న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్న ఆరోపణలతో అరెస్టయిన ఐదుగురు హక్కుల కార్యకర్తల గృహనిర్బంధాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 12 వరకూ పొడిగించింది. ఈ సందర్భంగా పోలీసులు మీడియా సమావేశాలు ఏర్పాటుచేసి కేసు వివరాలను వెల్లడించడంపై కోర్టు మండిపడింది. పుణె ఏసీపీ మీడియా సమావేశం ఏర్పాటుచేసి అత్యున్నత న్యాయస్థానానికే దురుద్దేశాలు అంటగడుతున్నారని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న అంశాలపై మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీ పోలీసులకు చెప్పండి.
ఈ కేసు విచారణ ఇప్పుడు మాముందు ఉంది. మేము తప్పు చేస్తున్నామని పోలీసుల నోటి నుంచి వినాలనుకోవడం లేదు’ అని మహారాష్ట్ర తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేసింది. పుణెలోని భీమా కొరేగావ్‌లో గతేడాది డిసెంబర్ 31న జరిగిన ఎల్గర్ పరిషత్ సభ సందర్భంగా మావోలతో కలసి హింసకు కుట్ర పన్నారని విరసం సభ్యుడు వరవరరావు, వెర్మన్ గంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖా వంటి హక్కుల కార్యకర్తలను మహారాష్ట్ర పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment