Residential Junior College
-
గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట్లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల లో ఒక విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని సోమవారం ఉదయం గుర్తు తెలియని లిక్విడ్ తాగింది. కొంతసేపటికి గమనించిన నిర్వాహకులు ఆమెను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.ఇంగ్లిష్ మీడియం కారణంగా చదువులో వెనుకబడిపోయాననే ఆవేదనతోనే ఆమె ఆత్మహత్యకు యత్నించిందని సమాచారం. -
ఉచిత విద్య’ను అమలు చేయాలి
⇒ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు అల్పాహారం ఇవ్వాలి ⇒మండలానికో రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయూలి ⇒జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరామ్ ⇒మానుకోటలో ప్రారంభమైన టీఎస్‌యూటీఎఫ్ జిల్లా మహాసభలు మహబూబాబాద్ : కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య పథకాన్ని ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయూలని జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య(టీఎస్‌యూటీఎఫ్) ఆధ్వర్యంలో మహబూబాబాద్‌లోని ఘనపురపు అంజయ్య గార్డెన్లో శనివారం జిల్లా మహాసభలు నిర్వహించారు. సభకు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.సోమశేఖర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ అసమానతలు, నిర్లక్ష్యం, వివక్ష, దోపిడీ తదితర కారణాలతో ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారని గుర్తు చేశారు. కార్పొరేట్ వర్గాలకు వ్యతిరేకంగా సకల జనులు ఐక్యమై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విద్యారంగంలోనూ ప్రైవేటు సంస్థలు పెరిగిపోవడంతో ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని తమ పిల్లల చదువు కోసమే ఖర్చు చేయూల్సి వస్తోందన్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా తరగతుల ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయూలని ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయం అల్పాహారం, సాయంత్రం భోజనం కూడా అందించాలన్నారు. మండలానికో రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయూలన్నారు. రైతులు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు. మరణం సమస్యకు పరిష్కారం కాదన్నారు. అనంతరం ‘తెలంగాణ అభివృద్ధి - ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ అన్నారు. విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉందన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డి మాట్లాడుతూ విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయూలని, అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. అనంతరం సాయంత్రం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, డీఈఓ చంద్రమోహన్, డిప్యూటీ డీఈఓ రవీందర్‌రెడ్డి, ఎంఈఓ లింగయ్య, జెడ్పీటీసీ మూలగుండ్ల వెంకన్న, ఎంపీపీ గోనె ఉమారాణి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, రాష్ట్ర నాయకురాలు దుర్గాభవాని, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఘనపురపు అంజయ్య, సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సదానంద్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి, సంఘం మండల అధ్యక్షుడు మురళీకృష్ణ, కార్యదర్శి వెంకటరమణ, నాయకులు యాకుబ్, బాలు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సంజీవ, నిరంజన్, శ్యామలరావు, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయూలి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయూలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. టీఎస్‌యూటీఎఫ్ జిల్లా మహాసభలో ‘తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ పాఠ్య పుస్తకాల్లో అనేక మార్పులు చేయూల్సి ఉందన్నారు. భూస్వామ్య, రాచరిక విధానాలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాల్సిందేనన్నారు. విద్యతోనే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని, సంపూర్ణ అక్ష్యరాస్యత సాధించినప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. సమైక్య పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా కుంటుపడిందన్నారు. సమాజంలో విద్యావంతులు మౌనంగా ఉంటే ఆ సమాజం నష్టపోతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని రేషనలైజేషన్ పేరిట పాఠశాలలను మూసివేయడం సబబు కాదన్నారు. నవతెలంగాణ నిర్మాణం కోసం ప్రొఫెసర్ కోదండరాం మరో ఉద్యమాన్ని నడపాలని, అందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. -
బాలికలదే పైచేయి
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో బాలికలు అధిక ఉత్తీర్ణత సాధించారు. వివిధ కళాశాలల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులతో మెరిశారు. గత ఏడాదికంటే ఈ ఏడాది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఒక శాతం అదనంగా ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్ఐవో) పి.మాణిక్యం శనివారం విడుదల చేశారు. జిల్లా విద్యార్థులు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత కంటే 1.5 శాతం అదనపు ఉత్తీర్ణత సాధించారు. 67 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 7వ స్థానంలో నిలిచారు. ఉత్తీర్ణతలో బాలురు కంటే బాలికలదే పైచేయి. జిల్లా సగటు కంటే బాలికలు 5 శాతం అదనంగా ఉత్తీర్ణులయ్యారు. బాలురు జిల్లా సగటు ఉత్తీర్ణత కంటే మూడు శాతం తక్కువ ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీ ఇంగ్లిష్ మీడియంలో చీరాల విజ్ఞాన భారతి కళాశాల విద్యార్థిని బొలిశెట్టి సాయిప్రసన్న 988/1000 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. అద్దంకి గోవిందాంబికా పరమేశ్వరి జూనియర్ కాలేజీ విద్యార్థిని తాడి దివ్యవాణి, చీరాల శ్రీగౌతమి జూనియర్ కాలేజీకి చెందిన యడవల్లి రాఘవేంద్ర 987/1000 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. బైపీసీ ఇంగ్లిష్ మీడియంలో ఒంగోలు శ్రీచైతన్య కాలేజీకి చెందిన కత్తినేని లక్ష్మీకావేరి 975/1000 మార్కులతో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అదే కాలేజీకి చెందిన కే శిరీష 973/1000 మార్కులతో జిల్లా ద్వితీయ స్థానం సాధించింది. ఎంఈసీలో మార్కాపురం శ్రీ సాధన జూనియర్ కాలేజీకి చెందిన బి. సాయికుమార్ 970 మార్కులతో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచారు. ఒంగోలు శ్రీగురు అకాడమీ విద్యార్థులు ఎమ్.మహేష్ 969/1000 మార్కులతో జిల్లా ద్వితీయ స్థానం, జి.బాలాజీ 960/1000 మార్కులతో తృతీయ స్థానం, పీ లక్ష్మీనారాయణ 959/1000 మార్కులతో నాల్గవ స్థానంలో నిలిచారు. 67 శాతం ఉత్తీర్ణత జిల్లాలో పరీక్షలకు మొత్తం 21,385 మంది హాజరు కాగా 14,390 మంది ఉత్తీర్ణులయ్యారు. 67 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో బాలురు 11,655 మంది పరీక్షకు హాజరు కాగా 7,423 మంది పాసై 64 శాతం ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా బాలికలు 9,730 మంది పరీక్షలకు హాజరు కాగా 6,967 మంది పాసయ్యారు. 72 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆర్ఐవో మాణిక్యం తెలిపారు. ఫలితాల్లో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. గతేడాది కూడా జిల్లా ఇంటర్ ఫలితాల్లో 7వ స్థానంలోనే నిలిచింది. మొదటి సంవత్సరం ఫలితాలతో పోల్చుకుంటే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 11 శాతం మంది అదనంగా ఉత్తీర్ణులయ్యారు. సత్తా చాటిన ప్రభుత్వ కళాశాలలు: ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా సగటు కంటే 2.67 శాతం అదనపు ఉత్తీర్ణత సాధించి శభాష్ అనిపించారు. ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో కూడా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల సాధనలో ఉప్పుగుండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లాలో అగ్ర స్థానంలో నిలిచింది. ఈ కళాశాల విద్యార్థులు 94.50 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 109 మంది పరీక్షకు హాజరు కాగా 103 మంది పాసయ్యారు. దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు 90.32 శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచారు. 62 మంది పరీక్షకు హాజరు కాగా 56 మంది పాసయ్యారు. యర్రగొండపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 86.98 శాతం ఉత్తీర్ణత సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. 215 మంది పరీక్షకు హాజరు కాగా 187 మంది పాసయ్యారు. మద్దిపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉత్తీర్ణతలో అట్టడుగున నిలిచింది. ఈ కళాశాల విద్యార్థులు కేవలం 38.10 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 63 మంది పరీక్షకు హాజరు కాగా కేవలం 24 మంది మాత్రమే పాసయ్యారు. చతికిలపడిన ఎయిడెడ్ కళాశాలలు: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఎయిడెడ్ కళాశాలలు అట్టడుగున నిలిచాయి. జిల్లా సగటు కంటే 21 శాతం తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. ఎయిడెడ్ కళాశాలల్లో జిల్లా సగటు కంటే నూతలపాడు డీఎస్వీకేఆర్ఎం జూనియర్ కళాశాల అదనపు ఉత్తీర్ణత సాధించింది. ఈ కళాశాల విద్యార్థులు 80 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు హాజరైన 15 మందికి గాను 12 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒంగోలులోని హెచ్‌సీఎం జూనియర్ కళాశాల 63.64 శాతంతో జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ కళాశాలలో 77 మంది పరీక్షకు హాజరు కాగా 49 మంది ఉత్తీర్ణులయ్యారు. పర్చూరు బీఏఆర్ అండ్ టీఏ జూనియర్ కళాశాల, చీరాల సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాల విద్యార్థులు 57.14 శాతం ఉత్తీర్ణతతో తృతీయ స్థానంలో నిలిచారు. ఫలితాల సాధనలో ఒంగోలు ఏబీఎం జూనియర్ కళాశాల అట్టడుగున నిలిచింది. ఈ కళాశాల నుంచి 15 మంది పరీక్షకు హాజరు కాగా కేవలం నలుగురు మాత్రమే పాసయ్యారు. సాంఘిక సంక్షేమ, గురుకుల జూనియర్ కళాశాలల్లో.. జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల విద్యార్థులు జిల్లా సగటు కంటే 26.69 శాతం అదనపు ఉత్తీర్ణత సాధించారు. పెదపవని జూనియర్ కళాశాల 98.63 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కళాశాల నుంచి 73 మంది పరీక్షలు రాయగా 72 మంది ఉత్తీర్ణులయ్యారు. సింగరాయకొండ జూనియర్ కళాశాలలో 54 మందికి గాను 51 మంది ఉత్తీర్ణులై 94. 44 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచారు. అర్ధవీడు జూనియర్ కళాశాలలో 51 మందికిగాను 48 మంది పాసయ్యారు. చీమకుర్తి జూనియర్ కళాశాల 90 శాతం ఉత్తీర్ణతతో చిట్టచివరన నిలిచింది.