సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకునే విషయంలో సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని వేతన సవరణ కమిషన్ ప్రభుత్వానికి కీలక సిఫారసులు చేసింది. తోచిన వారిని విధుల్లోకి తీసుకునే విధానానికి స్వస్తి పలకాలని సూచించింది. వయసు, విద్యార్హతల ఆధారంగా ఉపాధి కల్పన కార్యాలయాల్లో నిర్వహించే జాబితా తరహాలో నిర్వహించి, వారిని కామన్ టెస్ట్ కోసం ఏజెన్సీలు ప్రతిపాదించాలని పేర్కొంది.
ప్రభుత్వం ఏయే విభాగాల్లో ఏయే కేటగిరీల్లో ఎన్ని పోస్టులు వీరితో భర్తీ చేయాల్సి ఉంటుందో ఖాళీలు తెలుపుతూ నోటిఫై చేయాలని సూచించింది. ఆయా విభాగాల వారీగా అభ్యర్థులను తీసుకునే ముందు ప్రభుత్వం పరీక్ష నిర్వహించాలని, రాష్ట్ర స్థాయిలో జీఏడీ (సాధారణ పరిపాలన శాఖ)ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి ఖాళీల భర్తీ వేగంగా జరిగేలా చూడాలని తెలిపింది. పరీక్షల ఆధారంగా.. 1: 3 పద్ధతిలో అభ్యర్థుల వివరాలతో కూడిన తుది జాబితాలను ఆయా విభాగాలకు పంపి ఎంపికైన వారితో న్యాయబద్ధంగా ఒప్పందం కుదుర్చుకోవాలని పేర్కొంది. చదవండి: (ఫిట్‌మెంట్ 7.5%.. అంత తక్కువైతే.. మాకొద్దు)
రెమ్యునరేషన్ సిఫారసులు ఇలా..
►గ్రూప్–4 స్థాయిలోకి వచ్చే ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మెన్, మాలీ, కామాటి, కుక్, చౌకీదార్, ల్యాబ్ అటెండర్, డఫేదార్, జమేదార్, జిరాక్స్ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, క్యాషియర్, లిఫ్ట్ ఆపరేటర్లకు 2014 పీఆర్‌సీలో రెగ్యులర్ ఉద్యోగులకు రూ.13,000 నుంచి రూ.46,060 స్కేల్ పరిధిలో ఉంటే, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రస్తుతం నెలకు రూ.12 వేలు ఉండగా, దాన్ని రూ.19 వేలకు పెంచాలి.
►గ్రూప్–3 పరిధిలోకి వచ్చే డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్, జూ.స్టెనో, టైపిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫొటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ల్యాబ్ అసిస్టెంట్, సినిమా/ఫిల్మ్/ఆడియో విజువల్/డేటా ఎం ట్రీ ఆపరేటర్, సూపర్‌వైజర్, లైబ్రేరియన్, మేనేజర్లకు పీఆర్‌సీ–2014 ప్రకారం రూ. 15,460–రూ.58330 పేస్కేల్ ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు తత్సమాన పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రస్తుతం నెలకు రూ.15,000లు ఉండగా, దాన్ని రూ.22,900లకు పెంచాలి.
►గ్రూపు–3(ఏ) కేటగిరీ పరిధిలోకి వచ్చే సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్, కంప్యూటర్ ఆపరేటర్/డీపీవోలకు ఆర్‌పీఎస్–2014 ప్రకారం రూ.21,230–రూ.77,030 పేస్కేల్ పరిధిలో ని కేటగిరీలకు ప్రస్తుతం నెలకు రూ.17,500 చెల్లిస్తుండగా, దాన్ని రూ.31,040లకు పెంచాలి. వీరికి భవిష్యత్తులో పే స్కేల్ రివిజన్ జరిగే వరకు సంవత్సరానికి రూ.వెయ్యి చొప్పున పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రానందున ఇది హోం గార్డులకు కూడా వర్తిస్తుంది. ఎర్న్‌డ్ లీవ్స్ తప్ప రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో ఇతర వసతులు వర్తిస్తాయి. 6 నెలల ప్రసూతి సెలవు వర్తిసుంది. ఈపీఎఫ్, ఈఎస్‌ఐలు కూడా వర్తింపజేయాలి.
Comments
Please login to add a commentAdd a comment