ధర్నాచౌక్‌ను కొనసాగించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజల సమస్యలపై నిరసన వ్యక్తంచేయడానికి కూడా అవకాశం లేకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అఖిలపక్ష నేతలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు గురువారం గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ దగ్గర ధర్నా చేస్తామని సాక్షాత్తూ శాసనమండలిలోనే చెప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాష్ట్రంలో మాత్రం ఇందిరాపార్కు దగ్గర ధర్నాచౌక్ లేకుండా చేయాలని నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని వారు గవర్నర్‌కు విన్నవించారు.
ఈ బృందంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి (టీపీసీసీ అధ్యక్షుడు), కె.లక్ష్మణ్ (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు), ఎల్.రమణ (టీటీడీపీ అధ్యక్షుడు), చాడ వెంకటరెడ్డి (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి), నాగయ్య(సీపీఎం), కె.శివకుమార్ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), ఆర్.కృష్ణయ్య(ఎమ్మెల్యే), మంద కృష్ణమాదిగ (ఎంఆర్‌పీఎస్), గోపాలశర్మ,, ఇటిక్యాల పురుషోత్తం (తెలంగాణ జేఏసీ), వెంకటేశ్వర్‌రావు (న్యూ డెమొక్రసీ), టి.కుమార్ (ఎంసీపీఐ– యూ), జానకి రాములు (ఆర్‌ఎస్‌పీ), బండా సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్) తదితరులు ఉన్నారు.
ప్రజా సమస్యలపై నిరసన తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగ పరిరక్షకునిగా గవర్నరుపై ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంకోసం ఇందిరాపార్కు దగ్గర వందలకొద్ది సభలు, సమావేశాలు, నిరసన దీక్షలు జరిగాయని అఖిలపక్షం నేతలు గవర్నర్‌కు వివరించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్నదనే కుంటి సాకుతో ధర్నాచౌక్‌ను ఇందిరా పార్కువద్ద లేకుండా చేయాలని ప్రభుత్వం ప్రయ త్నిస్తున్నదన్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బేగంపేటలోని క్యాంపు కార్యాల యానికి వేలమందిని తరలించారని, దానికి ట్రాఫిక్ అంతరాయం కలుగలేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించాచు. రాష్ట్రంలో 25 ఏళ్లుగా జరిగిన నిరసనలకు సంబంధించిన ఫోటోలను, క్లిప్పింగులను మంద కృష్ణ మాదిగ గవర్నర్‌కు చూపించారు. ధర్నాచౌక్‌ను తరలించవద్దని, శాంతియు తంగా జరిగే నిరసనలకు అవకాశం కల్పించాలని కోరారు.