
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో అరెస్టై మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్న విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు వెంటనే తాత్కాలిక బెయిల్ మంజూరు చేసి జైల్ నుండి విడుదల చేయాలని, తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చొరవ తీసుకొని బెయిల్ ఇప్పించాలని ఆయన కూతురు పవన కోరారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ హైదరాబాద్ పోలీసులు తమకు పాసులు ఇస్తామంటున్నారు. కానీ, కోర్టు అనుమతి ఉంటే మాత్రమే మా నాన్నని కలవగలం. కోర్టు అనుమతి కోసం పిటిషన్ వేశాం. అనుమతి ఇస్తేనే ముంబైకి వెళ్లి కలుస్తాం. నాన్నతో వీడియో కాల్ చేయించాలి. మూడు రోజుల నుండి ఆయన ఆరోగ్యం బాగాలేదు. తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు చీఫ్ జస్టిస్‌కి లెటర్ రాశాము. జైళ్లలో పరిస్థితి దారుణంగా ఉంది. ముంబైలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాకు ఆందోళనగా ఉంది’’ అని అన్నారు. ( జీవించే హక్కు వీరికి లేదా? )
కాగా, వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు సహజ, అనల, పవన మూడ్రోజుల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తమ తండ్రిని చూసేందుకూ అనుమతినివ్వడం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. పలువురు రచయితలు, ప్రజా సంఘాలు కూడా వరవరరావును విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment