ప్రొఫెసర్ కేశవరావు జాదవ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ తొలితరం నేత, సోషలిస్టు పార్టీ నాయకుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ (85) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయనను ఆరో గ్యం విషమించడంతో శుక్రవారం మధ్యా హ్నం బర్కత్‌పురలోని బ్రిస్టల్‌కోచ్ ఆస్పత్రి లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. మంత్రి నాయిని, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల నేతలు ఉస్మానియా వర్సిటీ ఎన్‌సీసీ గేట్ సమీపంలోని జాదవ్ నివాసంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.జాదవ్ నాన్ ముల్కీ గో బ్యాక్ నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టారని.. తాను నమ్మిన విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన రాజీలేని పోరాటయోధుడని కొనియాడారు. కాగా శనివారం సాయంత్రం అంబర్‌పేట శ్మశానవాటికలో ఆర్యసమాజ్ పద్ధతిలో కేశవరావు జాదవ్ అంత్యక్రియలు జరిగాయి. చిన్న కుమార్తె నివేదిత ఆయన చితికి నిప్పంటించారు.
పోరాటమే ఆయన జీవితం..
కేశవరావు జాదవ్ 1933 జనవరి 27న జన్మించారు. మొదట్లో హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీఆలంలో ఉండేవారు. ఆయన తల్లిదండ్రులు అమృతాబాయి, శంకర్‌రావు జాదవ్. ఆయనకు భార్య ఇందిర, ముగ్గురు కుమార్తెలు సాధన, నీనా, నివేదిత ఉన్నారు. జాదవ్ పూర్వీకులు 200 ఏళ్ల క్రితమే కర్ణాటకలోని బీదర్ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఆ కుటుంబానికి చెందిన ఎంతోమంది యువకులు ‘హైదరాబాద్ నిజాం స్టేట్ ఆర్మీ’లో పనిచేశారు. జాదవ్ తండ్రి శంకర్‌రావు జాదవ్ ఒక ఫిలాసఫర్. ఉర్దూలో కథలు రాసేవారు. ఆ రోజుల్లోనే హుస్సేనీఆలం ప్రాంతంలో పిల్లలకు ఇంగ్లిష్ బోధించేవారు. ప్రింటింగ్ ప్రెస్ కూడా నడిపేవారు. ఇక కేశవరావు జాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ పూర్తి చేసి.. ఓ కాలేజీలో పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా చేరారు. అనంతరం సిద్దిపేట, వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో, హైదరాబాద్ సిటీ కాలేజీ, నిజాం కాలేజీ, సికింద్రాబాద్ పీజీ కాలేజీలలో ఇంగ్లిష్ అధ్యాపకుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని పోలీసు కేసులు, అరెస్టులు, జైలు జీవితాన్ని ఎదుర్కొన్నారు.
విద్యార్థి దశలోనే ఉద్యమం..
కేశవరావు జాదవ్ సిటీ కాలేజీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న రోజుల్లోనే 1949–1950 ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు విద్యార్థుల ఆందోళనకు దారితీసింది. ఆ సమయంలో జాదవ్ సిటీ కాలేజీ హైస్కూల్ నుంచి ‘నాన్ ముల్కీ గో బ్యాక్’ఉద్యమాన్ని లేవనెత్తారు. తరగతులు బహిష్కరించి ప్రదర్శనలు చేశారు. ఆ ఆందోళన హైదరాబాద్ నగరమంతటా విస్తరించినా.. ప్రభుత్వం కఠినంగా అణచివేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత 1957లో మరోసారి నాన్ ముల్కీ ఉద్యమం మొదలైంది. హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్, ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్‌లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. 1962 వరకు కొనసాగిన ఆ పోరాటంలో కేశవరావుజాదవ్ క్రియాశీల పాత్ర పోషించారు.
‘ప్రజా సమితి’ఉధృత పోరాటం..
1966లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఉద్యమం మొదలైంది. కేశవరావుజాదవ్, మరికొందరు నాయకులు కలసి ‘క్విట్ కాలేజ్’కు పిలుపునివ్వడంతో.. విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలను బహిష్కరించి వీధుల్లోకి వచ్చారు. ఇదే సమయంలోనే తెలంగాణ కోసం ఒక రాజకీయ సంస్థను స్థాపించాలన్న లక్ష్యంతో ‘తెలంగాణ ప్రజా సమితి’ని ఏర్పాటు చేశారు. దానికి సత్యనారాయణరెడ్డి అధ్యక్షుడిగా, జాదవ్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రభుత్వ అణచివేతకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. చార్మినార్ నుంచి రాజ్‌భవన్ వరకు భారీ ఎత్తున ప్రదర్శన చేపట్టారు. ఆ ప్రదర్శనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోలీసులు కాల్పులు జరపడంతో.. 30 మందికిపైగా అమరులయ్యారు. ఆ సమయంలోనే జాదవ్‌ను మీసా చట్టం కింద అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అలా తెలంగాణ ఉద్యమంలో 8 సార్లు జైలు జీవితం గడిపారు. మలిదశ తెలంగాణ పోరాటంలోనూ పాల్గొన్నారు. తెలంగాణ ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. అన్ని సంఘాలు, పార్టీలతో తెలంగాణ ఐక్య కార్యాచరణకు పిలుపునిచ్చారు. విభిన్న సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్ నగరాన్ని జాదవ్ ఎంతో ప్రేమించారు. ఎన్ని భాషలు, మతాలు, సంస్కృతులున్నా హైదరాబాద్ ఒక్కటేనన్న నినాదంతో ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపారు.
జాదవ్ లేని లోటు తీరనిది: కేసీఆర్
తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ మృతి తీరని లోటని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం ఆయన ఎంతో పోరాడారని గుర్తు చేసుకున్నారు. జాదవ్ మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రముఖుల సంతాపం
కేశవరావు జాదవ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్‌సీసీ గేట్ సమీపంలోని సురభి ఎన్‌క్లేవ్‌లోని జాదవ్ నివాసానికి వెళ్లి.. ఆయన మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. కేశవరావు జాదవ్ మృతి పట్ల మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ బండారు దత్తాత్రేయ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎస్.జైపాల్‌రెడ్డి, ఉత్తమ్, జానారెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, వరవరరావు, గద్దర్, విమలక్క, తదితరులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర వహించారని.. రాష్ట్రం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు. జాదవ్ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment