Keshav Rao Jadhav
-
అవిశ్రాంత పోరాట యోధుడు
నేను వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలెజీలో బీఏ మూడో సంవత్సరం (1959 – 60)లో ఉండగా వచ్చిన ఒక కొత్త ఇంగ్లిష్ లెక్చరర్ గురించి మా జూనియర్లు ఆశ్చర్యంగా చెప్పుకొంటుండేవాళ్లు. ఆయన మనం చూస్తున్న చాలా మంది లెక్చరర్ల లాగా ఆలోచించడు, మాట్లాడడు. ఫైర్ బ్రాండ్లా ఉన్నాడు అనేవాళ్లు. అట్లా మొదట కేశవరావ్ జాదవ్ పేరువిన్నాను. ఉస్మానియా క్యాంపస్‌కు వచ్చిన తర్వాత మళ్లీ 1962లో ఒక సంచలన వార్త విన్నాను. గోవాను భారత ప్రభుత్వం దురాక్రమణ చేసిందని నిరసన తెలుపుతూ కొంత మంది యువకులు మహారాష్ట్ర, గోవా సరిహద్దుల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. వారిలో తర్వాత కాలంలో విరసంలో నాకు ఆత్మీయ స్నేహితుడైన ఎంటి ఖాన్ ఉన్నాడు. కేశవరావ్ జాదవ్ ఉన్నాడు. ఈ దేశం ఒక దేశం కాదు. ఉపఖండమని, ఇది ఎన్నో దేశాల, జాతుల సమాఖ్య అని వాటికి స్వయం ప్రతిపత్తి, స్వయం నిర్ణయాధికారం ఉండాలని భారత్, చైనా యుద్ధం (1962) కన్నా ముందు విశ్వసించిన వారిలో లోహియా కూడా ఉన్నాడు. 1933 జనవరి 27న హైదరాబాద్‌లోని హుస్సేనీ ఆలంలో పుట్టి 2018 జూన్ 16న అమరుడైన కేశవరావ్ జాదవ్ నిండు జీవితాన్ని అట్లా రాజీలేని లోహియా వాదిగా గడిపాడు. సోషలిస్టుగా ఉంటూనే నక్సలైటు ఉద్యమాన్ని సుదీర్ఘ కాలం బలపరిచినవాడు జార్జి ఫెర్నాండెజ్ అయితే, జీవితాంతం బలపరిచినవాడు కేశవరావ్ జాదవ్. 1997లో ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అమరుడు ఆకుల భూమయ్య నాయకత్వంలో ప్రారంభమైన తర్వాత ఏర్పడిన జనసభకు, ఐక్య వేదికగా అది వేరువేరు రూపాలుగా తీసుకున్న నిర్మాణాలకు సన్నిహితుడై ఎన్ని ఉద్యమాల్లో పాల్గొని ఎన్ని పోరాటాలు చేసి ఎన్నిమార్లు జైళ్ల పాలయ్యాడో.. కోదండరాం చెప్పినట్టు ప్రజాస్వామిక తెలంగాణ భావనకు రాజ్యహింసతో తడిసిన ఆయన అంగీ ఒక సంకేతం. 200 ఏళ్ల క్రితం బీదర్ నుంచి వచ్చి ఆయన కుటుంబం హుస్సేనీ ఆలంలో స్థిరపడటం వల్ల ఆయన పుట్టుక నుంచి హైదరాబాదీ అయ్యాడు. హైదరాబాద్ పాత నగరాన్ని ఎంతో ప్రేమించినవాడు. హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన వైవిధ్యంగల విశ్వాస సమ్మేళనాన్ని హైదరాబాద్ ఏక్తాగా నిలబెట్టాలని ఎంటి ఖాన్ వలెనే తపించేవాడు. ఈ నేపథ్యం వల్లనే ఆయన 1952 నుంచి కూడా వివిధ రూపాలలో వచ్చిన ముల్కీ, ప్రత్యేక తెలంగాణ హక్కుల పరిరక్షణ ఉద్యమాలతో అంత మమేకమయ్యాడు. ఇందిరా నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎమర్జెన్సీ కాలమంతా ఆయన మీసా కింద జైళ్లలో ఉన్నాడు. ఆయన, ఖాన్ సాబ్ ఇద్దరూ చంచల్‌గూడ జైలులో ఉన్న రోజుల్లో రాడికల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు రమణి, పీడీఎస్‌యూ విద్యార్థి పటోళ్ల ఇంద్రారెడ్డి ఈ ఇద్దరితోనూ చాలా ప్రభావితులయ్యారు. తార్కుండే నాయకత్వంలో జయప్రకాశ్ నారాయణ్ ఏర్పాటు చేసిన పీయూసీఎల్ అండ్ డీఆర్ 1977లో పీయూసీఎల్, పీయూడీఆర్‌గా విడిపోయిన తర్వాత జాదవ్ పీయూసీఎల్‌లో ఉండిపోయాడు. కానీ, ఒక పౌరునిగా కాళోజివలె ప్రజల జీవించే, మాట్లాడే, సంఘం పెట్టుకునే, విశ్వాసాలు కలిగి ఉండే హక్కుల కోసం రాజ్యంతో రాజీ లేకుండా పోరాడే విషయంలో ఆయన పోరాటాల్లో ఉండే ఎవరితోనైనా కలిసి పనిచేశాడు. పీయూసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా కేశవరావ్ జాదవ్ కూడా ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు చేయాలని చాలా బలంగా ఆకాంక్షించేవాడు, కృషి చేశాడు. అందువల్లనే 2004 అక్టోబర్‌లో సీపీఐఎంఎల్ పీపుల్స్ వార్తో పాటు సీపీఐఎంఎల్ జనశక్తి కూడా చర్చలకు వచ్చినప్పుడు మధ్యవర్తులుగా వ్యవహరించినవారిలో జాదవ్ కూడా ఉన్నాడు. నేను 1989 ఏప్రిల్ నుంచి హైదరాబాద్‌లో స్థిరపడిన తర్వాత జాదవ్‌తో నాకు మాత్రమే కాదు నా కుటుంబానికి కూడా స్నేహం, ఆత్మీయత ఏర్పడినాయి. మేము ఎన్నో ఉద్యమాలు, ఎన్నో వేదికలు పంచుకున్నాము. తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని వివిధ దశల్లో బలపరుస్తూ ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం సాగిన సకల ఉద్యమాలకు సంఘీభావం తెలిపిన అరుదైన మేధావి కేశవరావ్ తెలంగాణ జ్ఞాపకాల్లో నిలిచి ఉంటారు. వరవరరావు వ్యాసకర్త విరసం సంస్థాపక సభ్యులు -
ప్రొ. కేశవరావు జాదవ్ అస్తమయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ తొలితరం నేత, సోషలిస్టు పార్టీ నాయకుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ (85) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయనను ఆరో గ్యం విషమించడంతో శుక్రవారం మధ్యా హ్నం బర్కత్‌పురలోని బ్రిస్టల్కోచ్ ఆస్పత్రి లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. మంత్రి నాయిని, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల నేతలు ఉస్మానియా వర్సిటీ ఎన్సీసీ గేట్ సమీపంలోని జాదవ్ నివాసంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.జాదవ్ నాన్ ముల్కీ గో బ్యాక్ నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టారని.. తాను నమ్మిన విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన రాజీలేని పోరాటయోధుడని కొనియాడారు. కాగా శనివారం సాయంత్రం అంబర్‌పేట శ్మశానవాటికలో ఆర్యసమాజ్ పద్ధతిలో కేశవరావు జాదవ్ అంత్యక్రియలు జరిగాయి. చిన్న కుమార్తె నివేదిత ఆయన చితికి నిప్పంటించారు. పోరాటమే ఆయన జీవితం.. కేశవరావు జాదవ్ 1933 జనవరి 27న జన్మించారు. మొదట్లో హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీఆలంలో ఉండేవారు. ఆయన తల్లిదండ్రులు అమృతాబాయి, శంకర్రావు జాదవ్. ఆయనకు భార్య ఇందిర, ముగ్గురు కుమార్తెలు సాధన, నీనా, నివేదిత ఉన్నారు. జాదవ్ పూర్వీకులు 200 ఏళ్ల క్రితమే కర్ణాటకలోని బీదర్ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఆ కుటుంబానికి చెందిన ఎంతోమంది యువకులు ‘హైదరాబాద్ నిజాం స్టేట్ ఆర్మీ’లో పనిచేశారు. జాదవ్ తండ్రి శంకర్రావు జాదవ్ ఒక ఫిలాసఫర్. ఉర్దూలో కథలు రాసేవారు. ఆ రోజుల్లోనే హుస్సేనీఆలం ప్రాంతంలో పిల్లలకు ఇంగ్లిష్ బోధించేవారు. ప్రింటింగ్ ప్రెస్ కూడా నడిపేవారు. ఇక కేశవరావు జాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ పూర్తి చేసి.. ఓ కాలేజీలో పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా చేరారు. అనంతరం సిద్దిపేట, వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో, హైదరాబాద్ సిటీ కాలేజీ, నిజాం కాలేజీ, సికింద్రాబాద్ పీజీ కాలేజీలలో ఇంగ్లిష్ అధ్యాపకుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని పోలీసు కేసులు, అరెస్టులు, జైలు జీవితాన్ని ఎదుర్కొన్నారు. విద్యార్థి దశలోనే ఉద్యమం.. కేశవరావు జాదవ్ సిటీ కాలేజీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న రోజుల్లోనే 1949–1950 ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు విద్యార్థుల ఆందోళనకు దారితీసింది. ఆ సమయంలో జాదవ్ సిటీ కాలేజీ హైస్కూల్ నుంచి ‘నాన్ ముల్కీ గో బ్యాక్’ఉద్యమాన్ని లేవనెత్తారు. తరగతులు బహిష్కరించి ప్రదర్శనలు చేశారు. ఆ ఆందోళన హైదరాబాద్ నగరమంతటా విస్తరించినా.. ప్రభుత్వం కఠినంగా అణచివేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత 1957లో మరోసారి నాన్ ముల్కీ ఉద్యమం మొదలైంది. హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్, ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. 1962 వరకు కొనసాగిన ఆ పోరాటంలో కేశవరావుజాదవ్ క్రియాశీల పాత్ర పోషించారు. ‘ప్రజా సమితి’ఉధృత పోరాటం.. 1966లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఉద్యమం మొదలైంది. కేశవరావుజాదవ్, మరికొందరు నాయకులు కలసి ‘క్విట్ కాలేజ్’కు పిలుపునివ్వడంతో.. విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలను బహిష్కరించి వీధుల్లోకి వచ్చారు. ఇదే సమయంలోనే తెలంగాణ కోసం ఒక రాజకీయ సంస్థను స్థాపించాలన్న లక్ష్యంతో ‘తెలంగాణ ప్రజా సమితి’ని ఏర్పాటు చేశారు. దానికి సత్యనారాయణరెడ్డి అధ్యక్షుడిగా, జాదవ్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రభుత్వ అణచివేతకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. చార్మినార్ నుంచి రాజ్‌భవన్ వరకు భారీ ఎత్తున ప్రదర్శన చేపట్టారు. ఆ ప్రదర్శనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోలీసులు కాల్పులు జరపడంతో.. 30 మందికిపైగా అమరులయ్యారు. ఆ సమయంలోనే జాదవ్‌ను మీసా చట్టం కింద అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అలా తెలంగాణ ఉద్యమంలో 8 సార్లు జైలు జీవితం గడిపారు. మలిదశ తెలంగాణ పోరాటంలోనూ పాల్గొన్నారు. తెలంగాణ ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. అన్ని సంఘాలు, పార్టీలతో తెలంగాణ ఐక్య కార్యాచరణకు పిలుపునిచ్చారు. విభిన్న సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్ నగరాన్ని జాదవ్ ఎంతో ప్రేమించారు. ఎన్ని భాషలు, మతాలు, సంస్కృతులున్నా హైదరాబాద్ ఒక్కటేనన్న నినాదంతో ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపారు. జాదవ్ లేని లోటు తీరనిది: కేసీఆర్ తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ మృతి తీరని లోటని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం ఆయన ఎంతో పోరాడారని గుర్తు చేసుకున్నారు. జాదవ్ మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖుల సంతాపం కేశవరావు జాదవ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ సమీపంలోని సురభి ఎన్‌క్లేవ్‌లోని జాదవ్ నివాసానికి వెళ్లి.. ఆయన మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. కేశవరావు జాదవ్ మృతి పట్ల మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ బండారు దత్తాత్రేయ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎస్.జైపాల్‌రెడ్డి, ఉత్తమ్, జానారెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, వరవరరావు, గద్దర్, విమలక్క, తదితరులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర వహించారని.. రాష్ట్రం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు. జాదవ్ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. -
చెరిగిపోని ఉద్యమ స్ఫూర్తి జాదవ్
తాను పుట్టి పెరిగిన ప్రాంతంనుంచే హైదరాబాద్ నగర స్వరూప స్వభావాలను అర్ధం చేసుకున్న కేశవరావు జాదవ్, ఆత్రాఫ్ బల్దా’ అనే హైదరాబాద్‌లో సంపన్నులూ, దానిచుట్టూ కులీనులకు పని చేసే సేవకులు అంటూ విశ్లేషించాడు. అందుకే దీపం చుట్టూ చీకటి లాగా నగరం చుట్టూ వెనుకబడ్డ ప్రాంతాలంటూ ఆత్రాఫ్ బల్దాకు సరైన నిర్వచనమిచ్చాడు. రాచరికంలో గీతగీసినట్టే రంగారెడ్డి జిల్లా హైదరాబాదు చుట్టూ వలయంలో ఏర్పడ్డది. ఈ ప్రాంతాలను వెనుకబడేయడం ద్వారానే నగరాల్లోని పెట్టుబడికి, శ్రమను అమ్ముకునే చీప్ లేబర్ దొరుకుతుందన్నారు. తెలుగుగడ్డ మీద తెలంగాణ ఖ్యాతిని చాటుతూ రాష్ట్ర సాధనోద్యమానికే కాకుండా గాకుండా, తెలంగాణ పోరాట కీర్తికి వన్నెలద్దిన వాళ్లలో ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ (86) ఒకరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘‘తన తండ్రి శంకరరావు జాదవ్ హైదరాబాదీ, తాను మిస్టర్ తెలంగాణ’’ అంటూ సగర్వంగా చాటిన పలుకులు పవిత్ర రంజాన్ నాడే శాశ్వతంగా మూగబోయాయి. 1933 జనవరి 27న శంకరరావు – అమృతరావు దంపతులకు జన్మించిన జాదవ్ ఇక లేడనే వార్త ఎంతో బాధ కల్గిస్తుంది. హక్కుల ఉద్యమం నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం వరకు మూడు దశాబ్దాల అనుబంధం ఉన్నప్పటికీ అనారోగ్య కారణాల రీత్యా ఈ ఏడాది సార్‌కు జన్మదిన శుభా కాంక్షలు చెప్పలేకపోయాను. కానీ ఇదే అతని చివరి జన్మదిన అవుతుందని ఊహించ లేదు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెల్సిన కుటుంబ సభ్యుల జాగ్రత్తల మూలంగా బిస్టిన్కోన్ (బర్కత్‌పురా) ఆసుపత్రి సార్ చివరి మజిలీ అయిపోయింది. చివరిసారిగా అక్కడైనా సార్‌ను సజీవంగా చూడలేకపోయినందుకు చింతిస్తున్నాను. జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, మదుసూదన్ రాజ్ యాదవ్, సిరిల్‌రెడ్డి, కూర రాజన్న, గద్దర్ లాంటి ఎంతో మందికి ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజిలో ఆంగ్లం బోధించిన సార్ వేలాదిమంది యువతను ప్రభావితం చేశారు. 2004లో రాష్ట్ర ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య జరిగిన చర్చల్లో పాల్గోన్న మధ్యవర్తుల కమిటీలో ఈయన సభ్యుడు 2009 జులైలో నేను చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి విదుదలై, ఖైదీల మధ్య సమస్యలపై నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డిని కలువడానికి వెళ్ళినప్పుడు చుక్కారామయ్యతో పాటు నా వెంట వచ్చారు. గాంధీ హాస్పిటల్ లోని 50 పడకల జైలు వార్డును ఫంక్షన్ చేయించడంలో సహకరించాడు. అందుకే 2016 జనవరి 27న మిస్టర్ తెలంగాణ అంటూ సార్ గురించి రాసిన వ్యాసపు శీర్షికతోనే ఆయన్ని అంతిమంగా స్మరించుకోవాల్సి వస్తోంది. కానీ మిస్టర్ తెలంగాణలో విశ్రాంత ఆచార్యులు, ఉద్యమ నాయకులైన కేశవరావ్ జాదవ్ పేరు ఎన్నటికి మాసిపోదు. వారి ఉద్యమ స్ఫూర్తి పోరాట Mీ ర్తి భావిత తరాలను మేలుకొల్పుతూనే ఉంటుంది. కులీన వర్గాలకు ఆలవాలమైన హైదరాబాద్ పాతబస్తీలో హుస్సేని ఆలంలో జాదవ్ సార్ జన్మించారు. అందుకే ఆయన సంపన్నుల ఆ డంబరాలను, వారికి సేవ చేసే సామాన్యుల అగ చాట్లను ఏకకాలంలో చూడగలిగారు. వ్యవహారి కంలో, పరిపాలనలో ఉర్దూను ఒంటబట్టించుకున్న తండ్రి ఇంగ్లీష్‌ను ప్రత్యేకంగా బోధించారు. ఈ భాషా పరిజ్ఞానం అతన్ని మార్క్సిస్టుగా తీర్చిదిద్దితే, రామ్ మనోహర్ లోహియా ప్రభావం అతడిని సోషలిస్టుగా మార్చింది. 1946 నుంచి 1951 నవంబర్ వరకు సాగిన చారిత్రక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో ప్రభావం చెందిన బాలుడిగా కేశవరావు జాదవ్ ఉద్యమ జీవితం ప్రారంభమైంది. ఈ చైతన్యపూరిత కార్యక్రమాలను నిలువరించ డానికి రజాకార్లు తనను చితగ్గొట్టి గటార్లో (మురికికాల్వలో) పడేశారని సార్ చెప్పుకొచ్చాడు. తాను పుట్టి పెరిగిన ప్రాంతంనుంచే హైదరాబాద్ నగర స్వరూప స్వభావాలను అర్ధం చేసుకున్న సార్, ఆత్రాఫ్ బల్దా’ అనే హైదరాబాద్‌లో సంపన్నులూ, దానిచుట్టూ కులీనులకు పని చేసే సేవకులు అంటూ శాస్త్రీయంగా విశ్లేషించాడు. అందుకే దీపం చుట్టూ చీకటì లాగా నగరం చుట్టూ వెనుకబడ్డ ప్రాంతాలంటూ ఆత్రాఫ్ బల్దాకు సరైన ని ర్వచనమిచ్చాడు. రాచరికంలో గీతగీసినట్టే రంగారెడ్డి జిల్లా హైదరాబాదు చుట్టూ వల యంలో ఏర్పడ్డది. ఈ ప్రాంతాలను వెనుకబడేయడం ద్వారానే నగరాల్లోని పెట్టుబడికి, శ్రమను అమ్ముకునే చీప్ లేబర్ దొరుకుతుంది. అందుకే ఆయన జీవితమంతా సంపన్న బస్తీలో నిరుపేదల కోసం దేవులాడుతూ సాగింది. ఉస్మానియాలో ఆంగ్లానికి బదులు మాతృభాషలో ప్రవేశ çపరీక్షలుండేలా చేయడంలో తద్వారా దాన్ని ఉద్యమ కేంద్రంగా మలచడంలో సార్ పాత్ర దండలో దారంలా అల్లుకొని ఉంది. ఉస్మానియా విశ్వవిద్యా లయానికి 4 వేల ఎకరాల స్థలమిచ్చిన మహలఖాబాయి చందా చరిత్రకు గానీ, భాషతో బడుగులకు ఉస్మానియాలో ప్రవేశం కల్పించిన జాదవ్ సార్‌కు గానీ నూరేళ్ళ ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉత్సవాలు సరైన ప్రాధాన్యత కల్పించలేదు. తెలంగాణలో చరిత్రను కోటిలింగాలకు పూర్వపు బోదన్ జనపదం నుంచి అద్యయనం చేస్తున్న కాలమిది. దక్షిణాదిలోనే బలమైన సామ్రాజ్యానికి పునాదులేసిన కాకతీయ రాజులకే కరువులో కప్పం కట్టలేమన్న ఆదివాసీ వీరనారీమణులైన సమ్మక్క సారలమ్మల పోరాట చరిత్ర మనం విన్నదే. కాకతీయుల చివరి రాజు ్రçపతాపరుద్రున్ని ఢిల్లీ సుల్తానులు బందీగా తీసుకుపోతున్నప్పుడు (1330) సోమోద్బవ దగ్గర నర్మదానదిలో దూకి ఆ త్మార్పణ చేసుకున్నాడు. దీనిని 1423 లోని కలువచెరువు శాసనం ‘‘దైవ నిర్ణయాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణత్యాగం చేసిన వాడిగా’’ అభివర్ణించింది. తెలంగాణలో ఆత్మగౌరవ అంశాన్ని ఇక్కడినుంచే లెక్కంచాలని సార్ పేర్కొంటూ ఉండేవారు. 