సాక్షి, అమరావతి : విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరావును విడిపించాలని కోరుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ రాయడం తన వ్యక్తిగత నిర్ణయం అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ముడిపెడుతూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దియోధర్ ట్వీట్ చేయడం బాధాకరం అన్నారు. దేశ ప్రధానమంత్రిని హతమార్చాలనే కుట్ర పన్ని అరెస్టయిన విరసం నేత వరవరరావును విడుదల చెయ్యాలని భూమన కోరడం సమంజసం కాదని సునీల్ దియోధర్ ట్వీట్ చేశారు. దానికి సమాధానంగా సునీల్ దియోధర్‌కు భూమన ఆదివారం లేఖ రాశారు.
‘ప్రధాని మోదీ పట్ల నాకు అపార గౌరవం, ప్రేమ ఉంది. నేను లేఖలో కోరింది అనారోగ్యంతో బాధపడుతున్న 81 ఏళ్ల వరవరావు పట్ల జాలి చూపించమని, అంతే కానీ వరవరరావు భావాజాలాన్ని అంగీకరించి కాదు. భారతదేశపు సనాతన ధర్మాన్ని, విలువలను గౌరవిస్తా. హింసా మార్గాన్ని ఏ మాత్రం సమర్థించను. నా వ్యక్తిగత అభిప్రాయానికి సీఎం జగన్‌తో మీరు ముడిపెడుతూ ట్వీట్ చేయడం బాధాకరం. శత్రువును చంపడం కాదు.. క్షమించడం పెద్ద శిక్ష అని నమ్ముతా’అని లేఖలో భూమన పేర్కొన్నారు.
కాగా, భీమా కోరేగావ్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి, విరసం నేత వరవరరావును ఎన్‌ఐఏ అరెస్ట్ చేసి తలోజా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావు (వీవీ)ను విడుదల చేయాలని కోరుతూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కొన్ని రోజుల క్రితం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. అయితే ఆ లేఖ తన వ్యక్తిగత నిర్ణయం అని, దానిలో పార్టీకి సంబంధం లేదని భూమన అప్పుడే స్పష్టం చేశారు. అయితే దీనిపై మళ్లీ విమర్శలు రావడంతో భూమన వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment