JAC Chairman Kodandaram
-
కోదండరాంను తయారుచేసిందే నేను
-
కోదండరాంను తయారుచేసిందే నేను..
హైదరాబాద్ : రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన టీజేఏసీ చైర్మన్ కోదండరాంను అసలు తయారుచేసిందే నేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాజకీయ జీవితంలో వేలు, లక్షల మంది కార్యకర్తలను తయారుచేశానని, అందులో ఒకడు కోదండరామని గుర్తుచేశారు. శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం మీడియాతో మాట్లాడారు. ‘కోదండరాం కనీసం సర్పంచ్‌గానైనా గెలిసిండా? ఆయన జేఏసీనా? ఆయన చేసింది అమరవీరుల ఆత్మగౌరవ యాత్రనా? లేక లంగల రాజకీయ యాత్రనా? కోదండరాం ముమ్మాటికీ టీఆర్ఎస్ వ్యతిరేకి. దొంగతనంగా వెళ్లి ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులను కలిశాడు. ఆయన్ని మాటలువిని కాంగ్రెస్ నాశనమైంది. నేను తయారుచేసిన లక్షల మంది కార్యకర్తల్లో కోదండరాం ఒకడు. నీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే శ్రీకాంతచారి తల్లికి మద్దతు ఎందుకు ఇయ్యలేదు? ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఇస్తనని ఎప్పుడో చెప్పిన. ఇలాంటి వ్యక్తులను ప్రజలు విశ్వసించొద్దు’ అని కేసీఆర్ అన్నారు. తమ ప్రభుత్వం మైనారిటీలు, జర్నలిస్టులు, న్యాయవాదులు సహా మేం ఎవ్వరినీ నిర్లక్ష్యం చేయబోదని, దశలవారీగా నిరుద్యోగులకు న్యాయం చేస్తాం. తెలంగాణ ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. కొద్ది రోజుల కిందటే కోదండరాంను ఉద్దేశించి ‘ఎవరాయన? తాడు, బొంగరం లేనోడు’ అని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి నేటి పత్రికా సమావేశంలో కోదండను కాంగ్రెస్ వ్యర్తిగా పేర్కొంటూ, విమర్శలదాడిని ఉధృతం చేశారు. -
కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కోదండరామ్
-
కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కోదండరామ్
మండిపడిన ఎమ్మెల్సీ కర్నె, ఎమ్మెల్యే కూసుకుంట్ల సాక్షి , హైదరాబాద్: ప్రభుత్వం ఏ పనిచేసినా గుడ్డిగా వ్యతిరేకించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని, టీఆర్ఎస్ గెలిచిన మరుసటి రోజు నుంచే విమర్శలు మొదలుపెట్టిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. జేఏసీ చైర్మన్ కోదండరామ్ కూడా ఇపుడు కాంగ్రెస్ బాటలోనే నడుస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. ఒక ఎజెండా పెట్టుకుని కోదండరాం పనిచేస్తున్నారని, పేరుకు వేదిక వేరే అయినా, ఫక్తు కాంగ్రెస్ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. నార్లపూర్ నుంచి డిండికి నీళ్లు తీసుకుపోవద్దని ఆయన కొత్త పల్లవి అందుకున్నాడని, ఫ్లోరోసిస్ కేంద్రంగా ఉన్న నల్లగొండ జిల్లా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు నీళ్లు తీసుకుపోవద్దని కోదండరాం చెప్పటం సరికాదని అన్నారు. ఇలాంటి ప్రాంతంపై సానుభూతి లేకుండా మాట్లాడుతున్నాడని, ఆయన ప్రజలపక్షం కాదని తేలిపోయిందన్నారు. కోదండరాం గాంధీభవన్‌లో కూర్చుని మాట్లాడితే తమకేమీ అభ్యంతరం లేదని వారు అన్నారు. -
ఆ కుటుంబానికే అధికారం పరిమితం
జేఏసీ చైర్మన్ కోదండరాం ఆరోపణ నర్సాపూర్/మెదక్‌జోన్: రాష్ట్రంలో ఆ ఒక్క కుటుంబానికే అధికా రం పరిమితమైందని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన అమరుల స్ఫూర్తియాత్ర మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం కోదండరాం విలేకరులతో మాట్లా డారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగానే యాత్ర చేపట్టామన్నారు. రాష్ట్రంలో అధికారం నలుగురి చేతుల్లోనే కేంద్రీకృతమైందని సీఎం కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మిగిలిన మంత్రులంతా నామమాత్రంగా మిగిలారన్నారు. అధికారం చెలాయిస్తున్నవారు కాంట్రాక్టర్లకు, భూ ఆక్రమణదారులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఉద్యమ సమయంలో ప్రజలు కోరుకున్న ఆకాంక్షలను నెరవేర్చాలన్న సోయి కూడా లేదన్నా రు. తెలంగాణ వనరులు ఇక్కడి ప్రజలకు చెందాలని, ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన సాగాలని అందరూ కోరుకుంటుంటే, అలా సాగడం లేదన్నారు. -
‘ధర్నా చౌక్’పై నిర్ణయాన్ని ఉపసంహరించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లెక్కలేనన్ని ఉద్యమాలకు వేదికైన హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్దనున్న ధర్నా చౌక్ కోసం స్వరాష్ట్రంలో పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అభిప్రాయపడ్డారు. తాము కేవలం ధర్నా చౌక్ స్థలం కోసం ఉద్యమించడం లేదని, బాధిత ప్రజలు తెలిపే నిరసన హక్కు కోసం ఉద్యమిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ధర్నా చౌక్‌ను ఎత్తివేసే నిర్ణయం వాపసు తీసుకోవాలంటూ కోదండరాం నేతృత్వంలో అఖిలపక్షం నేతలు గురువారం డీజీపీ అనురాగ్ శర్మను కలసి విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జేఏసీ చేపట్టిన ఏ కార్యక్రమమూ విఫలం కాలేదని, ధర్నా చౌక్ విషయంలోనూ ప్రజలను చైతన్యవంతులను చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వివిధ వర్గాల ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాలను నిరసనలుగా వ్యక్తపరిచే హక్కు ఇన్నాళ్లూ ధర్నా చౌక్ వద్దే సాగిందని, భవిష్యత్తులోనూ అక్కడే కొనసాగాలని తాము పోరాటం చేస్తున్నామన్నారు. ఈ విషయం ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఉద్యమించాల్సిన దుస్థితి ఏర్పడిందని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా చౌక్‌ను కొనసాగించాలని డీజీపీని కోరామని, ఈ నెల 15లోగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. లేకుంటే చలో ధర్నా చౌక్ చేపడతామని, లాఠీ దెబ్బలు, పోలీసు తూటాలకు భయపడే ప్రసక్తే లేదని కోదండరాం తేల్చిచెప్పారు. ధర్నా చౌక్ పరిరక్షణలో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు గన్‌పార్క్ వద్ద ఆందోళన నిర్వహిస్తామని, దీనికి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జరిపితీరుతామని ఆయన స్పష్టం చేశారు. అఖిలపక్షంలో మాజీ మంత్రి, టీడీపీ నేత బోడ జనార్దన్, కాంగ్రెస్ నేతలు బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్, సీపీఐ నేత మల్లెపల్లి ఆదిరెడ్డి, సీపీఎం తరఫున నర్సింహారావు, జేఏసీ కో కన్వీనర్ బైరి రమేష్, కో చైర్మన్ పురుషోత్తం, పీఓడబ్ల్యూ సం«ధ్య, ప్రజాఫ్రంట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ట్రంప్‌ను మించిపోయిన కేసీఆర్
రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు రాజకీయ పునరేకీకరణకు కోదండరామ్ ముందుకురావాలి తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ రామగిరి (నల్లగొండ) : ముఖ్యమంత్రి చర్యలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను మించిపోయాయని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అ«ధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. నల్లగొండలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, రాజ్యాంగం ఆయన హక్కుల పత్రం కాదని పేర్కొ న్నారు. ఆయనను విమర్శించిన వారిని జంతువులకంటే హీనంగా చూస్తున్నారని, కేసీఆర్ పాశవిక పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్‌ను ప్రశ్నించే రాజకీయ వ్యవస్థ తీవ్ర స్థాయిలో అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ హైద్రాబాద్‌లో ర్యాలీ నిర్వహించతలపెట్టిన జేఏసీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసి అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుందన్న సాకు.. ర్యాలీలో ఉగ్రవాదులు పాల్గొంటారనే నెపంతో ర్యాలీని భగ్నం చేయడం సహించలేనిదన్నారు. శంషాబాద్, శామీర్‌పేట, రామోజీ ఫిల్మ్‌సిటీ, నాగోల్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పడం ప్రభుత్వ దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలను కలుపుకుని పోవాలని సూచించారు. జేఏసీ ద్వారా కాకుండా రాజకీయ పార్టీగా ఆవిర్భవించి కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కె.పర్వతాలు, నార్కెట్‌పల్లి రమేష్, సందెపాక రాము, మోహనకృష్ణ, కొండేటి మురళి, సైదులు, విక్రం తదితరులు పాల్గొన్నారు. -
ఏదో ఆశించి కోదండరామ్ భంగ పడ్డారు
-
ఫార్మాకు వేల ఎకరాలెందుకు?
ప్రభుత్వానికి జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రశ్న కడ్తాల్: ఫార్మాసిటీ ఏర్పాటుకు వేలకొద్దీ ఎకరాల భూములు అవసరమా అని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో నిర్వహించిన ‘ఫార్మాసిటీ భూ నిర్వాసితుల గోస’ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనల ప్రకారం భూసేకరణ జరగడం లేదని ఆయన విమర్శించారు. జీవో కంటే పార్లమెంటు చేసిన చట్టం ఉన్నతమైనదని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల అంగీకారంతోనే భూములు సేకరించాలని సూచించారు. మార్కెట్ ధరకు 3 రెట్లు నష్టపరిహారం చెల్లించాలని, చట్టాన్ని అతిక్రమించి ఇష్టాను సారంగా భూ సేకరణ చేపట్టడం సరికాదన్నారు. రైతులు ఆలోచించి నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలని, వారికి అన్ని సమయాల్లో వెన్నంటి ఉంటామని కోదండరాం భరోసా ఇచ్చారు. భూములు కోల్పోతున్న రైతులకే కాకుండా వాటిపై ఆధారపడిన వారికీ పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. -
కోదండ దీక్షాస్త్రం
► సర్కారు నిర్బంధంపై టీజేఏసీ చైర్మన్ మండిపాటు ► నిర్వాసితుల హక్కులను హరించే చట్టాన్ని ఉపసంహరించుకోవాలి ► 2013 భూసేకరణ చట్టం ప్రకారమే వారికి పునరావాసం కల్పించాలి ► మాది బలప్రదర్శన కాదు.. నిర్వాసితుల గోడు వినిపించేందుకే ధర్నా ► అసెంబ్లీలో అన్యాయంగా ఆమోదించుకున్న బిల్లు నిలవదు ► పోరు ఆగదు.. నిర్వాసితులకు అండగా నిలుస్తామని వెల్లడి ► తన నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష ► కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, బీజేపీ న్యూడెమొక్రసీల మద్దతు ► ఈ నియంతృత్వం కోసమే తెలంగాణ తెచ్చుకున్నామా?: ఉత్తమ్ ► గొంతెత్తేవారిని అణచేయాలని ప్రభుత్వం చూస్తోంది: జానారెడ్డి ► నిరసనలను అడ్డుకోవడం మంచిది కాదు: కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్ : చట్టం ప్రకారం భూనిర్వాసితులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో తలపెట్టిన దీక్షకు అనుమతిని నిరాకరించి, జేఏసీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేసినందుకు నిరసనగా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం దీక్షకు దిగారు. గురువారం ఉదయమే కోదండరాం నివాసంలో జేఏసీ స్టీరింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశ మైంది. భేటీ అనంతరం తన నివాసంలోనే దీక్షకు దిగుతున్నట్టుగా కోదండరాం ప్రకటించారు. నిర్వాసితుల హక్కులను హరించే చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, భూసేకరణ చట్టం–2013 ప్రకారం వారికి పునరావాసం కల్పించాలని, అక్రమంగా అరెస్టు చేసిన జేఏసీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దీక్షకు దిగుతున్నట్టుగా తెలిపారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, న్యూడెమొక్రసీ, వివిధ ప్రజాసంఘాలు కోదండరాం దీక్షకు సంఘీభావాన్ని ప్రకటించాయి. ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేయడానికి అనుమతి ఇవ్వకుండా సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణితో, అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాం నివాసంలోనే ఉదయం నుంచి సాయంత్రం దాకా దీక్ష జరిగింది. వివిధ పార్టీలు, జేఏసీ స్టీరింగ్ కమిటీ సూచన మేరకు దీక్షను విరమిస్తున్నట్లు కోదండరాం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య చేతుల మీదుగా పండ్లరసాన్ని స్వీకరించి సాయంత్రం ఆయన దీక్షను విరమించారు. బల ప్రదర్శనకు కాదు.. బాధ చెప్పుకోవడానికే.. ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ వేదికపైకి పోలేదని, భూనిర్వాసితుల కోసమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు కోదండరాం తెలిపారు. ‘‘భూసేకరణపై అఖిల పక్షం ఏర్పాటు చేయాలని, భూసేకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని ప్రభుత్వానికి నివేదించినం. ప్రభుత్వం వినకుంటే ధర్నాకు పిలుపునిచ్చినం. జేఏసీ బలం చూపించాలని కాదు.. భూనిర్వాసితుల గోడును, గొంతును హైదరాబాద్‌కు వినిపించడానికే. ధర్నాకు అనుమతిని ఇవ్వకున్నా జేఏసీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. దీక్షకు అనుమతి ఇవ్వనప్పుడు, తిరస్కరించనప్పుడు జేఏసీ నేతలను ఎందుకు అరెస్టు చేశారు? నేను దీక్షకు దిగిన తర్వాతనే జేఏసీ నేతలను విడిచిపెట్టారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించుకున్న తీరు బాధాకరం. శాసనసభలో అందరికీ న్యాయం జరగాలి. అన్యాయంగా ఆమోదించుకున్న బిల్లు నిలువదు. భూసేకరణకు మేం వ్యతిరేకం కాదు. మల్లన్నసాగర్లో పదిరోజులు నిరసనలు జరిగినా వెళ్లలేదు. పది రోజుల తర్వాత ఇంజనీర్లు, న్యాయవాదులతో కలిసి వెళ్లిన తర్వాతనే పోరాటానికి దిగినం. మల్లన్నసాగర్ డీపీఆర్ ఎక్కడ, దానికి ఎంత భూసేకరణ అవసరం, భూమిని కోల్పోయినవారికి ఏమి ఇస్తారు అని అడిగితే నేరమా? భూసేకరణ చట్టం అమలు చేయకుండా భూమిని గుంజుకోవడానికే వ్యతిరేకం. ప్రాజెక్టులకు, అభివృద్ధికి మేం అడ్డం కాదు. మా ఐక్యతను తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. అన్ని సమస్యలపై ఐక్య కార్యాచరణ ఉంటుంది’’అని ఆయన స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వం నిర్బంధానికి దిగుతున్నదంటే.. తనకు తానే నిర్బంధం చేసుకుంటున్నట్టని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల, నిరసనల గొంతు నొక్కడం సాధ్యం కాదని వాళ్లు అర్థం చేసుకోవాలన్నారు. ‘‘దీక్షను విరమిస్తున్నా నిర్వాసితుల పక్షాన పోరాటం ఆగదు, వారికి జేఏసీ అండగా ఉంటుంది. వ్యక్తిగత నిర్ణయాలు, ఆదేశాలతో మేం పనిచేయం. స్టీరింగ్ కమిటీ నిర్ణయంతోనే దీక్షకు దిగిన, విరమించుకుంటున్నా’’అని వెల్లడించారు. ఇందుకే తెలంగాణ తెచ్చుకున్నామా?: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ప్రజాస్వామిక ధర్నాలకు, నిరసనలకు అనుమతిని ఇవ్వకుండా అరెస్టులు చేయడం దారుణం. ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన తెలంగాణవాదులు కోరుకున్న తెలంగాణ ఇదేనా? ప్రభుత్వ నిర్భంధాన్ని సహించేది లేదు. భూసేకరణ చట్టంపై లోతుగా చర్చ, అధ్యయనం జరగాలి. సీఎం కేసీఆర్ అబద్ధాలకోరు. అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగేదాకా పోరాటాలకు అండగా ఉంటాం. ప్రజల కోసం కోదండరాం ఉద్యమించడం ఆయన హక్కు, బాధ్యత. కేసీఆర్ చెప్పేదాకా కోదండరాం కులం తెలియదు: జానారెడ్డి, సీఎల్పీ నేత సీఎం కేసీఆర్ చెప్పేదాకా కోదండరాం సార్ రెడ్డి అని తెలియదు. కేసీఆర్ చెప్తేనే రెడ్డి అని తెలిసింది. ఒక సామాజిక ఉద్యమకారునిగానే కోదండరాం తెలుసు. అలాంటి కోదండరాంకు కులాన్ని ఆపాదించడం సరికాదు. తెలంగాణలో పాటలు పాడుతున్నవారిని, మాట్లాడుతున్నవారిని అణిచేయాలని ప్రభుత్వ చూస్తున్నది. కాంగ్రెస్ ఆగలేదు, తగ్గలేదు. ప్రజల్లో, మీలో చైతన్యం కోసం చూస్తున్నాం. భూనిర్వాసితులకోసం కోదండరాం చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలి. వెంటనే కోదండరాంతో ప్రభుత్వం చర్చించాలి. బంగారంలాంటి ముఖాన్ని చూడటానికి భయం: రేవంత్‌రెడ్డి, టీడీఎల్పీ నేత కోదండరాం సార్ ముఖం బంగారంలా ఉంటదని ఉద్యమకాలంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వంగివంగి దండాలు పెట్టిండు. ఇప్పుడేమో కోదండరాం సార్ ముఖాన్ని చూడాలంటే ఎందుకు భయపడుతున్నడు? తప్పు చేసిన వాళ్లే కేసీఆర్‌లా భయపడ్తరు. తెలంగాణను బొందలగడ్డగా మారుస్తున్న కేసీఆర్‌పై తిరుగుబాటు తప్పదు. ప్రభుత్వానికి భయం: కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత భూసేకరణ చట్టాన్ని సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ప్రభుత్వం ఎందుకో భయపడుతున్నది. భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులను ఆదుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా నిరసనలను అడ్డుకోవడం మంచిదికాదు. పేదల కోసం ఎందాకైనా..: చాడ వెంకటరెడ్డి, సారంపల్లి మల్లారెడ్డి, కె.గోవర్ధన్ భూనిర్వాసితులకు న్యాయం చేయాలని, చట్టం ప్రకారం వ్యవహరించాలని అడగడమే నేరమా? ప్రజలకోసం ఉద్యమాలే తప్పన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం దారుణం. నిరసన చెప్పేది ప్రజలే. ప్రజాస్వామిక నిరసనలపై, ఉద్యమాలపై సీఎం కేసీఆర్ తీరు సరికాదు. కోదండరాం పోరాటాలకు, పేదల కోసం జరుగుతున్న ఉద్యమాలకు ఎంతదాకా అయినా అండగా ఉంటాం. ప్రజలను వ్యతిరేకించడమే : చుక్కా రామయ్య, విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ నిరసనలు ప్రజలకు ప్రజాస్వామిక హక్కు, నిరసనలను అడ్డుకోవడమంటే ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించడమే. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదు. ఇది కోదండరాం వ్యక్తిగతం కాదు. ఇంకా ప్రజలను చైతన్యం చేయాలి. ప్రజా చైతన్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉద్యమించాలి. సంఘీభావం ప్రకటించిన వారెందరో... కోదండరాం దీక్షకు టీఆర్ఎస్, మజ్లిస్ మినహా అన్ని పార్టీలు సంఘీభావాన్ని ప్రకటించాయి. కాంగ్రెస్ ముఖ్య నేతలు షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మల్లు భట్టివిక్రమార్క, డి.కె.అరుణ, టి.జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వంశీచంద్‌రెడ్డి, పద్మావతీరెడ్డి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, బెల్లయ్యనాయక్ తదితరులు సంఘీభావం ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్య, అమర్‌నాథ్‌బాబు, ఎం.శ్రీనివాస్ సారంగపాణి మద్దతు తెలిపారు. ప్రజాసంఘాల నేతలు సంధ్య(పీవోడబ్ల్యూ), చెరుకు సుధాకర్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు సంఘీభావం ప్రకటించారు. శాంతిభద్రతల కోణంలోనే అనుమతి నిరాకరణ: డీజీపీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం గురువారం ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన దీక్షకు శాంతి భద్రతల కారణంతోనే అనుమతిని నిరాకరించామని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు, ఇతర సమస్యలు ఉన్నప్పుడు అన్నింటిని పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే కార్యక్రమాలకు అనుమతి ఇస్తామన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చన్న కారణంతోనే అనుమతి నిరాకరించామన్నారు. -
‘సమస్యలను ప్రశ్నిస్తే ఉలికిపాటెందుకు?’
టీఆర్ఎస్ తీరుపై మండిపడ్డ టీపీసీసీ నేతలు సాక్షి, హైదరాబాద్: సమస్యలను ప్రశ్నించిన జేఏసీ చైర్మన్ కోదండరాంపై దాడులు చేయించడం అప్రజా స్వామికమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతి నిధి బెల్లయ్యనాయక్ విమర్శించారు. గాంధీభవన్‌లో మంగళవారం విలేక రులతో వారు మాట్లాడుతూ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అడగడం నేరమా అని ప్రశ్నించారు. నియంతృత్వ ధోరణితో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాంపై ఎవరు మాట్లాడినా నాలుకలు కోస్తామని హెచ్చరించిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. నేడు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం: కాంగ్రెస్‌పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉత్సవాలను నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. -
తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇంత బలహీనమా?
-
తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇంత బలహీనమా?
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం, అధికార టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి జేఏసీ చైర్మన్ కోదండరామ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా సంబోధిస్తూ టీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఏఐసీసీ చీఫ్ తో భేటీపై విమర్శలను తోసిపుచ్చారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు ప్రభుత్వం తనపై దాడిచేస్తున్నదని ఆరోపించారు. జేఏసీ చైర్మన్ కోదండరామ్ బుధవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ..‘కొందరు టీఆర్ఎస్ నాయకులు నేను సోనియా గాంధీని కలిసి వచ్చానని అంటున్నారు. వాళ్లు చెప్పిన తేదీల్లో, అంటే, జూన్ 16న నేను వారణాసికి వెళ్లానేతప్ప ఢిల్లీకి కాదు, జూన్ 27న ఇందిరాపార్క్ ధర్నాలో పాల్గొన్నా. నేను ఎప్పుడు ఎక్కడ ఎం చేస్తున్నానో, ఎవరెవరిని కలుస్తున్నానో తెలుసుకోలేనంత బలహీనంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉందా?’ అని అన్నారు. ప్రజాసమస్యలపై సమాధానం చెప్పలేకే అధికార పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని కోదండరామ్ మండిపడ్డారు. జేఏసీ విమర్శలు నూటికి నూరుశాతం సామాజిక వాస్తవాలేనని, తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం ప్రతిచోటా దౌర్జన్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన తెలంగాణలో ప్రజలు ఆశించింది ఇలాంటి విధానాలు కావన్నారు. నవంబర్ 11న మంథనిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు తెలిపారు. 13న హైదరాబాద్‌లో వైద్యరంగ సమస్యలపై సదస్సు, 20న హైదరాబాద్‌లో సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, విద్యుత్ కేంద్రాలు, ఓపెన్ కాస్ట్‌ల సమస్యలపై సదస్సు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కోదండరామ్ పేర్కొన్నారు. -
'వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలి'
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలా అన్యాయం జరుగుతోందని జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ అన్నారు. ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన రైతు దీక్షలో ఆయన మాట్లాడుతూ..రైతు అంటేనే అవమానకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 90 శాతం రైతులు ఐదు ఎకరాల్లోపు ఉన్నవారేనన్నారు. ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం...ఒక రైతుపై రూ.90 వేల రుణభారం ఉందని చెప్పారు. తక్షణమే వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకురావాలని కోదండరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజా సంఘాలు పాల్గొని మద్దతు తెలిపాయి. -
'వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలి'
-
ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి
పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరాం జనగామ : కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. జనగామ జిల్లా సాధన కోసం పట్టణంలో మంగళవారం నిర్వహించిన జనగర్ఝన సభలో ఆయన మాట్లాడారు. నిపుణులతో కమిటీలు వేసి, అందరి సూచనలు, అభిప్రాయాలు తీసుకుని ప్రజల ముందు చర్చ పెడితే ఈ గందరగోళ పరిస్థితి ఉండేది కాదన్నారు. యాదాద్రికి తామెప్పుడూ వ్యతిరేకం కాదని, ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని, అయితే చరిత్ర కలిగిన జనగామను కూడా జిల్లా చేయాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ‘వద్దన్న హన్మకొండ వరంగల్ రూరల్ జిల్లాగా ఏర్పడుతుంది..కావాలన్న జనగామ ఎందుకు ఇవ్వడం లేదో అంతుచిక్కడం లేద’న్నారు. జిల్లాల ఏర్పాటు కోసం ప్రజల అభిప్రాయాలను తెలపాలని కోరుతూనే, హక్కు లేకుండా చేసే విచిత్ర పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి సాయుధ పోరాట చరిత్ర, జనగామ ప్రత్యేకతను గుర్తించాలని సూచించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల భావ స్వేచ్ఛకు భంగం కలిగించకుండా పాలన చేయాలే తప్ప.. ఉక్కుపాదంతో అణిచివేసే ధోరణి ఉండకూడదన్నారు. జనగర్జన సభ నిర్వహించుకుంటామని పోలీసులను అడిగితే అనుమతి నిరాకరించారు, హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నాము కదా, మీరే అంగీకరిస్తే రెండు గంటలు మాట్లాడుకునే వెళ్లేవారమని అన్నారు. జనగామ జిల్లా అయ్యేంత వరకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. సీఎంకు దండపెట్టి వేడుకుంటున్నా: ముత్తిరెడ్డి ‘జనగామ జిల్లా న్యాయమైన కోరిక..బ్రిటిష్ కాలంలోనే ఈ ప్రాంతాన్ని జిల్లా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు..వందేళ్ల క్రితమే జిల్లా కాకుండా ఆన్యాయం చేశారు’ అని స్థానిక, అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ జిల్లా ప్రతిపాదనను నాడే సీఎంకు దండం పెట్టి ఇచ్చానన్నారు. మంత్రిమండలి సమావేశంలోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏకతాటిపై నిలిచి మద్దుతుగా తమ అభిప్రాయాలను కమిటీకి తెలిపారని గుర్తు చేశారు. గద్వాల జిల్లాను చేసే ప్రసక్తే లేదని తేల్చేసిన కేసీఆర్.. జనగామ విషయమై మాట్లాడకపోవడం అనుకూల సంకేతాలు ఉండవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయన్నారు. జనగామ ప్రజల కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానని, జిల్లాను అడ్డుకోవద్దని అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బాధ్యత తనపై ఉందన్నారు. గర్జించిన జనగామ జిల్లా సాధన కోసం జనగామ గర్జించింది. పట్టణంలోని ప్రెస్టన్ మైదానంలో జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, మేధావులు, కవులు, కళాకారులు హాజరై ప్రసంగించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు సభ నిర్వహణకు హైకోర్టు అనుమతించడంతో చాలా మంది ముఖ్యులు మాట్లాడలేక పోయారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ.. తమ ఆస్థిత్వం కోసం సాగిన తెలంగాణ ఉద్యమం మాదిరిగానే జనగామ జిల్లా కోసం ప్రజలు పోరాడుతున్నారని అన్నారు. జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని కేసీఆర్‌కు సలహా ఇస్తున్నానని, దీన్ని ఇగోగా తీసుకోవద్దని అన్నారు. పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ బంగారు తెలంగాణలో జనగామకు ఎందుకు అన్యాయం చేశారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వచ్చి సభకు వచ్చి మాట్లాడటం కాదు..సీఎంను ఒప్పించి జిల్లా తీసుకు రావాలని కోరారు. సీపీఎం శాసనసభ పక్ష నేత, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ.. రాబోయే శాసన సభా సమావేశాల్లో జనగామ జిల్లాపై మొదటి ఎజెండాగా మాట్లాడతామని అన్నారు. ఏజెన్సీలోని భద్రాచలంతోపాటు జనగామ జిల్లా చేయాలని తమ పార్టీ నుంచి బలమైన నినాదం వినిపించామన్నారు. జిల్లాల నోటిఫికేషన్లో గందరగోళం ఏర్పడడంతో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. జనగామ ఆందోళనలను గౌరవించాలని కేసీఆర్‌ను కోరారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ మడమ తిప్పను..మాట తప్పను..తప్పితే తల నరుక్కుంటా.. అన్న కేసీఆర్ మాటలు ఉత్తివేనని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. జనగామ జిల్లా ఉద్యమాన్ని ఉక్కుపాదాలతో అణిచివేస్తూ సభకు అనుమతి నిరాకరించి ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు. కేసీఆర్ నయా నిజాంగా అవతారమెత్తాడని విమర్శించారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లా ఇవ్వకుంటే అధికార పార్టీ నేతలను తిరుగనివ్వబోమని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మాట తప్పుతున్న కేసీఆర్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని విమర్శించారు. ప్రజల నిర్ణయాన్ని పాలకులు పట్టించుకోక పోవడం సిగ్గుచేటన్నారు. సీపీఐ రాష్ట్ర నేత అజీజ్‌పాషా మాట్లాడుతూ తెలంగాణలో నూతన జిల్లాల ఏర్పాటులో పొలిటికల్ వ్యాపారమేంటని ప్రశ్నించారు. జనగామ చరిత్ర, ఇక్కడి వనరులను దృష్టిలో ఉంచుకొని జిల్లాచేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దనసరి సీతక్క మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం ఏర్పాటు చేస్తున్న జిల్లాల మంటలో సీఎం కేసీఆర్ పతనం తప్పదని అన్నారు. తెలంగాణలో మరో నైజాంలా అవతరించి నమ్ముకున్న ప్రజలను నట్టేట ముంచుతున్నాడని విమర్శించారు. జిల్లాలను ఇష్టారాజ్యంగా చేసుకుంటూ కుటుంబ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ జనగామ జిల్లా ఏర్పాటుకు బీజెపీ సంపూర్ణ మద్ధతు అందిస్తుందని అన్నారు. హన్మకొండ వద్దంటే వరంగల్ రూరల్ జిల్లా అంటూ పూటకో మాట మాట్లాడుతున్న ప్రభుత్వం ధ్వంద్వ నీతిని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామన్నారు. కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వంతో మాట్లాడి ఈ ప్రాంత ప్రజలకు ఆన్యాయం జరుగకుండా చూస్తామన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటులో కేసీఆర్ తన అహంకారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఆమోదించుకొని వస్తే ఆయనతో కలసి జనగామలో నిరాహార దీక్షకు కూర్చుంటానని అన్నారు. అధికారంలోకి రాగానే 11వ జిల్లా జనగామ అని ఎన్నికల సభలో చెప్పిన సీఎం కేసీఆర్ మాట మరిచిపోయారన్నారు. మా పోరాటం న్యాయమైందే.. -జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డి తమ ఆస్థిత్వాన్ని కాపాడుకునేందుకు జనగామ జిల్లా కోసం ఉద్యమం చేస్తున్నామని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డి అన్నారు. తాము చేస్తున్న పోరాటం న్యాయమైందని భావించి ప్రభుత్వం జనగామ జిల్లా చేస్తున్నట్లు ప్రకటించి ప్రజల ఆకాంక్షను విలువనివ్వాలని కోరారు. జన గర్జన సభకు పోలీసులు అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తే హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో లేని నిర్భంద కాండ స్వరాష్ట్రంలో తమపై మోపుతూ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచి వేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కోదండరాంను విమర్శించడం తగదు
► మల్లన్నసాగర్ నిర్వాసితుల పక్షాన పోరాటం ► సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఎదులాపురం : ప్రజల పక్షాన పోరాడుతున్న జేఏసీ చైర్మన్ కోదండరాంను టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, నేతలు విమర్శించడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం ఆదిలాబాద్‌లో పార్టీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వం రైతులను నష్టాల పాలు చేస్తోందని, మల్లన్న సాగర్ నిర్వాసితుల పక్షాన పోరాడుతామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని మరచి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలకు వాత పెడితే తిరిగి ప్రజలు వాతలు పెట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. అటవీ హక్కు చట్టాన్ని అనుసరించి పట్టాలు పంపిణీ చేసే వరకు గిరిజనుల పక్షాన పోరాడుతామని తెలిపారు. పార్టీలు మారే ముందు నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేసే విధంగా ఇష్టానుసారంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్, సహ కార్యదర్శి ఎస్.విలాస్, ముడుపు ప్రభాకర్‌రెడ్డి, నళినిరెడ్డి, అరుణ్‌కుమార్, సిర్ర దేవేందర్, మేస్రం భాస్కర్, కుంటాల రాములు పాల్గొన్నారు. -
కోదండరాంను విమర్శించే స్థాయి టీఆర్ఎస్ నేతలకు లేదు
టీడీపీ నేత రేవూరి ప్రకాష్‌రెడ్డి వరంగల్ : తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాంను విమర్శించే స్థాయి టీఆర్ఎస్ మంత్రులకు నేతలకు లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. హన్మకొండలోని బాలసముద్రంలో మంగళవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదండరాం రాజకీయ వ్యక్తి కాదని, ఆయన తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడానికి దోహదపడ్డారని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో జేఏసీ భాగస్వామ్యం ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏంచేశారని గులాబీ కండువాలు కప్పుకున్న కడియం, పోచారం, తలసాని ఆయన్ను విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె సమయంలో కేసీఆర్, హరీష్‌రావు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ తర్వాత అంతే నిబద్ధత గల వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం అని, ఆయనపై ఆరోపణలు చేయడాన్ని టీడీపీ ఖండిస్తోందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమార్, జిల్లా కార్యదర్శి బైరపాక ప్రభాకర్, బాస్కుల ఈశ్వర్, చాడ రఘునాథరెడ్డి, శ్రీరాముల సురేష్, సదానందం, మార్గం సారంగం, రవిగుప్తా పాల్గొన్నారు. -
‘మిషన్’లో భాగస్వాములు కండి
జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపు మేడ్చల్ రూరల్: మిషన్ కాకతీయలో భాగంగా చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గిర్మాపూర్ దాతర చెరువులో శ్రమదానం నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాద, పారిశ్రామిక జేఏసీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. చెరువు బాగుం టేనే ఊరు బాగుంటుందన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో తమవంతు సహకారం అందించేందుకు జేఏసీ శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర నాయకుడు మధుసూదన్, న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, పారిశ్రామికవేత్తల సంఘం రాష్ట్ర చైర్మన్ సుధీర్‌రెడ్డి, ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, ఇరిగేషన్ శాఖ ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే తదితరులు ప్రసంగించారు. -
త్వరలో రైతు జేఏసీ ఏర్పాటు
పరిగి: రాష్ట్రంలో విడివిడిగా ఉన్న రైతు సంఘాలన్నింటినీ ఏకం చేసి త్వరలో రైతు జేఏసీ ఏర్పాటు చేస్తామని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. పరిగిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నం పెట్టే రైతన్న అభివృద్ధి చెందితే దేశమైనా, రాష్ట్రమైనా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లేనన్నారు. నేడు రైతులు ఆత్మహత్యలవైపు మొగ్గుచూపుతుండటం వారి దుర్భరస్థితిని, అప్పుల వెతలను తెలియజేస్తుందన్నారు. రైతులు సంఘటితంగా ఉండాలని, అప్పుడే వారికి మంచి రోజులు వస్తాయన్నారు. రైతును మార్కెట్ శక్తులు దోపిడీ చేస్తున్నాయని తెలిపారు. చెట్టుకు చెద పురుగులు పట్టినట్లుగా రైతులను మార్కెట్ శక్తులు పట్టి పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చేస్తున్న ఉత్పత్తులకు రైతులు తప్ప.. ఇతర రంగాల్లో ఉత్పత్తి చేసిన వస్తువులకు ధర నిర్ణయిస్తుండగా.. రైతు పండించిన పంటలకు ధర నిర్ణయించే అధికారం ఇతర శక్తులు లాగేసుకుంటున్నాయన్నారు. అన్నం పెట్టే రైతన్నకు ప్రభుత్వ మద్దతు కూడా అందడం లేదన్నారు. బడ్జెట్లో రైతుకు న్యాయం జరగాలన్నారు. చిన్న,సన్నకారు రైతులకు అవసరమైన విధానాలు రూపొందించాలన్నారు. నాసిరకం ఎరువులు, విత్తనాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయన్నారు. రైతులందరూ ఏకమై తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తేనే సమస్యలను నుంచి గట్టెక్కుతారని తెలిపారు. రైతులు చేసే ఏ ప్రయత్నానికైనా జేఏసీ అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంత రైతులపై వివక్ష చూపటమే కాకుండా విధ్వంసం సృష్టించాయని తెలిపారు. మార్చి చివరి వారంలో రైతు సదస్సు.. మార్చి చివరివారంలో పరిగిలో రైతు సదస్సు నిర్వహించనున్నామని తెలిపారు. రైతులు, రైతుల సంఘాలు ఎవరికి వారు కాకుండా ఒక్క తాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు. పరిగి మార్కెట్ యార్డులో నిర్వహించనున్న ఈ రైతు సదస్సుకు రైతులు, రైతు సంఘాలన్నీ హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, నియోజకవర్గ కన్వీనర్ బసిరెడ్డి, జేఏసీ నియోజకవర్గ కో- ఆర్డినేటర్ ఆంజనేయులు, రైతు సంఘాల నాయకులు మిట్టకోడూర్ బాబయ్య, వెంకట్రాంరెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత విద్య’ను అమలు చేయాలి
⇒ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు అల్పాహారం ఇవ్వాలి ⇒మండలానికో రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయూలి ⇒జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరామ్ ⇒మానుకోటలో ప్రారంభమైన టీఎస్‌యూటీఎఫ్ జిల్లా మహాసభలు మహబూబాబాద్ : కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య పథకాన్ని ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయూలని జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య(టీఎస్‌యూటీఎఫ్) ఆధ్వర్యంలో మహబూబాబాద్‌లోని ఘనపురపు అంజయ్య గార్డెన్లో శనివారం జిల్లా మహాసభలు నిర్వహించారు. సభకు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.సోమశేఖర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ అసమానతలు, నిర్లక్ష్యం, వివక్ష, దోపిడీ తదితర కారణాలతో ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారని గుర్తు చేశారు. కార్పొరేట్ వర్గాలకు వ్యతిరేకంగా సకల జనులు ఐక్యమై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విద్యారంగంలోనూ ప్రైవేటు సంస్థలు పెరిగిపోవడంతో ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని తమ పిల్లల చదువు కోసమే ఖర్చు చేయూల్సి వస్తోందన్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా తరగతుల ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయూలని ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయం అల్పాహారం, సాయంత్రం భోజనం కూడా అందించాలన్నారు. మండలానికో రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయూలన్నారు. రైతులు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు. మరణం సమస్యకు పరిష్కారం కాదన్నారు. అనంతరం ‘తెలంగాణ అభివృద్ధి - ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ అన్నారు. విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉందన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డి మాట్లాడుతూ విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయూలని, అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. అనంతరం సాయంత్రం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, డీఈఓ చంద్రమోహన్, డిప్యూటీ డీఈఓ రవీందర్‌రెడ్డి, ఎంఈఓ లింగయ్య, జెడ్పీటీసీ మూలగుండ్ల వెంకన్న, ఎంపీపీ గోనె ఉమారాణి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, రాష్ట్ర నాయకురాలు దుర్గాభవాని, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఘనపురపు అంజయ్య, సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సదానంద్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి, సంఘం మండల అధ్యక్షుడు మురళీకృష్ణ, కార్యదర్శి వెంకటరమణ, నాయకులు యాకుబ్, బాలు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సంజీవ, నిరంజన్, శ్యామలరావు, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయూలి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయూలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. టీఎస్‌యూటీఎఫ్ జిల్లా మహాసభలో ‘తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ పాఠ్య పుస్తకాల్లో అనేక మార్పులు చేయూల్సి ఉందన్నారు. భూస్వామ్య, రాచరిక విధానాలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాల్సిందేనన్నారు. విద్యతోనే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని, సంపూర్ణ అక్ష్యరాస్యత సాధించినప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. సమైక్య పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా కుంటుపడిందన్నారు. సమాజంలో విద్యావంతులు మౌనంగా ఉంటే ఆ సమాజం నష్టపోతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని రేషనలైజేషన్ పేరిట పాఠశాలలను మూసివేయడం సబబు కాదన్నారు. నవతెలంగాణ నిర్మాణం కోసం ప్రొఫెసర్ కోదండరాం మరో ఉద్యమాన్ని నడపాలని, అందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
హైదరాబాద్ : తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏజెన్సీ నుంచి ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని జేఏసీ చైర్మన్ కోదండరాం కోరారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జీహెచ్ఎంసీ తెలంగాణ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ, కార్మికుల జేఏసీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్ట్ వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని, అది నేటికీ వెంటాడుతుందని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రోస్టర్ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని సూచించారు. ఆంధ్రావాళ్లు పోతూపోతూ పోలవరం సమస్యను సృష్టిస్తున్నారని, ఆదివాసులపై చంద్రబాబుకు నిజంగా ప్రేముంటే ఆ ఆర్డినెన్స్‌పై ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఔట్ సోర్సింగ్ జేఏసీ చైర్మన్ మహేష్, తెలంగాణ విద్యావంతుల వేదిక హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీధర్‌దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగాన్ని గౌరవించు
చంద్రబాబుకు టీ-జేఏసీ చైర్మన్ కోదండరాం హితవు సమన్యాయం పేరిట అన్యాయం చేయొద్దు ఏ ప్రాంత ఉద్యోగులు అక్కడికే వెళ్లాలి సిద్దిపేట : ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడు రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా నడుచుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం సూచించారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగుల విభజనపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. సమన్యాయం పేరిట తెలంగాణకు అన్యాయం చేస్తే సహించబోమన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు తెలంగాణలోనే పనిచేయాలని, ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లోనే పనిచేయాలన్నారు. రాష్ట్రస్థాయి నుంచి జోనల్‌స్థాయి వరకు రాజ్యాంగబద్ధమైన సూచనలు, నిబంధనలు ఆమలుపర్చాల్సిందేనన్నారు. తాత్కాలిక ఉద్యోగ కేటాయింపుల్లోనే రాజ్యాంగంలోని 370(డీ), రాష్ట్రపతి ఉత్తర్వులను పక్కాగా ఆమలు చేయలన్నారు. న్యాయశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, ప్రణాళిక శాఖల్లో తెలంగాణ ప్రాంత అధికారులు లేరన్నారు. ఇలాంటప్పుడు ఆంధ్ర అధికారుల పెత్తనాన్ని తెలంగాణ రాష్ట్రం ఎందుకు భరిస్తోందని ప్రశ్నించారు. హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద వచ్చే నెల 1న రాత్రి 8 గంటల నుంచి రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు ప్రారంభమై అర్ధరాత్రి వరకు కొనసాగుతాయన్నారు -
తెలంగాణ వ్యతిరేకులను ఓడిస్తాం!
టీ జేఏసీ ఎజెండా విడుదల చేసిన కోదండరాం ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని పార్టీల్లో చేర్చుకోవద్దు ఏ పార్టీకి మద్దతివ్వాలనేది త్వరలో భేటీ అయి నిర్ణయిస్తాం గత ఏడాదిగా కిరణ్ తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలి 1956 తర్వాత తెలంగాణలో అన్ని భూకేటాయింపులపై విచారణ జరపాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలి స్థానికత ఆధారంగానే ఉద్యోగులు, పెన్షనర్ల పంపిణీ జరగాలి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యతిరేక శక్తులు, వ్యక్తులను ఈ ఎన్నికల్లో ఓడిస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం తేల్చిచెప్పారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించిన నేతలను పార్టీలలో చేర్చుకోవడంపై పునరాలోచించుకోవాలని రాజకీయ పార్టీలకు సూచించారు. ఇది ఆ రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంచదని.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, అభిప్రాయాలకు అది విరుద్ధమని స్పష్టం చేశారు. ఇది మొత్తంగా తెలంగాణ సమాజానికి కూడా మంచిదికాదన్నారు. కొండా సురేఖ, మహేందర్‌రెడ్డి, జగ్గారెడ్డి లాంటి వారు ఎవరైనా సరే ఇందుకు మినహాయింపు కాదని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆదివారం టీజేఏసీ ఎజెండాను కోదండరాం హైదరాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం జేఏసీ నేతలు దేవీప్రసాద్, రఘు, మల్లేపల్లి లక్ష్మయ్య, రాజేందర్‌రెడ్డి, విఠల్ తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ ఎజెండాను ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు అందజేశామని, వారి నుంచి వచ్చిన సూచనలను కలిపి ఎజెండాను విడుదల చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలను పొందుపరుస్తూ ఎజెండాను రూపొందించామని.. దీనిని అమలు చేయాల్సిందిగా అన్ని రాజకీయపార్టీలను కోరుతామని కోదండరాం చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా నిలిచిన వైఎస్సార్సీపీ, టీడీపీలకు బుద్ధి చెబుతామన్నారు. వైఎస్సార్సీపీ సమైక్యవాదాన్ని వినిపించిన విషయాన్ని గుర్తుచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో మకాం వేసి తెలంగాణను అడ్డుకునేందుకు యత్నించారని మండిపడ్డారు. మద్దతుపై ఇంకా నిర్ణయించలేదు.. వచ్చే ఎన్నికల్లో ప్రత్యేకించి ఏ రాజకీయపార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయంలో టీ జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కోదండరాం చెప్పారు. దీనిపై త్వరలో సమావేశమై నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వం... ప్రజాస్వామిక విలువను గౌరవిస్తూ, అవినీతి రహిత పాలనను అందించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలను పొందడం ప్రజల హక్కుగా ఉండాలని... ఇందుకు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గత ఏడాది జూలై తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమీక్షించాలన్నారు. అదేవిధంగా 1956 తర్వాత తెలంగాణలో జరిగిన అన్ని భూకేటాయింపులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీజేఏసీ ఎజెండాలోని ముఖ్యాంశాలు.. ఇండియా గేట్ తరహాలో హైదరాబాద్‌లో అమరవీరుల స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రాల్లోనూ అలాంటివాటిని నిర్మించాలి.అమరుల కుటుంబాలకు పెన్షన్‌తో పాటు అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలి. వారి పిల్లలకు పీజీ వరకూ ఉచిత విద్యను అందించాలి. ఉద్యమం సందర్భంగా పెట్టిన అన్ని కేసులను ఎత్తివేయాలి. స్థానికత ఆధారంగానే ఉద్యోగులు, పెన్షనర్ల పంపిణీ జరగాలి. రాష్ట్రం ఏర్పడిన వెంటనే హైకోర్టు విభజన జరగాలి. రైతులకు ఉచితంగా పగలే 7 గంటలు విద్యుత్‌ను సరఫరా చేయాలి. ప్రజల పట్ల జవాబుదారీతనంతో, పారదర్శకంగా ప్రభుత్వం పనిచేయాలి. జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి. ప్రైవేటీకరణ విధానాలకు స్వస్తి పలకాలి. బీసీ సబ్‌ప్లాన్‌ను రూపొందించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించే చట్టం చేయాలి. సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. వారికి తక్కువ వడ్డీకే రుణాలివ్వాలి. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి. పరిశ్రమలను రాష్ట్రవ్యాప్తంగా వికేంద్రీకరించాలి.అన్ని కులాల్లోని పేదలకు 5 ఎకరాల మాగాణీ లేదా 10 ఎకరాల మెట్ట భూమిని పంపిణీ చేయాలి. సాగునీటి వ్యవస్థను అభివృద్ధి చేయాలి.కార్పొరేట్ విద్యా వ్యవస్థను నిర్మూలించాలి. ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయాలి. మూడో, నాలుగో తరగతి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. అన్ని ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. -
కోదండరాంకు అభినందన
బంజారాహిల్స్, : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను వాకర్స్ ఇంటర్నేషనల్ విశ్రాంత డిస్ట్రిక్ట్ గవర్నర్ ఏబీ కుప్పురాం ఆధ్వర్యంలో వందలాది మంది వాకర్లు మంగళవారం ఆయన నివాసంలో కలిసి ఘనంగా సత్కరించారు. మిఠాయిలు తినిపించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కోదండరాం వారితో మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ఎలా పాల్పంచుకున్నారో బంగారు తెలంగాణ ఏర్పాటులో కూడా అలాగే ముందుకు రావాలని సూచించారు. -
ఈజిప్టులో మానవ హక్కుల ఉల్లంఘన
దారుషిఫా, న్యూస్‌లైన్: ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఈజిప్టు ప్రభుత్వాన్ని కూల్చివేసి, ఆ దేశ అధ్యక్షుడిని నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ఇది అతి హేయమైన చర్యని, అక్కడి ఉద్యమకారులపై మిలటరీ అతి కిరాతకంగా కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈజిప్టులో జరుగుతున్న మారణకాండ, మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా జామాతే ఇస్లామీ హింద్ హైదరాబాద్ శాఖ బుధవారం కింగ్‌కోఠి ఈడెన్ గార్డెన్లో నిరసన సభను నిర్వహించింది. ఇందులో కోదండరాం మాట్లాడుతూ... అంతార్జాతీయ రాజనీతి సూత్రాలు, మానవహక్కులను కాలరాసి ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. వీటన్నిం టికీ అగ్రరాజ్యమైన అమెరికానే కారణమన్నారు. భారత ప్రభుత్వం రాజ్యంగంలోని ఆర్టికల్-4 ద్వారా ప్రపంచ శాంతికోసం అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అదేవిధంగా ఈజిప్టుతో విదేశాంగ సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలన్నారు. ఈ మారణకాండను ఆపాలని కోరుతూ వెంటనే అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని కార్యక్రమానికి హాజరైన ఇతర వక్తలు చెప్పారు. జామాతే ఇస్లామీ రాష్ర్ట అధ్యక్షులు ఖాజా ఆరీఫుద్దీన్, జమియతే ఆహేలే హదీస్ రాష్ర్ట అధ్యక్షులు మౌలానా షఫీ మదనీ, మైనార్టీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్‌ఖాన్, ఎమ్మెల్సీలు మహమూద్‌అలీ, మహ్మద్ సలీం, టీఆర్సీ చైర్మన్ వేదకుమార్, సియాసత్ మేనేజింగ్ డెరైక్టర్ జహీరుద్దీన్ అలీఖాన్ పాల్గొన్నారు.