1952 ముల్కి ఉద్యమంలో నిజాం కాలేజి విద్యార్ధిగా పాల్గొంటూ వచ్చాడు. 1968 డిసెంబర్లో తెలంగాణ కోల్పోయిన 30,000 ఉద్యోగాల నుండి ప్రారంభమైన ఉద్యమం 1969 మేలో రాజ్‌భవన్ వరకు ర్యాలిగా పిలుపునిచ్చింది. 369 ప్రాణాలను అర్పిస్తూ సాగిన ఈ ఉద్యమాన్ని అంచనావేయడానికి జూన్ 4, 1969న హైదరాబాదు వచ్చిన ప్రధాని ఇందిరాగాంధీని నిలదీసిన నాయకుడిగా జాదవ్ సార్‌కి పేరుంది. తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటులో డాక్టర్ గోపాలకృష్ణతో కలిసి కీలకపాత్ర పోషించినా, అది ఉద్యమానికి చేసిన ద్రోహాన్ని వ్యతిరేకించారు కానీ చివరివరకు ఉద్యమ సంస్థల్లోనే ఉండిపోయారు. 1990లలో నిర్మాణమైన తెలంగాణ ఐక్యవేదిక ద్వారా నిజమైన జాక్ అవగాహనకు ప్రాణప్రతిష్ట చేశాడు. ఉద్యమ శక్తులతో నిండిన ఈ వేదికలో కోదండరాం తర్వాత చేరారు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్‌గా, గౌరవాధ్యక్షుడిగా నవ తెలంగాణకై కలగంటూ చివరిశ్వాస వదిలారు. 1989లో తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ప్రారంభమై 1996లో ఏర్పాటైన వర్కర్స్ కాన్ఫరెన్సులో భాగమై బూటకపు ఎన్కౌంటర్లను ఖండిచారు. తెలంగాణ జనపరిషత్ అధ్యక్షుడిగా ఉన్నారు. మ్యాన్ కైండ్ అనే బహుభాషా పత్రిక సంపాదకుడిగా, కులనిర్మూలనా పోరాటానికి ద్వేషం ప్రాతిపదిక కారాదు అనే పుస్తక రచయితగా, ముస్లిం రిజర్వేషన్ల కోసం, సామాజిక న్యాయం కోసం పరితపించిన వ్యక్తిగా సమసమాజ భావుకుడిగా జాదవ్ సార్ మన కందించిన కర్తవ్యాలను తుదికంటా కొనసాగిద్దాం. అదే సార్‌కి నిజమైన నివాళి కాగలదు. అమర్ వ్యాసకర్త జనశక్తి నాయకులు -
జాదవ్ భౌతికకాయానికి కోదండరాం నివాళులు
-
ఉద్యమ నేత ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ కన్నుమూత
-
ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. నగరంలోని హుస్సేని ఆలంలో 1933 జనవరి 27న జాదవ్ జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటం, ముల్కీ ఉద్యమం, జై తెలంగాణ పోరాటంలో కేశవరావ్ జాదవ్ చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలోనూ జేఏసీ ద్వారా జయశంకర్, కోదండరామ్‌తో కలిసి కేశవరావు జాదవ్ పనిచేశారు. ఆయన పౌరహక్కుల సంఘం అధ్యక్షునిగా, తెలంగాణ జనపరిషత్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సోషలిస్టు నాయకుడు లోహియా అనుచరుడిగా జాదవ్‌కు గుర్తింపు ఉంది. కాగా, జాదవ్ భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి శివం రోడ్డులోని ఆయన ఇంటికి తరలించారు. పార్ధీవ దేహానికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌తో పాటు పలువురు నివాళులర్పించారు. (కేశవరావు జాదవ్ బౌతిక కాయం వద్ద కోదండరాం) ప్రముఖుల సంతాపం ప్రొఫెసర్ కేశవ రావు జాదవ్ మృతి పట్ల ప్రతిపక్ష నేత జానారెడ్డి సంతాపం ప్రకటించారు. ఒక గొప్ప వ్యక్తిని రాష్ట్రం కోల్పోయిందని, వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతిని చేకూరాలని ఆకాంక్షించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో జాదవ్ కీలకమైన పాత్ర వహించారన్నారు. సమాజ సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేశారన్నారు.