
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
హైదరాబాద్ : తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏజెన్సీ నుంచి ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని జేఏసీ చైర్మన్ కోదండరాం కోరారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జీహెచ్‌ఎంసీ తెలంగాణ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ, కార్మికుల జేఏసీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్ట్ వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని, అది నేటికీ వెంటాడుతుందని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రోస్టర్ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని సూచించారు.
ఆంధ్రావాళ్లు పోతూపోతూ పోలవరం సమస్యను సృష్టిస్తున్నారని, ఆదివాసులపై చంద్రబాబుకు నిజంగా ప్రేముంటే ఆ ఆర్డినెన్స్‌పై ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఔట్ సోర్సింగ్ జేఏసీ చైర్మన్ మహేష్, తెలంగాణ విద్యావంతుల వేదిక హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీధర్‌దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.