సంతాపం, ఆమె కోసం అశ్రునయనాల జోహార్లు చెప్పడానికి ఇంత ఆలస్యమైంది.

వ్యాసకర్త విరసం సంస్థాపక సభ్యులు
వరవరరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement