ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ (పాత చిత్రం)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. నగరంలోని హుస్సేని ఆలంలో 1933 జనవరి 27న జాదవ్ జన్మించారు.
తెలంగాణ సాయుధ పోరాటం, ముల్కీ ఉద్యమం, జై తెలంగాణ పోరాటంలో కేశవరావ్ జాదవ్ చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలోనూ జేఏసీ ద్వారా జయశంకర్, కోదండరామ్‌తో కలిసి కేశవరావు జాదవ్ పనిచేశారు. ఆయన పౌరహక్కుల సంఘం అధ్యక్షునిగా, తెలంగాణ జనపరిషత్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సోషలిస్టు నాయకుడు లోహియా అనుచరుడిగా జాదవ్‌కు గుర్తింపు ఉంది.
కాగా, జాదవ్ భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి శివం రోడ్డులోని ఆయన ఇంటికి తరలించారు. పార్ధీవ దేహానికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌తో పాటు పలువురు నివాళులర్పించారు.
(కేశవరావు జాదవ్ బౌతిక కాయం వద్ద కోదండరాం)
ప్రముఖుల సంతాపం
ప్రొఫెసర్ కేశవ రావు జాదవ్ మృతి పట్ల ప్రతిపక్ష నేత జానారెడ్డి సంతాపం ప్రకటించారు. ఒక గొప్ప వ్యక్తిని రాష్ట్రం కోల్పోయిందని, వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతిని చేకూరాలని ఆకాంక్షించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో జాదవ్ కీలకమైన పాత్ర వహించారన్నారు. సమాజ సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment