
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణల నేపథ్యంలో విరసం నేత వరవరరావును మంగళవారం పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత వరవరరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఆపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత గాంధీ ఆస్పత్రికి తరలించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
మోదీ హత్యకు కుట్ర పన్నారంటూ గతంలో దొరికిన ఓ లేఖ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా పుణె నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్‌లోని వరవరరావు నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సోదాలు మొదలయ్యాయి. మావోయిస్టులకు వరవరరావు నిధులు సమకూర్చడంతో పాటు మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై వరవరరావుని పోలీసులు విచారించారు. వరవరరావు ఇంటితో పాటు ఆయన కూతురు, ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ, జర్నలిస్టు కూర్మనాథ్, క్రాంతి టేకుల, మరో ఇద్దరు విరసం నేతల ఇళ్లలో పుణె పోలీసులు తనిఖీలు చేపట్టారు. గతంలో అరెస్టయిన రోనాల్డ్ విల్సన్ ల్యాప్‌టాప్‌లో దొరికిన లేఖ ఆధారంగా ఈ సోదాలు చేపట్టారు. ఆ లేఖలో 27 మంది పేర్లు ఉండగా అందులో వరవరరావు పేరు కూడా ఉండటంతో ఆయన్ను విచారించిన తర్వాత అరెస్ట్ చేశారు.
