
‘ధర్నా చౌక్’పై నిర్ణయాన్ని ఉపసంహరించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లెక్కలేనన్ని ఉద్యమాలకు వేదికైన హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్దనున్న ధర్నా చౌక్ కోసం స్వరాష్ట్రంలో పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అభిప్రాయపడ్డారు. తాము కేవలం ధర్నా చౌక్ స్థలం కోసం ఉద్యమించడం లేదని, బాధిత ప్రజలు తెలిపే నిరసన హక్కు కోసం ఉద్యమిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ధర్నా చౌక్‌ను ఎత్తివేసే నిర్ణయం వాపసు తీసుకోవాలంటూ కోదండరాం నేతృత్వంలో అఖిలపక్షం నేతలు గురువారం డీజీపీ అనురాగ్ శర్మను కలసి విన్నవించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జేఏసీ చేపట్టిన ఏ కార్యక్రమమూ విఫలం కాలేదని, ధర్నా చౌక్ విషయంలోనూ ప్రజలను చైతన్యవంతులను చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వివిధ వర్గాల ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాలను నిరసనలుగా వ్యక్తపరిచే హక్కు ఇన్నాళ్లూ ధర్నా చౌక్ వద్దే సాగిందని, భవిష్యత్తులోనూ అక్కడే కొనసాగాలని తాము పోరాటం చేస్తున్నామన్నారు. ఈ విషయం ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఉద్యమించాల్సిన దుస్థితి ఏర్పడిందని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా చౌక్‌ను కొనసాగించాలని డీజీపీని కోరామని, ఈ నెల 15లోగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు.
లేకుంటే చలో ధర్నా చౌక్ చేపడతామని, లాఠీ దెబ్బలు, పోలీసు తూటాలకు భయపడే ప్రసక్తే లేదని కోదండరాం తేల్చిచెప్పారు. ధర్నా చౌక్ పరిరక్షణలో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు గన్‌పార్క్ వద్ద ఆందోళన నిర్వహిస్తామని, దీనికి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జరిపితీరుతామని ఆయన స్పష్టం చేశారు. అఖిలపక్షంలో మాజీ మంత్రి, టీడీపీ నేత బోడ జనార్దన్, కాంగ్రెస్ నేతలు బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్, సీపీఐ నేత మల్లెపల్లి ఆదిరెడ్డి, సీపీఎం తరఫున నర్సింహారావు, జేఏసీ కో కన్వీనర్ బైరి రమేష్, కో చైర్మన్ పురుషోత్తం, పీఓడబ్ల్యూ సం«ధ్య, ప్రజాఫ్రంట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.