
గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో గృహనిర్బంధంలో ఉన్న వరవరరావు
హైదరాబాద్: విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు గృహనిర్బంధంలోనే గడిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనను గురువారం పుణే పోలీసులు తిరిగి గాంధీనగర్‌లోని తన స్వగృహానికి తరలించారు. సెప్టెంబర్ 5 వరకు గృహనిర్బంధం చేసిన దరిమిలా ఆయన నివాసం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి 11.30 గంటల విమానంలో పుణే నుంచి వరవరరావు బయలుదేరాల్సి ఉండగా దాన్ని సకాలంలో అందుకోలేకపోవడంతో తెల్లవారుజామున 2.30 గంటల విమానంలో పోలీసులు ఆయనను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ..పోలీసులు తనపై అక్రమ కేసులు బనాయించారని, దీనిపై కోర్టు ద్వారా న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. అనంతరం వరవరరావును అక్కడ్నుంచి గురువారం ఉదయం 6.30కు పోలీసు బందోబస్తు మధ్య ఆయన నివాసానికి తరలించారు. ఈ సందర్భంగా సతీమణి హేమలత, కుటుంబ సభ్యులు ఆయనను ఆలింగనం చేసుకొని కన్నీటిపర్యంతమయ్యారు.
ఇద్దరు పుణే పోలీసులు ఇంట్లో కాపలా ఉండగా, తెలంగాణ పోలీసులు ఇంటి బయట, అపార్ట్‌మెంట్ ప్రధాన ద్వారం వద్ద కాపలా ఉన్నారు. వరవరరావును కలిసేందుకు ఆయన మేనల్లుడు ఎన్.వేణుగోపాల్, వనజ, కూతుళ్లు సహజ, అనల, పవన, అల్లుళ్లు ప్రొఫెసర్ సత్యనారాయణ, కూర్మనాథ్, మనుమలు, మనుమరాళ్లు తదితర కుటుంబ సభ్యులతో పాటుగా న్యాయవాదులు రవీంద్రనాథ్, సురేశ్‌ను మాత్రమే పోలీసులు అనుమతించారు.
ప్రజాసంఘాల నిరసన
వరవరరావును కలిసేందుకు గాంధీనగర్‌లోని హిమసాయి అపార్ట్‌మెంట్‌కు ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు, న్యూడెమోక్రసీ నాయకులు అక్కడికి తరలి రాగా వారిని పోలీసులు అనుమతించలేదు. దీంతో వారు అక్కడే నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు అక్కడకు చేరుకున్న మీడియాను సైతం పోలీసులు అనుమతించలేదు. సెప్టెంబర్ 5 వరకు వరవరరావు ఇంటి వద్ద ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది.
అరెస్టు అప్రజాస్వామికం: హరగోపాల్
వరవరరావు అరెస్టు అప్రజాస్వామికమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. గురువారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పౌరులు స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని ప్రభుత్వాలు కల్పించకుండా హక్కులు అడిగిన ప్రజాస్వామిక వాదుల గొంతులు నొక్కడం సరైంది కాదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మతోన్మాద శక్తుల ఆగడాలకు అడ్డులేకుండా పోయిందన్నారు.
దేశంలోని రచయితలు, జర్నలిస్ట్‌లు, కవులు, కళాకారులు, దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో తెలంగాణ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు రఘునాథ్ టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమాస కృష్ణ, పీఓడబ్ల్యూ సంధ్య, ఉ.సాంబశివరావు, లింగయ్య, పీఎం.రాజు తదితరులు పాల్గొన్నారు.