కేశవ రావు జాదవ్ (ఫైల్ ఫొటో)
నేను వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలెజీలో బీఏ మూడో సంవత్సరం (1959 – 60)లో ఉండగా వచ్చిన ఒక కొత్త ఇంగ్లిష్ లెక్చరర్ గురించి మా జూనియర్లు ఆశ్చర్యంగా చెప్పుకొంటుండేవాళ్లు. ఆయన మనం చూస్తున్న చాలా మంది లెక్చరర్ల లాగా ఆలోచించడు, మాట్లాడడు. ఫైర్ బ్రాండ్‌లా ఉన్నాడు అనేవాళ్లు. అట్లా మొదట కేశవరావ్ జాదవ్ పేరువిన్నాను. ఉస్మానియా క్యాంపస్‌కు వచ్చిన తర్వాత మళ్లీ 1962లో ఒక సంచలన వార్త విన్నాను. గోవాను భారత ప్రభుత్వం దురాక్రమణ చేసిందని నిరసన తెలుపుతూ కొంత మంది యువకులు మహారాష్ట్ర, గోవా సరిహద్దుల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. వారిలో తర్వాత కాలంలో విరసంలో నాకు ఆత్మీయ స్నేహితుడైన ఎంటి ఖాన్ ఉన్నాడు. కేశవరావ్ జాదవ్ ఉన్నాడు. ఈ దేశం ఒక దేశం కాదు. ఉపఖండమని, ఇది ఎన్నో దేశాల, జాతుల సమాఖ్య అని వాటికి స్వయం ప్రతిపత్తి, స్వయం నిర్ణయాధికారం ఉండాలని భారత్, చైనా యుద్ధం (1962) కన్నా ముందు విశ్వసించిన వారిలో లోహియా కూడా ఉన్నాడు. 1933 జనవరి 27న హైదరాబాద్‌లోని హుస్సేనీ ఆలంలో పుట్టి 2018 జూన్ 16న అమరుడైన కేశవరావ్ జాదవ్ నిండు జీవితాన్ని అట్లా రాజీలేని లోహియా వాదిగా గడిపాడు.
సోషలిస్టుగా ఉంటూనే నక్సలైటు ఉద్యమాన్ని సుదీర్ఘ కాలం బలపరిచినవాడు జార్జి ఫెర్నాండెజ్ అయితే, జీవితాంతం బలపరిచినవాడు కేశవరావ్ జాదవ్. 1997లో ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అమరుడు ఆకుల భూమయ్య నాయకత్వంలో ప్రారంభమైన తర్వాత ఏర్పడిన జనసభకు, ఐక్య వేదికగా అది వేరువేరు రూపాలుగా తీసుకున్న నిర్మాణాలకు సన్నిహితుడై ఎన్ని ఉద్యమాల్లో పాల్గొని ఎన్ని పోరాటాలు చేసి ఎన్నిమార్లు జైళ్ల పాలయ్యాడో.. కోదండరాం చెప్పినట్టు ప్రజాస్వామిక తెలంగాణ భావనకు రాజ్యహింసతో తడిసిన ఆయన అంగీ ఒక సంకేతం.
200 ఏళ్ల క్రితం బీదర్ నుంచి వచ్చి ఆయన కుటుంబం హుస్సేనీ ఆలంలో స్థిరపడటం వల్ల ఆయన పుట్టుక నుంచి హైదరాబాదీ అయ్యాడు. హైదరాబాద్ పాత నగరాన్ని ఎంతో ప్రేమించినవాడు. హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన వైవిధ్యంగల విశ్వాస సమ్మేళనాన్ని హైదరాబాద్ ఏక్తాగా నిలబెట్టాలని ఎంటి ఖాన్ వలెనే తపించేవాడు. ఈ నేపథ్యం వల్లనే ఆయన 1952 నుంచి కూడా వివిధ రూపాలలో వచ్చిన ముల్కీ, ప్రత్యేక తెలంగాణ హక్కుల పరిరక్షణ ఉద్యమాలతో అంత మమేకమయ్యాడు. ఇందిరా నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎమర్జెన్సీ కాలమంతా ఆయన మీసా కింద జైళ్లలో ఉన్నాడు. ఆయన, ఖాన్ సాబ్ ఇద్దరూ చంచల్‌గూడ జైలులో ఉన్న రోజుల్లో రాడికల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు రమణి, పీడీఎస్‌యూ విద్యార్థి పటోళ్ల ఇంద్రారెడ్డి ఈ ఇద్దరితోనూ చాలా ప్రభావితులయ్యారు.
తార్కుండే నాయకత్వంలో జయప్రకాశ్ నారాయణ్ ఏర్పాటు చేసిన పీయూసీఎల్ అండ్ డీఆర్ 1977లో పీయూసీఎల్, పీయూడీఆర్‌గా విడిపోయిన తర్వాత జాదవ్ పీయూసీఎల్‌లో ఉండిపోయాడు. కానీ, ఒక పౌరునిగా కాళోజివలె ప్రజల జీవించే, మాట్లాడే, సంఘం పెట్టుకునే, విశ్వాసాలు కలిగి ఉండే హక్కుల కోసం రాజ్యంతో రాజీ లేకుండా పోరాడే విషయంలో ఆయన పోరాటాల్లో ఉండే ఎవరితోనైనా కలిసి పనిచేశాడు. పీయూసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా కేశవరావ్ జాదవ్ కూడా ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు చేయాలని చాలా బలంగా ఆకాంక్షించేవాడు, కృషి చేశాడు. అందువల్లనే 2004 అక్టోబర్‌లో సీపీఐఎంఎల్ పీపుల్స్ వార్‌తో పాటు సీపీఐఎంఎల్ జనశక్తి కూడా చర్చలకు వచ్చినప్పుడు మధ్యవర్తులుగా వ్యవహరించినవారిలో జాదవ్ కూడా ఉన్నాడు.
నేను 1989 ఏప్రిల్ నుంచి హైదరాబాద్‌లో స్థిరపడిన తర్వాత జాదవ్‌తో నాకు మాత్రమే కాదు నా కుటుంబానికి కూడా స్నేహం, ఆత్మీయత ఏర్పడినాయి. మేము ఎన్నో ఉద్యమాలు, ఎన్నో వేదికలు పంచుకున్నాము. తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని వివిధ దశల్లో బలపరుస్తూ ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం సాగిన సకల ఉద్యమాలకు సంఘీభావం తెలిపిన అరుదైన మేధావి కేశవరావ్ తెలంగాణ జ్ఞాపకాల్లో నిలిచి ఉంటారు.
వరవరరావు
వ్యాసకర్త విరసం సంస్థాపక సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment