కేసీఆర్ నియంతృత్వ పోకడలు
ప్రజాస్వామిక వేదిక ప్రతినిధులను విడుదల చేయాలి: వరవరరావు
న్యూశాయంపేట: నియంతృత్వ పోకడల్లో కేసీఆర్ గత పాలకుల ను మించి పోయాడని విరసం నేత వరవరరావు విమర్శించారు. సోమవారం హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న వారిపై పోస్టర్ వేయడం చూస్తుంటే రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పాలన సాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 54 సంస్మరణ సభలు పెట్టుకున్నప్పుడు లేని నిర్బంధం నేడు తెలంగాణలో ఉందన్నారు.
ఎన్‌కౌంటర్ ఘటనపై నిజనిర్ధారణ కోసం ఛత్తీస్‌గఢ్‌కు వెళుతున్న తెలంగాణ ప్రజాస్వామిక వేదిక బృందం నేతలైన దుడ్డు ప్రభాకర్, చిక్కుడు ప్రభాకర్, రవీంద్రనాథ్ తదితరులను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి కుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారని, వారిని వెంటనే విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మడమ తిప్పకుండా ఉద్యమాలు చేసిన టీపీఎఫ్ నాయకులు ఆకుల భూమయ్య సంస్మరణ సభను జరుపుకోవడానికి కూడా అనుమతించకపోవడం విచారకరమన్నారు. సమావేశంలో కాత్యాయని, టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమాస కృష్ణ పాల్గొన్నారు.