
హైదరాబాద్: అడవిపై ఆదివాసులకు చట్టపరమైన హక్కులున్నా అడవి నుంచి వెళ్లగొట్టేందుకు పాలకులు కుట్ర చేస్తున్నారని విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం.ఎల్) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్ భవనంలో రాష్ట్ర సదస్సు జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూతం.వీరన్న అధ్యక్షతన జరిగిన సదస్సులో వరవరరావు మాట్లాడుతూ ఓపెన్‌కాస్టులు, గనుల పేరుతో బహుళజాతి, కార్పొరేట్ సంస్థలకు పేదల పంట, అటవీ భూములను కట్టబెట్టుతూ అదివాసీ జీవితాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజలకు మంచిరోజులు తెస్తామంటూ నమ్మించి గద్దెనెక్కిన మోదీ, కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో ప్రజలకు చెడ్డరోజులే మిగిల్చారని అన్నారు. ప్రజాఉద్యమాలు, ప్రజాస్వామిక హక్కులను నిరంకుశత్వంతో అణచివేస్తూ ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ కోట్ల రూపాయల కార్పొరేట్ కంపెనీల అప్పులను రద్దు చేస్తున్న పాలకులు రైతులచేతికి బేడీలు వేస్తున్నారని, జైలు పాలు చేస్తున్నారని, ఇదేమి న్యాయమని ప్రశ్నించారు.
భూతం వీరన్న మాట్లాడుతూ బయ్యారం ఉక్కు తెలంగాణ ఆదివాసుల హక్కు అని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాలమల్లేశ్, సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ నాయకురాలు రమ, ఎంసీపీఐ(యు) నాయకులు ఉపేందర్‌రెడ్డి, నాయకులు రాజేశ్, సత్తార్, సోమిశేట్టి దశర«థ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment