ఉచిత విద్య’ను అమలు చేయాలి
⇒ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు అల్పాహారం ఇవ్వాలి
⇒మండలానికో రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయూలి
⇒జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరామ్
⇒మానుకోటలో ప్రారంభమైన టీఎస్‌యూటీఎఫ్ జిల్లా మహాసభలు
మహబూబాబాద్ : కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య పథకాన్ని ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయూలని జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య(టీఎస్‌యూటీఎఫ్) ఆధ్వర్యంలో మహబూబాబాద్‌లోని ఘనపురపు అంజయ్య గార్డెన్‌లో శనివారం జిల్లా మహాసభలు నిర్వహించారు. సభకు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.సోమశేఖర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ అసమానతలు, నిర్లక్ష్యం, వివక్ష, దోపిడీ తదితర కారణాలతో ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారని గుర్తు చేశారు. కార్పొరేట్ వర్గాలకు వ్యతిరేకంగా సకల జనులు ఐక్యమై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
విద్యారంగంలోనూ ప్రైవేటు సంస్థలు పెరిగిపోవడంతో ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని తమ పిల్లల చదువు కోసమే ఖర్చు చేయూల్సి వస్తోందన్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా తరగతుల ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయూలని ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయం అల్పాహారం, సాయంత్రం భోజనం కూడా అందించాలన్నారు. మండలానికో రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయూలన్నారు. రైతులు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు. మరణం సమస్యకు పరిష్కారం కాదన్నారు. అనంతరం ‘తెలంగాణ అభివృద్ధి - ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ అన్నారు. విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉందన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డి మాట్లాడుతూ విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయూలని, అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు చర్యలు చేపట్టిందన్నారు.
అనంతరం సాయంత్రం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, డీఈఓ చంద్రమోహన్, డిప్యూటీ డీఈఓ రవీందర్‌రెడ్డి, ఎంఈఓ లింగయ్య, జెడ్పీటీసీ మూలగుండ్ల వెంకన్న, ఎంపీపీ గోనె ఉమారాణి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, రాష్ట్ర నాయకురాలు దుర్గాభవాని, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఘనపురపు అంజయ్య, సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సదానంద్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి, సంఘం మండల అధ్యక్షుడు మురళీకృష్ణ, కార్యదర్శి వెంకటరమణ, నాయకులు యాకుబ్, బాలు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సంజీవ, నిరంజన్, శ్యామలరావు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయూలి
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయూలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. టీఎస్‌యూటీఎఫ్ జిల్లా మహాసభలో ‘తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ పాఠ్య పుస్తకాల్లో అనేక మార్పులు చేయూల్సి ఉందన్నారు. భూస్వామ్య, రాచరిక విధానాలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాల్సిందేనన్నారు.
విద్యతోనే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని, సంపూర్ణ అక్ష్యరాస్యత సాధించినప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. సమైక్య పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా కుంటుపడిందన్నారు. సమాజంలో విద్యావంతులు మౌనంగా ఉంటే ఆ సమాజం నష్టపోతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని రేషనలైజేషన్ పేరిట పాఠశాలలను మూసివేయడం సబబు కాదన్నారు. నవతెలంగాణ నిర్మాణం కోసం ప్రొఫెసర్ కోదండరాం మరో ఉద్యమాన్ని నడపాలని, అందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.