
తెలంగాణ వ్యతిరేకులను ఓడిస్తాం!
టీ జేఏసీ ఎజెండా విడుదల చేసిన కోదండరాం
ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని పార్టీల్లో చేర్చుకోవద్దు
ఏ పార్టీకి మద్దతివ్వాలనేది త్వరలో భేటీ అయి నిర్ణయిస్తాం
గత ఏడాదిగా కిరణ్ తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలి
1956 తర్వాత తెలంగాణలో అన్ని భూకేటాయింపులపై విచారణ జరపాలి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలి
స్థానికత ఆధారంగానే ఉద్యోగులు, పెన్షనర్ల పంపిణీ జరగాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యతిరేక శక్తులు, వ్యక్తులను ఈ ఎన్నికల్లో ఓడిస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం తేల్చిచెప్పారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించిన నేతలను పార్టీలలో చేర్చుకోవడంపై పునరాలోచించుకోవాలని రాజకీయ పార్టీలకు సూచించారు. ఇది ఆ రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంచదని.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, అభిప్రాయాలకు అది విరుద్ధమని స్పష్టం చేశారు. ఇది మొత్తంగా తెలంగాణ సమాజానికి కూడా మంచిదికాదన్నారు. కొండా సురేఖ, మహేందర్‌రెడ్డి, జగ్గారెడ్డి లాంటి వారు ఎవరైనా సరే ఇందుకు మినహాయింపు కాదని స్పష్టం చేశారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆదివారం టీజేఏసీ ఎజెండాను కోదండరాం హైదరాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం జేఏసీ నేతలు దేవీప్రసాద్, రఘు, మల్లేపల్లి లక్ష్మయ్య, రాజేందర్‌రెడ్డి, విఠల్ తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ ఎజెండాను ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు అందజేశామని, వారి నుంచి వచ్చిన సూచనలను కలిపి ఎజెండాను విడుదల చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలను పొందుపరుస్తూ ఎజెండాను రూపొందించామని.. దీనిని అమలు చేయాల్సిందిగా అన్ని రాజకీయపార్టీలను కోరుతామని కోదండరాం చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా నిలిచిన వైఎస్సార్‌సీపీ, టీడీపీలకు బుద్ధి చెబుతామన్నారు. వైఎస్సార్‌సీపీ సమైక్యవాదాన్ని వినిపించిన విషయాన్ని గుర్తుచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో మకాం వేసి తెలంగాణను అడ్డుకునేందుకు యత్నించారని మండిపడ్డారు.
మద్దతుపై ఇంకా నిర్ణయించలేదు..
వచ్చే ఎన్నికల్లో ప్రత్యేకించి ఏ రాజకీయపార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయంలో టీ జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కోదండరాం చెప్పారు. దీనిపై త్వరలో సమావేశమై నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వం... ప్రజాస్వామిక విలువను గౌరవిస్తూ, అవినీతి రహిత పాలనను అందించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలను పొందడం ప్రజల హక్కుగా ఉండాలని... ఇందుకు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గత ఏడాది జూలై తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమీక్షించాలన్నారు. అదేవిధంగా 1956 తర్వాత తెలంగాణలో జరిగిన అన్ని భూకేటాయింపులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
టీజేఏసీ ఎజెండాలోని ముఖ్యాంశాలు..
ఇండియా గేట్ తరహాలో హైదరాబాద్‌లో అమరవీరుల స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రాల్లోనూ అలాంటివాటిని నిర్మించాలి.అమరుల కుటుంబాలకు పెన్షన్‌తో పాటు అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలి. వారి పిల్లలకు పీజీ వరకూ ఉచిత విద్యను అందించాలి. ఉద్యమం సందర్భంగా పెట్టిన అన్ని కేసులను ఎత్తివేయాలి.
స్థానికత ఆధారంగానే ఉద్యోగులు, పెన్షనర్ల పంపిణీ జరగాలి. రాష్ట్రం ఏర్పడిన వెంటనే హైకోర్టు విభజన జరగాలి. రైతులకు ఉచితంగా పగలే 7 గంటలు విద్యుత్‌ను సరఫరా చేయాలి. ప్రజల పట్ల జవాబుదారీతనంతో, పారదర్శకంగా ప్రభుత్వం పనిచేయాలి. జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించాలి. ప్రైవేటీకరణ విధానాలకు స్వస్తి పలకాలి. బీసీ సబ్‌ప్లాన్‌ను రూపొందించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించే చట్టం చేయాలి.
సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. వారికి తక్కువ వడ్డీకే రుణాలివ్వాలి. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి. పరిశ్రమలను రాష్ట్రవ్యాప్తంగా వికేంద్రీకరించాలి.అన్ని కులాల్లోని పేదలకు 5 ఎకరాల మాగాణీ లేదా 10 ఎకరాల మెట్ట భూమిని పంపిణీ చేయాలి. సాగునీటి వ్యవస్థను అభివృద్ధి చేయాలి.కార్పొరేట్ విద్యా వ్యవస్థను నిర్మూలించాలి. ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయాలి. మూడో, నాలుగో తరగతి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. అన్ని ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి.